Jul 24 2021 @ 21:24PM

నవరసాలు ఉండే కథలకే నా ఇంపార్టెన్స్: ఐశ్వర్యా రాజేష్

తెలుగు, తమిళ భాషల్లో అనేక ప్రాజెక్టుల్లో నటిస్తూ అత్యంత బిజీ అయిన హీరోయిన్‌ ఐశ్వర్యా రాజేష్‌. ఆమె కోలీవుడ్‌లో నటించిన తాజా చిత్రం ‘దిట్టమ్‌ ఇరండు’ (ప్లాన్‌ బి). విఘ్నేష్‌ కార్తీక్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 30వ తేదీన సోనీ లైవ్‌ ఓటీటీ ప్లాట్‌ఫాంలో టెలికాస్ట్‌ కానుంది. గోగుల్‌ బెనోయ్‌ కెమెరామెన్‌గా పనిచేయగా, సతీష్‌ రఘునాథ్‌ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. ఈ మూవీ విడుదలను పురస్కరించుకుని శుక్రవారం చిత్ర హీరోయిన్‌ ఐశ్వర్యా రాజేష్‌, దర్శకుడు విఘ్నేష్‌ కార్తీక్‌, నిర్మాతలు దినేష్ కుమార్‌, వినోద్‌ కుమార్‌ విలేకరులతో మాట్లాడారు. కరోనా రెండో దశ వ్యాప్తి కారణంగా థియేటర్లు మూసివేయడంతో ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ‘దిట్టమ్‌ ఇరండు’ చిత్రం కుటుంబ సభ్యులంతా కలిసి చూడదగిన సినిమా. కానీ, ఇపుడు ఫ్యామిలీ అంతా థియేటర్‌కు వచ్చి చూసే పరిస్థితి లేదు. అందుకే ఓటీటీ ఫ్లాట్‌ఫాంను ఎంచుకున్నామని తెలిపారు. ఈ మధ్యకాలంలోనే ‘తేన్‌’, ‘వాళ్‌’, ‘సర్బట్టా’ వంటి పలు చిత్రాలు విడుదలయ్యాయి. మున్ముందు కూడా పలు చిత్రాలు రిలీజ్‌ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. అందువల్ల ఈ చిత్రాన్ని కూడా ఓటీటీలో విడుదల చేసేందుకు మొగ్గు చూపామని నిర్మాతలు తెలిపారు. 


కథను పరిశీలిస్తే, ఈ చిత్రం ఒక మిస్టరీ థ్రిల్లర్‌. ఈ తరహా కథ వెండితెరపై చూపించడం ఇది తొలిసారి అని చెప్పొచ్చు. ఇందులో ఐశ్వర్యా పోలీస్‌ ఆఫీసర్‌గా నటించారు. ఈ చిత్రంలో తన పాత్ర తదితర అంశాలపై ఐశ్వర్యా రాజేష్‌ మాట్లాడుతూ.. ‘‘కరోనా మహమ్మారి సమయంలో ప్రత్యామ్నాయం ఓటీటీ వేదిక. అందులోనూ మంచి కలెక్షన్లు వచ్చాయి. నేను ఎంచుకునే కథలో ప్రేమ, ఎమోషన్స్‌, కుటుంబ బంధాలు, హాస్యం ఇలా నవరసాలు ఉండాలి. అలాంటి కథలకు అధిక ప్రాధాన్యత ఇస్తాను. లేడీ ఓరియంటెడ్‌ పాత్రలతో వచ్చే చిత్రాలకు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌ ఉత్తమ వేదికగా చెప్పవచ్చు. అలాగే, ఒక నటి అంటే అన్ని రకాల పాత్రలను పోషించాలి. అందుకే నేను అన్ని రకాల పాత్రలను పోషించేందుకు ప్రయత్నిస్తున్నాను. అలాగే, కథ డిమాండ్‌ చేస్తే గ్లామర్‌, ఎక్స్‌పోజింగ్‌ లేదా ఐటమ్‌ సాంగ్‌లు చేయడంలో ఎలాంటి తప్పులేదనేది నా భావన..’’ అని అన్నారు.