‘ఈగో’ అనేది చాలా డేంజర్. అది మనసుతో, మనుషులతో ఆడుకుంటుంది. ఆట ఒకసారి మొదలైం దంటే ఎక్కడ, ఎలా ముగుస్తుందో చెప్పడం కష్టం. ఒక సీనియర్ స్టార్ హీరో... ఒక ఫ్లాప్ డైరెక్టర్...గమ్మత్తుగా ఇద్దరి పేర్లు ‘ఏకే’తోనే మొదలవుతాయి. ఒకరు అనిల్ కపూర్, మరొకరు అనురాగ్ కశ్యప్. ఒకరి వల్ల మరొ కరికి ‘ఈగో’ దెబ్బతింది. అంతే... ‘ఏకే వర్సెస్ ఏకే’...
ఎవరు గొప్ప? దర్శకుడా... నటుడా? ఒక స్టార్ కెమెరా ముందు నటిస్తాడు... కెమెరా వెనుక అతనెలా ఉంటాడు? దర్శకుడు కెమెరా వెనుక ఉంటాడు... అతడు కెమెరా ముందుకొస్తే? విపరీతమైన ‘ఈగో’తో ఉన్న వాళ్లిద్దరూ కలిసి ఒకే ఫ్రేములో అది కూడా 12 గంటల టైమ్ ఫ్రేమ్‌లో... వారినే ఫాలో అవుతున్న ‘రియల్’ కెమెరా ఫ్రేమ్‌లో నుంచి చూస్తే... ఆ థ్రిల్ తొలిసారి బాలీవుడ్లో తెరకెక్కింది. ఇంతకీ వాళ్లిద్దరి ‘ఈగో’ ఎందుకు అంతగా హర్ట్ అయ్యింది?
రెగ్యులర్ సినిమాను కాసేపు మర్చిపోండి... అన్నీ రియల్ క్యారెక్టర్స్... రియల్ లొకేషన్స్... ఒకానొక టీవీ చర్చలో అనిల్‌కపూర్, అనురాగ్ కశ్యప్ పాల్గొంటారు. ‘నువ్వు కరణ్ జోహార్ ఇచ్చిన సెకండ్ హ్యాండ్ షూస్ వేసుకుంటావ్... నువ్వొక ఫ్లాప్ డైరెక్టర్’ అంటూ అనురాగ్‌ను అనేకరకాలుగా ఎగతాళి చేస్తాడు అనిల్‌కపూర్. ‘నువ్వొక వయసుడిగిపోయిన ముసలి హీరోవి. ఇంకా ‘వన్ టు కా ఫోర్... మై నేమ్ ఈజ్ లఖన్...’ అంటూ పిచ్చిగంతులు వేస్తున్నావ్’ అంటూ కౌంటర్ ఇస్తాడు అనురాగ్. అనిల్ అతడి షూ మీద నీళ్లు పోస్తాడు. అనురాగ్ గ్లాసులోని నీళ్లను అనిల్ ముఖంపై కొడతాడు. ఇంకేం... మీడియాకు కావాల్సి నంత మేత. వాళ్లిద్దరి మధ్య గొడవను రచ్చ రచ్చ చేస్తుంది. దాంతో అనురాగ్‌కు అవకాశాలు లేకుండా పోతాయి. చివరికి తనవల్ల పైకొచ్చిన నవాజుద్దీన్ సిద్ధిఖీ కూడా (ఫోన్ వాయిస్ మాత్రమే) సినిమా చేయనంటాడు. అనురాగ్ ‘ఈగో’ దెబ్బతింది. అతడి అసిస్టెంట్ యోగితా కత్తిలాంటి ఐడియా చెప్పింది. సీన్ కట్ చేస్తే...
