Abn logo
Nov 12 2020 @ 08:39AM

‘ఆకాశం నీ హద్దురా’ రివ్యూ

Kaakateeya

మొబైల్స్‌, విమానాలు ఇవ‌న్నీ ప్రారంభ స‌మ‌యాల్లో చాలా ఖ‌రీదైన విష‌యాలు.. సామాన్యుడి అందుబాటులోకి రావ‌డానికి చాలా స‌మ‌యమే ప‌డుతుంద‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ ఇప్పుడు అవి సామాన్యుడికి చేరువ‌య్యాయి. విమాన‌యాన రంగాన్ని చూస్తే ఒక‌ప్పుడు ఆకాశాన్నంటే విమాన టికెట్ ధ‌ర‌.. ఇప్పుడు మ‌ధ్య త‌ర‌గ‌తి వాడికి అనుకూల ధ‌ర‌కు దొరుకుతుంది. ఇలా జ‌ర‌గ‌డానికి కార‌ణం ఎయిర్ డెక్క‌న్ అధినేత జీఆర్‌.గోపీనాథ్. ఆయ‌న బ‌ల‌మైన ఆలోచ‌న‌, కార్య‌చ‌ర‌ణ‌తోనే ఇది సాధ్య‌మైంది. ఓ సామాన్యుడు ఎయిర్ లైన్స్ సంస్థ అధినేత రేంజ్‌కు చేరుకోవ‌డం అంటే చిన్న విష‌యం కాదు... అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేసిన వ్య‌క్తి గోపీనాథ్ జీవితాన్ని తెలియ‌జేసే పుస్త‌కం సింప్లీ ఫ్లై. దీన్ని ఆధారంగా చేసుకుని ద‌ర్శ‌కురాలు సుధా కొంగ‌ర తెర‌కెక్కించిన చిత్ర‌మే ఆకాశ‌మే నీ హ‌ద్దురా. సూర్య హీరోగా న‌టిస్తూ నిర్మాత‌గా ఈ సినిమాను చేశారు. మ‌రి సుధా కొంగ‌ర‌పై సూర్య పెట్టుకున్న న‌మ్మ‌కం నిజ‌మైందా?  లేదా?  అనే విష‌యాలు తెలియాలంటే సినిమా క‌థ‌లోకి వెళ‌దాం...


బ్యాన‌ర్స్‌: 2డీ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, శిఖ్యా ఎంట‌ర్‌టైన్‌మెంట్‌

నటీన‌టులు:  సూర్య‌, అప‌ర్ణా బాల‌ముర‌ళి, డా.మోహ‌న్‌బాబు,  ప‌రేష్‌రావ‌ల్‌, ఊర్వ‌శి, క‌రుణాస్ త‌దిత‌రులు

దర్శక‌త్వం:  సుధాకొంగ‌ర‌

నిర్మాత‌లు:  సూర్య‌, గునీత్ మొంగా

స్క్రీన్‌ప్లే:  సుధా కొంగ‌ర‌, షాలిని ఉషా దేవి, ఆలీఫ్ శృతి, గ‌ణేశ‌

సినిమాటోగ్ర‌ఫీ:  నికేత్ బొమ్మిరెడ్డి

సంగీతం:  జీవీ ప్ర‌కాశ్‌

ఎడిటింగ్‌:  స‌తీశ్ సూర్య‌

వ్య‌వ‌థి: 2 గంట‌ల 29 నిమిషాలు

విడుద‌ల‌:  అమెజాన్ ప్రైమ్‌

క‌థ‌:

స‌రైన ప్ర‌యాణ వ‌స‌తులు లేని చుండూరు గ్రామానికి చెందిన యువ‌కుడు చంద్ర‌మ‌హేశ్‌(సూర్య‌). తండ్రి స్కూల్ మాస్టార్‌. త‌న ప‌ద్ధ‌తులు ఆవేశ‌ప‌రుడైన‌ చంద్ర‌మ‌హేశ్‌కి న‌చ్చ‌దు. దాంతో ఓ రోజు తండ్రితో గొడ‌వ‌ప‌డి ఇంటి నుండి బ‌య‌టికెళ్లిపోతాడు. త‌ర్వాత ఫైట‌ర్ ఫైలట్‌గా ఎన్‌డీఏలో ఉద్యోగం చేస్తుంటాడు. కొడుకు మీద దిగులుతో మ‌హేశ్ తండ్రి మంచాన ప‌డ‌తాడు. తండ్రిని చూడ‌టానికి వెంట‌నే వెళ్ల‌డానికి విమానం క‌రెక్ట్ అని భావించిన చంద్ర‌మహేశ్ ఎకానమీ క్లాసు డ‌బ్బుల‌తో ఎయిర్‌పోర్టు వెళితే ఎకానమీ టికెట్స్ అయిపోయాన‌ని.. బిజినెస్ క్లాస్ టికెట్స్ మాత్ర‌మే ఉన్నాయ‌ని చెప్పి విమానం ఎక్క‌నివ్వ‌రు. చివ‌రికి బ‌స్సు, ట్రైన్‌లో మ‌హేశ్ ఇల్లు చేరుకుంటాడు. కానీ అప్ప‌టికే తండ్రి ద‌హ‌న సంస్కారాలు పూర్తైపోతాయి. ఆ బాధ‌తో మ‌హేశ్ త‌న ఉద్యోగానికి రాజీనామా చేస్తాడు. ఎలాగైనా విమానంలో పేద‌వాడు ప్ర‌యాణించేలా చేయాల‌ని భావిస్తాడు. రీసెర్చ్ చేసి అందుకు త‌గిన బిజినెస్ ప్లానింగ్ కూడా చేసుకుంటాడు. కానీ మ‌హేశ్‌కు ఏ ఇన్వెస్ట‌ర్ కూడా స‌పోర్ట్ చేయ‌డు. ఇత‌ర విమాన‌యాన సంస్థ‌ల అధినేత‌లు మ‌హేశ్ ప్ర‌య‌త్నాన్ని అడ్డుకుంటారు. ఆ ప్ర‌య‌త్నాల‌ను మ‌హేశ్ ఎలా దాటగలిగాడు? త‌న ప్ర‌యత్నంలో ఎలా స‌క్సెస్ అవుతాడు?  చంద్ర‌మ‌హేశ్‌కి, అత‌ని భార్య బేబి(అప‌ర్ణా బాల‌ముర‌ళి) ఎలా స‌పోర్ట్ చేస్తుంది?  అనే విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే..

