కుండ నిండా తెలివి!

ABN , First Publish Date - 2020-12-26T05:37:16+05:30 IST

ఒకరోజు ఒక విషయంపై అక్బర్‌, బీర్బల్‌ మధ్య వాదన నడిచింది. దాంతో కోపోద్రిక్తుడైన అక్బర్‌ రాజ్యం విడిచి వెళ్లాల్సిందిగా బీర్బల్‌ను ఆదేశించాడు. రాజు ఆదేశాన్ని పాటిస్తూ బీర్బల్‌ రాజ్యం వదిలి వెళ్లాడు...

కుండ నిండా తెలివి!

ఒకరోజు ఒక విషయంపై అక్బర్‌, బీర్బల్‌ మధ్య వాదన నడిచింది. దాంతో కోపోద్రిక్తుడైన అక్బర్‌ రాజ్యం విడిచి వెళ్లాల్సిందిగా బీర్బల్‌ను ఆదేశించాడు. రాజు ఆదేశాన్ని పాటిస్తూ బీర్బల్‌ రాజ్యం వదిలి వెళ్లాడు. వారాలు, నెలలు గడిచిపోయాయి. బీర్బల్‌ లేకపోవడంతో అక్బర్‌కు ఏమీ తోచడం లేదు. తన తప్పు తెలుసుకున్న అక్బర్‌ బీర్బల్‌ని వెతికి పట్టుకురమ్మని భటులను ఆదేశించాడు. ఎక్కడా బీర్బల్‌ జాడ కనిపించలేదు. బీర్బల్‌ ఎక్కుడున్నాడో తెలుసుకునేందుకు అక్బర్‌ ఒక పథకం వేశాడు. తన రాజ్యంలోని ప్రతి గ్రామం మూడు నెలల్లో ఒక కుండ నిండా చాతుర్యం, తెలివిని పంపాలని హుకుం జారీ చేశాడు.


ఒకవేళ పంపించలేకపోతే ఆ కుండ నిండా వజ్రాలు, ఆభరణాలు నింపి పంపాలని ఆదేశించాడు. దాంతో గ్రామస్థుల్లో భయం మొదలైంది. కుండ నిండా తెలివి ఎలా పంపించాలో వారికి అర్థం కాలేదు. పేద గ్రామాల ప్రజలు వజ్రాలు ఎక్కడ నుంచి తేవాలని బెంగతో ఉన్నారు. తాను దాక్కుని ఉన్న గ్రామంలోని ప్రజలు సైతం ఇదే విషయమై దిగులుతో ఉండటాన్ని బీర్బల్‌ గమనించాడు. ‘‘భయపడకండి. నేను మీకు కుండ నిండా తెలివిని ఇస్తాను’’ అని వారితో అన్నాడు బీర్బల్‌. సరే అని ఆ గ్రామ పెద్ద ఒప్పుకున్నాడు. బీర్బల్‌ ఒక కుండను తెచ్చి అందులో తీగతో సహా ఉన్న చిన్న పుచ్చకాయను పెట్టాడు. మూడు నెలల్లో ఆ పుచ్చకాయ పెరిగి కుండ నిండుగా అయింది. అప్పుడు తీగను కత్తిరించి ఆ కుండను అక్బర్‌ దగ్గరకు పంపాడు. ఆ కుండపై ‘‘కుండను పగలగొట్టకుండా తెలివిని తీసుకోండి’’ అని రాశాడు. అది చూడగానే అక్బర్‌కు బీర్బల్‌ ఎక్కడున్నాడో అర్థమైంది. ఆ కుండ ఏ గ్రామం నుంచి వచ్చిందో తెలుసుకుని బీర్బల్‌ను తీసుకురమ్మని భటులను ఆదేశించాడు.

Updated Date - 2020-12-26T05:37:16+05:30 IST