ఏ1గా అఖిలప్రియ

ABN , First Publish Date - 2021-01-08T07:27:52+05:30 IST

బోయిన్‌పల్లి కిడ్నాప్‌ ఘటన మలుపులు తిరుగుతోంది. బుధవారం సాయంత్రం వరకు ఏ2గా ఉన్న భూమా అఖిలప్రియను పోలీసులు గురువారం ప్రధాన నిందితురాలిగా మార్చారు

ఏ1గా అఖిలప్రియ

సుబ్బారెడ్డి పేరు తొలగించి ఆమె పేరు.. ఆయనకు నోటీసిచ్చి పంపిన అధికార్లు

పరారీలో అఖిల భర్త భార్గవ్‌రామ్‌.. బెంగళూరులో ఉన్నట్లు అనుమానాలు

పలు రాష్ట్రాల్లో బృందాల గాలింపు.. బెయిల్‌ పిటిషన్‌ను తోసిపుచ్చిన కోర్టు


హైదరాబాద్‌ సిటీ/బేగంపేట, సైదాబాద్‌, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): బోయిన్‌పల్లి కిడ్నాప్‌ ఘటన మలుపులు తిరుగుతోంది. బుధవారం సాయంత్రం వరకు ఏ2గా ఉన్న భూమా అఖిలప్రియను పోలీసులు గురువారం ప్రధాన నిందితురాలిగా మార్చారు. ఏ1గా ఉన్న ఏవీ సుబ్బారెడ్డిని ఏ2గా మార్చారు. బుధవారం రాత్రి 10.30 గంటలకు ఏవీ సుబ్బారెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ప్రధాన నిందితుడైనా.. 41ఏ నోటీసులు ఇచ్చి పంపించడంతో మళ్లీ ఈ కేసు చర్చనీయాంశంగా మారింది. కేవలం అరగంటపాటు కూర్చోబెట్టిన పోలీసులు.. రాత్రి 11 గంటల సమయంలో సుబ్బారెడ్డిని పంపించేశారు. ఆయనను అదుపులోకి తీసుకుని బేగంపేట పీఎ్‌సకుతీసుకువచ్చినప్పుడు ప్రవీణ్‌ రావు మనుషులు కూడా అక్కడే ఉన్నారని, వారి మధ్య సంభాషణ జరగడంతోనే సుబ్బారెడ్డిని తప్పించారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


ఏవీ సుబ్బారెడ్డికి కిడ్నా్‌పతో సంబంధం లేదని, పాత కేసు నేపథ్యంలో అనుమానించి అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారంలో ఆయన పాత్ర లేనందున నోటీసులిచ్చి పంపించినట్లు తెలిపారు. అయితే, తాను పోలీసులకు అందుబాటులో ఉంటానని, ఎప్పుడు పిలిచినా వెంటనే వస్తానని సుబ్బారెడ్డి హామీ ఇచ్చినట్లు సమాచారం. ఇక, సుబ్బారెడ్డిని ఏ-2గా చేర్చారని ప్రచారం జరిగినా.. అది కూడా వాస్తవం కాదని, ఈ నేరంలో ఆయన పాత్ర ఉందా లేదా అనేదీ విచారించాల్సి ఉందని ఓ ఉన్నతాధికారి చెప్పారు. తన తండ్రికి నోటీసులిచ్చి పంపించారంటూ పోలీసులకు కృతజ్ఞతలు చెబుతున్నట్లు ఏవీ సుబ్బారెడ్డి కూతురు ఓ వీడియో సందేశాన్ని పంపించారు.


నాకు 40 శాతం వాటా

ప్రవీణ్‌ రావు, ఆయన సోదరుల కిడ్నాప్‌ వ్యవహారంలో పాత్రధారులు తప్పించుకున్నా.. సూత్రధారి ఆరోపణలపై భూమా అఖిలప్రియను బుధవారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అనంతరం, బేగంపేటలోని లెర్నింగ్‌ సెంటర్‌లో విచారించినప్పుడు హఫీజ్‌పేట స్థలంలో తనకు 40 శాతం వాటా ఉన్నట్లు ఆమె చెప్పినట్లు తెలిసింది. మిగతా భూమిలో 30 శాతం సుబ్బారెడ్డికి, మిగతా 30 శాతం ప్రవీణ్‌కు చెందుతుందని అఖిలప్రియ పోలీసులకు వివరించినట్లు సమాచారం. 


