వైసీపీ కార్యకర్తల్లా పోలీసులు: అఖిలప్రియ

ABN , First Publish Date - 2020-02-28T10:49:44+05:30 IST

జన చైతన్య యాత్రతో మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు ఎక్కడ మంచి పేరు వస్తుందనని వైసీపీ నాయకులు కుట్ర పన్ని, రోజువారి కూలీలతో విశాఖలో దాడి చేయించారని మాజీ మంత్రి అఖిలప్రియ ఆరోపించారు.

వైసీపీ కార్యకర్తల్లా పోలీసులు: అఖిలప్రియ

ఆళ్లగడ్డ: జన చైతన్య యాత్రతో మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు ఎక్కడ మంచి పేరు వస్తుందనని వైసీపీ నాయకులు కుట్ర పన్ని, రోజువారి కూలీలతో విశాఖలో దాడి చేయించారని మాజీ మంత్రి అఖిలప్రియ ఆరోపించారు. పట్టణంలోని ఆమె నివాసంలో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. జడ్‌ క్యాటగిరీ భద్రతగల ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు వారం రోజుల ముందుగా పోలీసుల అనుమతి తీసుకుని విశాఖకు వెళ్లారని అన్నారు. చంద్రబాబునా వస్తే లా అండ్‌ ఆర్దర్‌ సమస్య వస్తుందనుకుంటే విశాఖ ఎయిర్‌పోర్టులోనే ఆపాల్సి ఉండేదని అన్నారు. చంద్రబాబు ఎయిర్‌పోర్టులో దిగితే టీడీపీ ఎమ్మెల్యేలను అనుమతించని పోలీసులు, కోడి గుడ్లు, రాళ్లు, చెప్పులతో వచ్చిన వైసీపీ నాయకులను కావాలనే అనుమతించి చంద్రబాబుపై దాడి చేయించారని ఆరోపించారు. వైసీపీ నాయకులు రోజువారి కూలీలకు రూ.500 ఇచ్చి చంద్రబాబుపై రాళ్లు, గుడ్లు వేయించారని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు విశాఖకు హుద్‌ హుద్‌ తుఫాను వచ్చినపుడు అక్కడే ఉండి ప్రజలకు అండగా నిలిచారని అన్నారు. దీంతో విశాఖ ప్రజలు ఆయనకు ఎక్కడ బ్రహ్మరథం పడతారోనని కుట్రతో దాడి చేయించారని ఆరోపించారు. దేశంలో మంచి పేరున్న మాజీ సీఎం చంద్రబాబు నాయుడుపై దాడి చేయించడం పట్ల వైసీపీ నాయకులు సిగ్గుపడాలని అన్నారు. చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నపుడు జగన్‌ చేపట్టిన పాదయాత్రలో రాజకీయాలు చేసి ఉంటే ప్రస్తుత రాజకీయాలు మరో విధంగా ఉండేవని అన్నారు. మాజీ సీఎం, ప్రతిపక్షనాయకుడికే వైసీపీ ప్రభుత్వంలో రక్షణ లేదని, ప్రజలకు ఎక్కడి నుంచి రక్షణ వస్తుందని ఆమె ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న నీచ రాజకీయాలు చూసి బాధగా ఉందని, ఇది ఎంతమాత్రం మంచిది కాదని అన్నారు. తనను ఎందుకు అరెస్టు చేస్తున్నారో చెప్పాలని చంద్రబాబు పోలీసులను నిలదీశారని, దీంతో అప్పటికప్పుడు చేతిరాతతో 151 సెక్షన్‌ కింద అరెస్టు చేస్తున్నట్లు నోటీసు ఇచ్చారని అన్నారు. ఈ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయని అన్నారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు పాపిరెడ్డి, నాగాంజనేయులు, మాజీ కౌన్సిలర్‌ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-02-28T10:49:44+05:30 IST