విమానాశ్రయాలకు ‘లుక్‌ అవుట్‌’ నోటీసు

ABN , First Publish Date - 2021-12-24T14:17:40+05:30 IST

ఆవిన్‌ సహా ప్రభుత్వ సంస్థలలో ఉద్యోగాలు తీసి స్తానంటూ పలువురి వద్ద రూ.3.10 కోట్ల మేరకు వసూలు చేసి మోసగించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అన్నాడీఎంకే సీనియర్‌ నేత, మాజీ మంత్రి రాజేంద్ర బాలాజీ ఆచూకీ

విమానాశ్రయాలకు ‘లుక్‌ అవుట్‌’ నోటీసు

                - రాజేంద్రబాలాజీ కోసం కొనసాగుతున్న గాలింపు


చెన్నై: ఆవిన్‌ సహా ప్రభుత్వ సంస్థలలో ఉద్యోగాలు తీసి స్తానంటూ పలువురి వద్ద రూ.3.10 కోట్ల మేరకు వసూలు చేసి మోసగించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అన్నాడీఎంకే సీనియర్‌ నేత, మాజీ మంత్రి రాజేంద్ర బాలాజీ ఆచూకీ కోసం ప్రత్యేక పోలీసు బృందాలు ఏడో రోజు కూడా ముమ్మరంగా గాలించాయి. రాజేంద్రబాలాజీ విదేశాలకు పారిపోకుండా ఉండేందుకుగాను అన్ని విమానాశ్రయాలకు పోలీసు శాఖలుక్‌ అవుట్‌ నోటీసులు జారీ చేసింది. ఉద్యోగాల పేరుతో పలువురిని మోసగించిన కేసులో రాజేంద్రబాలాజీ ఆయన సహాయకులపై విరుదునగర్‌ క్రైం విభాగం పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసుల్లో అరెస్టు కాకుండా ఉండేందుకు రాజేంద్రబాలాజీ చేసిన తీవ్ర ప్రయత్నాలేవీ ఫలించలేదు. బెయిలు కోసం హైకోర్టు నుండి సుప్రీం కోర్టు దాకా వెళ్ళారు. ఈ పరిస్థితులలో ఆయనను అరెస్టు చేసేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. పది ప్రత్యేక పోలీసు బృందాలు విరుదునగర్‌, మదురై, కోయంబత్తూరు, కొడైకెనాల్‌ తదితర ప్రాంతాల్లో రాజేంద్ర బాలాజీ ఆచూకీ కోసం గాలిస్తున్నాయి. కేరళ, కర్నాటకలోని పలు నగరాలలోనూ ఈ గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితులలో ఆయన విదేశాలకు పారిపోకుండా ఉండేలా పోలీసులు చర్యలు చేపట్టారు. ఆ ప్రకారం రాష్ట్రంలో ఉన్న అన్ని విమానాశ్రయాలకు లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ చేశారు. అదే సమయంలో విమానాశ్రయాలలో ప్రత్యేకదళం పోలీసులు మఫ్టీలో తీవ్ర నిఘా వేశారు. గత ఏడు రోజులుగా రాజేంద్ర బాలాజీ ఆచూకీ కోసం రాష్టమంతటా పోలీసులు గాలిస్తున్నారు. 

Updated Date - 2021-12-24T14:17:40+05:30 IST