పౌర సమాజం కొత్త యుద్ధ రంగంగా మారింది : అజిత్ దోవల్

ABN , First Publish Date - 2021-10-28T21:57:43+05:30 IST

యుద్ధ రంగం భౌగోళిక సరిహద్దుల నుంచి పౌర సమాజాలకు

పౌర సమాజం కొత్త యుద్ధ రంగంగా మారింది : అజిత్ దోవల్

పుణే : యుద్ధ రంగం భౌగోళిక సరిహద్దుల నుంచి పౌర సమాజాలకు మారిందని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చెప్పారు. ప్రజారోగ్యం, వారి సంక్షేమం, భద్రత, ప్రభుత్వంపై వారి అభిప్రాయం ఓ దేశ శక్తి, సామర్థ్యాలను ప్రభావితం చేస్తున్నట్లు తెలిపారు. దేశ భద్రతపై పుణే చర్చ, 2021లో గురువారం ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమాన్ని పుణే ఇంటర్నేషనల్ సెంటర్ నిర్వహించింది. 


విపత్తులు, మహమ్మారుల సమయంలో దేశ భద్రతా సన్నద్ధత అనే అంశంపై అజిత్ దోవల్ మాట్లాడుతూ, విపత్తులు, మహమ్మారులను ఒంటరిగా పరిష్కరించడం సాధ్యం కాదన్నారు. ప్రపంచ భద్రతా దృశ్యం ఏ విధంగా మారుతోందో అందరికీ తెలుసునన్నారు. దేశ రాజకీయ, సైనిక లక్ష్యాల సాధనకు యుద్ధాలు మితిమీరిన ఖర్చుతో కూడుకున్న సాధనాలు అవుతున్నాయన్నారు. కొత్త యుద్ధ రంగాలు భౌగోళిక సరిహద్దుల నుంచి పౌర సమాజాలకు మారాయన్నారు. సామాన్య ప్రజల ఆలోచనలు, వారి అభిప్రాయాలు, ఆరోగ్యం, సంక్షేమ భావన, తమ ప్రభుత్వాల పట్ల వారి అవగాహనలకు కొత్త ప్రాధాన్యం లభించిందన్నారు. ఇవన్నీ కలిసి దేశ శక్తి, సామర్థ్యాలపై ప్రభావం చూపుతాయన్నారు. 


సమాచార విప్లవ యుగంలో తప్పుడు, ప్రేరేపిత ప్రచారం నుంచి ప్రజలను కాపాడటం అత్యంత ఆవశ్యకమని తెలిపారు. అంతర్జాతీయ సహకారాన్ని గరిష్ఠ స్థాయిలో పొందడానికి ఈ అన్ని సవాళ్ళు, వ్యూహాలలో జాతీయ భద్రత ప్రణాళికకు భాగస్వామ్యం ఉండాలని తెలిపారు. ఈ కొత్త భద్రతా సవాళ్ళు పెద్ద ఎత్తున అనేక స్థాయుల్లో సందిగ్ధతను సృష్టిస్తాయన్నారు. వ్యక్తుల ప్రాణాలను కాపాడటం, వైద్య సంరక్షణను అందజేయడం, ప్రజలకు సహకరించడం, ఆహారం, నిత్యావసర వస్తువులు సజావుగా సరఫరా అయ్యేలా చూడటం, శాంతిభద్రతలను కాపాడటం వంటివి సూక్ష్మ స్థాయిలో అవసరమని తెలిపారు. 


Updated Date - 2021-10-28T21:57:43+05:30 IST