జైలు ఆస్పత్రిలో అఖిలప్రియ

కిడ్నాప్‌ కేసులో చంచల్‌గూడ మహిళా జైలుకు రిమాండ్‌కు తరలించిన ఏపీ మాజీ మంత్రి అఖిల ప్రియను ఆరోగ్య కారణాల రీత్యా జైలు ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. బుధవారం ఆమెకు పాటిగడ్డ మోడల్‌ మార్కెట్‌లోని బస్తీ దవాఖానలో కరోనా టెస్టు నిర్వహించారు. అనంతరం అదే ప్రైవేటు కారులో గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమె నీరసం వచ్చి పడిపోయారు. బుధవారం పొద్దున్నుంచీ ఏమీ తినకపోవడంతోనే ఇలా జరిగి ఉంటుందని వైద్యులు తెలిపారు. అనంతరం గాంధీ ఆస్పత్రి నుంచి ఆమెను మేజిస్ట్రేట్‌ ఇంటికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో, కోర్టు ఆదేశాల మేరకు వైద్యులు జైల్లో ఎప్పటికప్పుడు ఆమె ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తున్నారు. జైల్లో అఖిలప్రియకు యూటీ నంబరు (అండర్‌ ట్రయల్‌) 1509 కేటాయించారు. కాగా, కిడ్నాప్‌ కేసులో అఖిలప్రియకు గురువారం సికింద్రాబాద్‌ కోర్టులో చుక్కెదురైంది. అనారోగ్యం కారణంగా బెయిల్‌ లభిస్తుందని ఆమె తరఫు న్యాయవాదులు భావించినా.. బెయిల్‌ దొరకలేదు. అఖిలప్రియను గురువారం సికింద్రాబాద్‌ కోర్టు 11 అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ న్యాయమూర్తి ఆశాలత ఎదుట హాజరు పరిచారు. 


అప్పటికే ఏ2గా ఉన్న అఖిలప్రియను ఏ1గా మార్చారు. ఆమెపై పోలీసులు తాజాగా మరో రెండు సెక్షన్లు (ఐపీసీ 147, 385) జోడించారు. మెరుగైన వైద్యం కోసం ఆమెను ఆస్పత్రికి తరలించాలని దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి ఆశాలత పరిశీలించారు. జైల్లోనే అఖిలప్రియకు అవసరమైన వైద్య సదుపాయాలు ఉన్నాయని భావించారు. మెరుగైన చికిత్స సిఫారసు చేస్తూ ఆస్పత్రికి తరలించాలని జైలు అధికారులు సూచిస్తే నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. ఆమె ప్రజా ప్రతినిధిగా ఉన్నారని, అయినా, కనీసం ముందస్తు నోటీసులు కూడా ఇవ్వలేదని అఖిలప్రియ తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. ఈ కేసు శుక్రవారం సికింద్రాబాద్‌ కోర్టులో మరోసారి విచారణకు రానుంది. కోర్టు ఆదేశాల మేరకు ఆమె బెయిల్‌ పిటిషన్‌పై పోలీసులు కౌంటర్‌ దాఖలు చేయనున్నారు. కాగా, జైలు ఆస్పత్రిలో బుధవారం రాత్రంతా అఖిలప్రియ నిద్రపోలేదని, తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనట్లు జైలు వర్గాలు తెలిపాయి. అఖిలప్రియను కలిసేందుకు ఆమె సమీప బంధువు జైలు వద్దకు వచ్చారు. కరోనా నిబంధనల మేరకు ములాఖత్‌లు నిలిపివేసిన నేపథ్యంలో ఆమెకు అనుమతి ఇవ్వలేదు. అఖిలప్రియకు తీసుకొచ్చిన దుస్తులు, మందులను జైలు సిబ్బందికి ఇచ్చి వెళ్లారు.


బెంగళూరులో భార్గవ్‌రామ్‌?

అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్‌ కోసం పోలీసు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఆయన బెంగళూరులో తలదాచుకున్నట్లు సమాచారం. పోలీసులు దీన్ని అధికారికంగా ధ్రువీకరించలేదు. భార్గవ్‌రామ్‌తోపాటు కిడ్నా్‌పలో పాల్గొన్న వారిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు వివిధ బృందాలుగా విడిపోయి బెంగళూరుతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లాలకు వెళ్లారు.


స్కెచ్‌ వేసిన గుంటూరు శ్రీను

హఫీజ్‌పేట్‌లోని భూ వివాదానికి సంబంధించిన బోయిన్‌పల్లి కిడ్నాప్‌ వ్యవహారంలో 15 మంది పాల్గొని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మూడు వాహనాల్లో ముగ్గురిని తీసుకెళ్లిన వారికి సంబంధించి కొంత సమాచారాన్ని సేకరించారు. మూడు వాహనాల్లో ముగ్గురు డ్రైవర్లతోపాటు ప్రతి వాహనంలో నలుగురేసి చొప్పున కూర్చొని ఉన్నట్లు గుర్తించారు. వారిలో కొంతమందిని ఇప్పటికే గుర్తించిన పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. కిడ్నాప్‌ ప్లాన్‌ను శ్రీనివాస్‌ చౌదరి అలియాస్‌ గుంటూరు శ్రీను అమలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. అతనికి సాయి, చంటి, ప్రకాశ్‌లతోపాటు మరి కొంతమంది సహకరించినట్లు భావిస్తున్నారు.

Updated Date - 2021-01-08T07:27:52+05:30 IST