కారవ్యాన్‌లో ఉన్న అనిల్‌కపూర్ దగ్గరికి వెళ్తాడు అనురాగ్. ఆయన వెనకే యోగితా రన్నింగ్ కెమెరాతో రెడీ. ‘నీ కూతురు సోనమ్కపూర్ను కిడ్నాప్ చేశానం’టాడు అనురాగ్. మూడు షరతులు పెట్టి (పోలీసులకు చెప్పకూడదు... బయటివాళ్లు ఇన్వాల్వ్ కావొద్దు... కెమెరా ఫాలో అవుతూనే ఉంటుంది) ‘నీ కూతుర్ని తెల్లారేలోగా వెదికి పట్టుకో... అదే నా సినిమా’ అంటాడు. మొదట్లో జోక్‌గా కొట్టిపారేసిన అనిల్‌కపూర్ ఆ తర్వాత కొన్ని సాక్ష్యాలతో తన కూతుర్ని నిజంగానే కిడ్నాప్ చేశారని నమ్ముతాడు. అంటే ఒక స్టార్... ఇప్పుడు సాధారణ తండ్రిలాగా కూతుర్ని వెదుకుతూ రోడ్డెక్కుతాడన్నమాట. ఇంతకాలం కెమెరా ముందు నటించిన అనిల్‌కపూర్ ఇప్పుడు ఒక తండ్రిగా కూతురి కోసం నిజంగానే ఆరాటపడుతుంటే... దాన్ని సినిమాగా తీస్తున్నారన్న మాట. ఇన్నేళ్ల కెరీర్లో ఇదొక విచిత్రమైన పరిస్థితి. మరో చిత్రమేమిటంటే అదేరోజు అనిల్‌కపూర్ పుట్టినరోజు (డిసెంబర్ 24) కూడా. తెల్లారితే క్రిస్మస్.
ఇప్పుడిక యోగితా కెమెరా కంటి నుంచి అనిల్‌కపూర్ అన్వేషణ మొదలవుతుంది. అతడి పక్కనే అనురాగ్ కశ్యప్. బయటివాళ్లకు సినిమా షూటింగ్‌లా కనిపిస్తుంది. కానీ అది సినిమా అని తెలిసిన వాళ్లు ముగ్గురు మాత్రమే. అందుకే పోలీస్ స్టేషన్లో, ఇంటి సభ్యులకు (సోదరుడు బోనీకపూర్, కొడుకు, అల్లుడు) అనిల్‌కపూర్ నిజం చెప్పాలని ప్రయత్నించినా ఎవరూ నమ్మరు. పైగా ఆయనతో పాటే ఉన్న అనురాగ్ మీద వాళ్లంతా జోకులు కూడా వేస్తుంటారు. మరోవైపు తెరమీద 11 గంటలు మాత్రమే... 10 గంటలు మాత్రమే... అని టైమ్‌ఫ్రేమ్ గుర్తుచేస్తూ ఈ థ్రిల్లర్‌ను రోమాంచితం చేశారు.
అప్పటికే ముంబయి రోడ్లన్నీ క్రిస్మస్ వేడుకలతో బిజీగా ఉంటాయి. అనిల్‌కపూర్ పిచ్చిపట్టినట్టు రోడ్ల వెంట క్లూస్ వెదుక్కుంటూ తిరుగుతుంటే, పక్కనే అనురాగ్ కూల్‌గా ఎంజాయ్ చేస్తుంటాడు. అంత టెన్షన్ లోనూ ఒకచోట క్రిస్మస్ వేడుకల్లో ‘వన్ టు కా ఫోర్... మై నేమ్ ఈజ్ లఖన్’ పాటకు ఆయన డ్యాన్స్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కానీ తప్పదు. స్టార్ అనేవాడు జనాల్ని ఎంటర్టైన్ చేయాలిగా...
అనురాగ్ స్ర్కిప్ట్ ప్రకారమే ఇదంతా జరుగుతుంటుంది. ఎట్టకేలకు తన కూతుర్ని కిడ్నాప్ చేసి, అనురాగ్ అతడి ఇంట్లోనే (నిజంగా అనురాగ్ ఇల్లే) కట్టేశాడని తెలుసుకుంటాడు అనిల్‌కపూర్. తీరా అక్కడికి వెళితే ట్విస్ట్. సోనమ్‌కపూర్ అక్కడ లేదు. ఆమెతో పాటు అనురాగ్ తల్లిదండ్రులు కూడా కిడ్నాప్ అయ్యారు. ఇక్కడి నుంచి కథ అనేక ట్విస్టులు తిరుగుతూ ప్రేక్షకులు ఊహించని ఉత్కంఠభరితమైన ముగింపుతో ‘వావ్’ అనిపిస్తుంది.