స‌మీక్ష‌:

దాదాపు ఇర‌వై వేల రూపాయ‌ల టికెట్‌ను పేద‌వాడికి, మ‌ధ్య త‌ర‌గ‌తివాడికి అందుబాటు ధ‌ర‌లోకి తీసుకు రావ‌డ‌మ‌నేది చాలా గొప్ప విష‌యం. ఓ సామాన్యుడు త‌న ఆలోచ‌న‌, స‌మ‌స్య‌ల‌ను అధిగ‌మించి విమాన సంస్థ‌కు అధినేత కావ‌డం క‌ల‌లో కూడా ఊహించ‌లేం. కానీ ఆసాధ్యాన్ని సుసాధ్యం చేసిన గోపీనాథ్ జీవితాన్ని తెర‌కెక్కించ‌డం గొప్ప విష‌యం. దానికి త‌గినంత ఎమోష‌న్స్‌, నాట‌కీయ‌త‌ను జోడించి డైరెక్ట‌ర్ సుధా కొంగ‌ర .. ఆకాశం నీ హ‌ద్దురా సినిమాను తెర‌కెక్కించారు. హీరో సూర్య గోపీనాథ్ పాత్ర‌లో ఒదిగిపోయారు. చాలా రోజుల త‌ర్వాత సూర్య పెర్ఫామెన్స్‌కు త‌గ్గ పాత్ర దొరికింది. ఎమోష‌న్స్ నిండిన చంద్ర‌మ‌హేశ్ పాత్ర‌లో సూర్య అద్భుతంగా ఒదిగిపోయారు. నాట‌కీయ‌త ఉన్న సినిమాలో హీరోయిజం చూపించారు కానీ.. క‌మ‌ర్షియ‌ల్ హీరోయిజం చూపించ‌లేదు. ఎక్క‌డా గొడ‌వప‌డే స‌న్నివేశాలు లేవు. సూర్య ప్ర‌తి ఎమోష‌న్‌ను క‌ళ్ల‌తో చ‌క్క‌గా ప‌లికించాడు. ఇక అపర్ణా బాల‌ముర‌ళి కూడా చాలా మంచి పాత్ర‌ను పోషించింది. భ‌ర్త ఆశ‌యాన్ని గుర్తించి అత‌నికి స‌పోర్ట్ చేసే భార్య‌గా అప‌ర్ణ న‌ట‌న ఆమెకు మ‌రిన్ని ప్ర‌శంస‌ల‌ను తెచ్చిపెడుతుంద‌న‌డంలో సందేహం లేదు. చేసింది చిన్న పాత్రే అయిన మోహ‌న్‌బాబు త‌న‌దైన న‌ట‌న‌తో పాత్ర‌ను హైప్ చేశారు. ప‌రేశ్ రావ‌ల్ న‌ట‌న గురించి ఇక ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. సూర్య పాత్ర‌ను అడ్డుకునే మ‌రో విమాన‌యాన సంస్థ అధినేత‌గా క‌న్నింగ్ విల‌నిజాన్ని చూపిస్తూ మంచి న‌ట‌న‌ను ప్ర‌ద‌ర్శించారు. ఎడిటింగ్ బావుంది. ఇత‌ర న‌టీన‌టులు వారి వారి పాత్ర‌ల‌ను చ‌క్క‌గా పోషించారు.


సుధాకొంగ‌ర .. సినిమాను ఎక్క‌డా ఓవ‌ర్‌గా చేసి చూపించ‌లేదు. సినిమాను స‌మ‌పాళ్ల‌లో చ‌క్క‌గా ఎలివేట్ చేశారు. అందుకు త‌గిన‌ట్లే పాత్ర‌ల‌ను మ‌లిచారు. సూర్య పాత్ర‌ను.. దానికి స‌మానంగా అప‌ర్ణా బాల‌ముర‌ళి.. ఇత‌ర పాత్ర‌ల‌ను సుధా కొంగ‌ర చ‌క్క‌గా డిజైన్ చేశారు. జీవీ ప్ర‌కాశ్‌కుమార్ అందించిన నేప‌థ్య సంగీతం సినిమాకు మేజ‌ర్ ఎస్సెట్ అయ్యింది. నికేత్ సినిమాటోగ్ర‌ఫీ.. మంచి విజువ‌ల్స్‌తో ఆకట్టుకుంది. నిర్మాణ విలువ‌లు బావున్నాయి. థియేట‌ర్స్ అందుబాటులో లేకుండా ఓటీటీలో వ‌చ్చిన ఈ సినిమా మ‌రింత‌మంది ప్రేక్ష‌కుల‌కు త్వ‌ర‌గా రీచ్ అవుతుంద‌న‌డంలో సందేహం లేదు. 


చివ‌ర‌గా: ఆకాశం నీ హ‌ద్దురా.. సామాన్యుడి అసామాన్య విజ‌యం
రేటింగ్‌: 3/5

Advertisement
Advertisement