ఎన్‌ఆర్‌ఐల చేతికి ఎయిరిండియా

ABN , First Publish Date - 2020-03-05T06:23:51+05:30 IST

ఎయిర్‌ ఇండియా ప్రైవేటీకరణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కంపెనీ ఈక్విటీలో ప్రవాస భారతీయులు (ఎన్‌ఆర్‌ఐ) నూరు శాతం వాటా కొనుగోలు చేసేందుకు...

ఎన్‌ఆర్‌ఐల చేతికి ఎయిరిండియా

నూరు శాతం వాటాకు కేబినెట్‌ ఓకే

ఏప్రిల్‌ 1 నుంచే బ్యాంకుల విలీనం


న్యూఢిల్లీ: ఎయిర్‌ ఇండియా ప్రైవేటీకరణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కంపెనీ ఈక్విటీలో ప్రవాస భారతీయులు (ఎన్‌ఆర్‌ఐ) నూరు శాతం వాటా కొనుగోలు చేసేందుకు ఆమోదం తెలిపింది. ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన కేంద్ర కేబినెట్‌ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ప్రవాసులైన భారత జాతీయులకు మాత్రమే ఇది వర్తిస్తుంది. ఇందుకు అడ్డంకిగా ఉన్న నిబంధనలనూ సవరించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఎయిర్‌ ఇండియాలో నూరు శాతం వాటా కొనుగోలుకు ఎన్‌ఆర్‌ఐలు ప్రభుత్వం నుంచి ఎలాంటి ముందస్తు అనుమతులు తీసుకోవాల్సిన అవసరమూ ఉండదని తెలిపింది. ఆటోమేటిక్‌ పద్ధతిలో వీ రు నేరుగా ఇందుకోసం బిడ్స్‌ దాఖలు చేయవచ్చు. హిందుజాలతో సహా పలువురుఎన్‌ఆర్‌ఐలు భారత విమానయా న రంగంలో ప్రవేశించేందుకు  ఆసక్తి వ్యక్తం చేశారు. 


విదేశీ’పై పరిమితులు 

దేశీయ విమానయాన సంస్థల ఈక్విటీలో, విదేశీ సంస్థల పెట్టుబడులు 49 శాతం మించకూడదన్న నిబంధన ఎయిర్‌ ఇండియాకూ వర్తిస్తుందని ప్రభుత్వం తెలిపింది. దీంతో అంతర్జాతీయ విమానయాన సంస్థలేవీ ఎయిర్‌ ఇండియాపై పెద్దగా ఆసక్తి చూపక పోవచ్చని భావిస్తున్నారు.


కంపెనీల చట్టానికి సవరణలు 

కంపెనీల చట్టానికి తలపెట్టిన 72కు పైగా సవరణలకూ  కేంద్ర కేబినెట్‌ బుధవారం ఆమోదం తెలిపింది. దీంతో ఈ చట్టంలో పేర్కొన్న కొన్ని అపరాధాలను నేరాలుగా పరిగణించడం ఆగిపోతుంది. రాజీకి అవకాశం ఉన్న 66  అపరాధాల్లో 23 అపరాధాలను పునర్‌ వ్యవస్థీకరిస్తారు. 


ఏప్రిల్‌ 1 నుంచే విలీనాలు 

ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎ్‌సబీ) విలీనాలపై కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఎట్టి పరిస్థితుల్లో ఏప్రిల్‌ 1కల్లా ఈ విలీనాలు పూర్తి చేస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు. అనుమతుల పరంగా ఇందుకు ఎలాంటి అడ్డంకులు లేవన్నారు. పది పీఎ్‌సబీలను నాలుగు బ్యాంకులుగా విలీనం చేయాలని ప్రభుత్వం గత ఏడాది ఆగస్టులో నిర్ణయించింది. 

Updated Date - 2020-03-05T06:23:51+05:30 IST