వాయుసేనకు ‘తేజస్‌’!

ABN , First Publish Date - 2021-01-14T06:58:03+05:30 IST

వాయుసేనను మరింత పటిష్ఠపరిచే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రూ. 48వేల కోట్ల విలువైన 83 తేజస్‌ యుద్ధవిమానాల కొనుగోలుకు

వాయుసేనకు ‘తేజస్‌’!

రూ. 48వేల కోట్లతో 83 ఎల్‌సీఏ-తేజస్‌..

విమానాల కొనుగోలుకు సీసీఎస్‌ ఆమోదముద్ర

అతి పెద్ద దేశీయ రక్షణ డీల్‌

యూఏఈతో వాతావరణ సమాచార మార్పిడి..

ఒప్పందానికి కేబినెట్‌ ఓకే’

ఆత్మనిర్భర్‌ భారత్‌కు ఊతం: ప్రధాని


న్యూఢిల్లీ, జనవరి 13: వాయుసేనను మరింత పటిష్ఠపరిచే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రూ. 48వేల కోట్ల విలువైన 83 తేజస్‌ యుద్ధవిమానాల కొనుగోలుకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని భద్రత వ్యవహారాల కమిటీ(సీసీఎస్‌) ఆమోదం తెలిపింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ట్విటర్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు. ‘‘మున్ముందు కాలంలో వాయుసేనకు ఎల్‌సీఏ-తేజస్‌ విమానాలు వెన్నెముకగా మారనున్నాయి. మునుపెన్నడూ భారత్‌ వినియోగించని అధునాతన సాంకేతికతలు తేజ్‌సలో భారీగా ఉన్నాయి. దేశీయ ఏరోస్పేస్‌ ఉత్పత్తి రంగాన్ని సమూలంగా స్వయం సమృద్ధికి మార్చడంలో తేజస్‌ కార్యక్రమం ఒక ఉత్ర్పేరకంగా పనిచేస్తుంది. ఈ చరిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకున్న ప్రధాని మోదీకి నా కృతజ్ఞతలు’’ అని రాజ్‌నాథ్‌ పేర్కొన్నారు. ‘ఆత్మనిర్భర్‌ భారత్‌’ లక్ష్యానికి తాజా నిర్ణయం ఊతంగా నిలుస్తుందని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.  సాయుధ బలగాల సామర్థ్యాన్ని ఈ కొనుగోలు మరింత బలపరుస్తుందని ఆయన ట్విటర్‌లో పేర్కొన్నారు. రక్షణ రంగంలో ఇది అతిపెద్ద దేశీయ కొనుగోలు కావడం గమనార్హం. తేలికపాటి యుద్ధవిమానాలైన(ఎల్‌సీఏ-లైట్‌ కాంబాట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌) ‘తేజస్‌- మార్క్‌ 1ఏ’లను హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌(హాల్‌) తయారుచేస్తోంది. ఇప్పుడు ఉన్న నాల్గవ తరం యుద్ధవిమానాల కంటే తేజస్‌ మెరుగైన విమానం కావడం విశేషం.


ఇదిలా ఉండగా.. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యూఏఈ)తో శాస్త్ర, సాంకేతిక రంగాల్లో సహకారాన్ని పెంపొందించే ఒప్పందానికి(ఎంఓయూ) కేంద్ర కేబినెట్‌ బుధవారం ఆమోదం తెలిపింది. భారత ఎర్త్‌ సైన్సెస్‌ మంత్రిత్వ శాఖకు(ఎంఓఈఎస్‌), యూఏఈ వాతావరణ కేంద్రానికి(ఎన్‌సీఎం) మధ్య జరిగిన ఒప్పందం, వాతావరణ, భూకంప, మహాసముద్రాల విపత్తుల సమాచారాన్ని, ఉత్పత్తుల్ని ఇచ్చిపుచ్చుకునేందుకు ఉపకరిస్తుందని అందులో స్పష్టం చేసింది.

Updated Date - 2021-01-14T06:58:03+05:30 IST