అఖిలప్రియ కేసులో కొత్త విషయం.. ఆ సినిమా చూసే కిడ్నాప్‌కు ప్లాన్!

ABN , First Publish Date - 2021-01-13T21:57:49+05:30 IST

నేరగాళ్లు మితిమీరి పోతున్నారు. వినోదం పంచే సినిమాలు నేర ప్రవృత్తిని ప్రొత్సహిస్తున్నాయి. కొందరు నేరగాళ్ల సినీ ఫక్కీలో నేరాలు చేస్తూ పోలీసులకు

అఖిలప్రియ కేసులో కొత్త విషయం.. ఆ సినిమా చూసే కిడ్నాప్‌కు ప్లాన్!

హైదరాబాద్: వినోదం పంచే సినిమాలు నేర ప్రవృత్తిని ప్రొత్సహిస్తున్నాయనే విమర్శ చాలా కాలంగానే ఉంది. అందుకు తగ్గట్టుగా సినిమాలను స్ఫూర్తిగా తీసుకుని నేరగాళ్లు చెలరేగిపోతున్నారు. సినీ ఫక్కీలో నేరాలు చేస్తూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. అయితే కొందరు నేరాలు చేస్తూ పోలీసులకు దొరకకుండా దర్జాగా తిరుగుతున్నారు. ఇటీవల బోయిన్‌పల్లిలో జరిగిన కిడ్నాప్ ఉందంతానికి కూడా ఓ సినిమా ప్రేరణగా నిలిచింది. మాజీమంత్రి అఖిలప్రియ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బోయినపల్లి కిడ్నాప్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. బుధవారం ఉదయం నుంచి అఖిలప్రియ కస్టడీ విచారణ కొనసాగుతోంది. బాలివుడ్ నటుడు అక్షయ్‌కుమార్ నటించిన "స్పెషల్ 26" చిత్రాన్ని అనుసరించి కిడ్నాప్ ప్లాన్ వేసినట్లు పోలీసులు గుర్తించారు. సినిమా ఫక్కీ కిడ్నాప్‌నకు అఖిలప్రియ అండ్ గ్యాంగ్ ప్లాన్ చేసినట్లు విచారణలో తేలినట్లు సమాచారం.


కిడ్నాప్‌కు ముందు అక్షయ్‌కుమార్ సినిమా గురించి చంద్రహాస్‌తో అఖిలప్రియ చెప్పినట్లు వినికిడి. అఖిలప్రియ ఆదేశాలతోనే అక్షయ్‌కుమార్ సినిమాను కిడ్నాప్ గ్యాంగ్‌కు అఖిలప్రియ భర్త భార్గవ్‌రావ్, చంద్రహాస్ చూపించినట్లు తెలుస్తోంది. ఐటీ అధికారులుగా ఎలా నటించాలనే దానిపై వారం పాటు గ్యాంగ్‌కు శిక్షణ ఇచ్చినట్లు సమాచారం. "స్పెషల్ 26" ఆధారంగా యూసుఫ్‌గూడ ఎంజీఎం స్కూల్‌లో కిడ్నాప్‌కు స్కెచ్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. వాహనాల నెంబర్ ప్లేట్‌లను స్కూల్లో మార్చినట్లు పోలీసులు గుర్తించారు. సీసీ ఫుటేజీ, కీలక ఆధారాలను పోలీసులు సేకరిస్తున్నారు. గుంటూరు శ్రీను, చంద్రహాస్, భార్గవ్‌రామ్‌ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇప్పటికే పోలీసుల అదుపులో సిద్దార్థ్, దుర్గ ఉన్నారు.


కస్టడీలో ఉన్న ఏపీ మాజీ మంత్రి అఖిల ప్రియను పోలీసులు రెండో రోజూ విచారించారు. మంగళవారం బేగంపేట మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఉదయం నుంచి సాయంత్రం వరకు నార్త్‌జోన్‌ డీసీపీ కల్మేశ్వర్‌ సింగన్‌వార్‌ నేతృత్వంలో.. న్యాయవాదుల సమక్షంలో పలు అంశాలపై ఇద్దరు ఏసీపీ స్థాయి అధికారులు ఆమెను ప్రశ్నించారు. భార్గవరామ్‌ సహా.. ఇతర నిందితులు ఎక్కడున్నారనే కోణంపై ఆమెను విచారించారు. చాలా ప్రశ్నలకు అఖిల ప్రియ మౌనంగా ఉన్నట్లు తెలిసింది. కిడ్నాపర్లతో అఖిలప్రియ ఫోన్‌ సంభాషణ గురించి ప్రశ్నించగా.. తాను మాజీ మంత్రినని, ఎంతో మంది తనకు ఫోన్‌ చేస్తారని, ఆ క్రమంలోనే గుంటూరు శ్రీను మాట్లాడాడని చెప్పినట్లు సమాచారం. గురువారం మధ్యాహ్నంతో అఖిల ప్రియ కస్టడీ ముగియనుంది. కాగా.. రెండు రోజులుగా బేగంపేట మహిళా పోలీస్‌స్టేషన్‌లో అఖిల ప్రియ విచారణ సాగుతుండడంతో.. ఆ పీఎస్‌లోని ఫిర్యాదుల విభాగాన్ని పోలీస్‌క్వార్టర్స్‌కు మార్చారు.

Updated Date - 2021-01-13T21:57:49+05:30 IST