బాలీవుడ్లో ఇదొక వినూత్న ప్రయత్నం. ‘డాగ్మే 95’ ఫిల్మ్ మేకింగ్ విధానాన్ని గుర్తుకు తెస్తూనే ‘మిర్రర్ ఇమేజ్’ టెక్నిక్‌తో తీశారు. అంటే కెమెరా అనిల్‌కపూర్‌ను ఫాలో అవుతోంది కాబట్టి, ఆయన యాక్షన్ క్లోజప్‌లో కనిపిస్తే, అనురాగ్ అక్కడే ఉన్న అద్దంలోనో, కారు అద్దంలోనో కనిపిస్తుంటాడు. ప్రేక్షకులు కెమెరా వ్యూ ఫైండర్లో నుంచి సినిమా చూస్తున్న ఫీలింగ్ తీసుకొచ్చారు. రియల్‌టైమ్ సౌండ్‌తో ప్రేక్షకులు కూడా అనిల్‌కపూర్ వెంటే పరుగెడుతున్నట్టుగా ఫీలవుతారు. సగటు ప్రేక్షకుల కన్నా సినీగోయర్స్ ‘ఏకే వర్సెస్ ఏకే’ను బాగా ఎంజాయ్ చేస్తారు. ఒక వీడియోగేమ్లా సాగే ఈ బ్లాక్ కామెడీ థ్రిల్లర్‌కు అనిల్‌కపూర్ యాక్షన్ హైలైట్. అవినాశ్ సంపత్ కథకు అనురాగ్ కశ్యప్ రియాలిటీతో కూడుకున్న విట్టీ డైలాగులు రాస్తే, దర్శకుడు విక్రమాదిత్య మోత్వానీ అద్భుతంగా తెరకెక్కించాడు. అనిల్‌కపూర్ పుట్టినరోజు (డిసెంబర్ 24)నే ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కావడం మరో విశేషం.
‘అహం’ బ్రహ్మస్మి...
కొన్నాళ్ల క్రితం మలయాళంలో వచ్చిన ‘అయ్యప్పనుమ్ కోషియం’ (తెలుగులో పవన్‌కల్యాణ్ రీమేక్ చేస్తున్నారు) కథ కూడా ఇద్దరి మధ్య ‘ఈగో’ సమస్య ప్రధానంగా సాగుతుంది. దర్శకుడు సచీ (జూన్‌లో మరణించాడు) తీసిన ఈ సినిమాలో కోషీ కురియన్ అనే మాజీ హవాల్దార్, అయ్యప్పన్ నాయర్ అనే ఎస్సైల మధ్య మొదలైన ‘ఈగో’ వారి జీవితాలతో ఆడుకుంటుంది. 2016లో వచ్చిన ‘ఫ్యాన్’ సినిమాలో తన అభిమాన హీరో ఆర్యన్ ఖన్నా (షారుక్), అతడి అభిమాని గౌరవ్ చందన (షారుక్ ద్విపాత్రాభినయం) మధ్య కూడా ‘ఈగో’ ప్రధాన సమస్యగా మారుతుంది. తాజా ‘ఏకే వర్సెస్ ఏకే’ కూడా ‘ఈగో’ ప్రధానంగా భిన్నమైన స్ర్కీన్‌ప్లేతో తెరకెక్కింది. హాలీవుడ్లో ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన డేవిడ్ ఫించర్ సినిమా ‘మాంక్’ కూడా ఇదే కోవలోకి వస్తుంది.
నటీనటులు: అనిల్‌కపూర్, అనురాగ్ కశ్యప్, యోగితా బిహానీ, సోనమ్‌కపూర్, హర్షవర్ధన్కపూర్, బోనీకపూర్
దర్శకుడు: విక్రమాదిత్య మోత్వానీ
నిడివి: 108 నిమిషాలు
విడుదల: నెట్‌ఫ్లిక్స్
- సి.ఎస్.