Advertisement
Advertisement
Abn logo
Advertisement
Nov 27 2021 @ 19:59PM

ప్రజలను భయపెట్టేందుకు బీజేపీ యత్నం : అఖిలేశ్ యాదవ్

లక్నో : ప్రజలను భయాందోళనకు గురి చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు. ఆ పార్టీ మద్దతుదారులు లఖింపూర్ ఖేరీలో రైతులను చంపేశారన్నారు. బ్రిటిషర్లు ఎదురు పడి కాల్చేవారని, బీజేపీవారు వెనుక నుంచి చంపుతున్నారని అన్నారు. ఉత్తర ప్రదేశ్‌లోని సండిలలో శనివారం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. 


మూడు సాగు చట్టాలను రద్దు చేయాలని కోరేందుకు రైతులు లఖింపూర్ ఖేరీ వచ్చారని, బీజేపీ నేత, కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా, ఆయన మద్దతుదారులు రైతులను తమ జీపు టైర్ల క్రింద పడేసి తొక్కారని అన్నారు. బ్రిటిషర్లు జలియన్‌వాలాబాగ్‌లో ఎదురు నుంచి కాల్పులు జరిపారని, బీజేపీవారు రైతులను వెనుక నుంచి ఢీకొట్టి చంపేశారని అన్నారు. ప్రజలను భయపెట్టి రాజకీయాలు చేయగలమని వారు అనుకుంటున్నారన్నారు. బ్రిటిషర్లు విభజించి, పాలించారన్నారు. వారు కూడా ప్రజలను భయపెట్టి పరిపాలించగలమని అనుకున్నారన్నారు. ఈసారి భయపడేవారు ఎవరూ లేరని, తాము వారిని తుడిచిపెట్టేస్తామని అన్నారు. 


బీజేపీ హయాంలో రాష్ట్రం వెనుకబడిపోవడం వల్ల ప్రజలు మార్పు కోరుకుంటున్నారని చెప్పారు. తాము అధికారం చేపట్టిన వెంటనే రైతులు, పేదలు, వెనుకబడిన వర్గాల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. బీజేపీ హయాంలో ఉపాధి అవకాశాల సృష్టి జరగలేదని, విద్యుత్తు ఛార్జీలను విపరీతంగా పెంచారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విద్యుత్తు కేంద్రాల పేర్లను నేర్చుకోవడం ప్రారంభించారని, ఆయన పూర్తిగా నేర్చుకునేసరికి ఆయన ప్రభుత్వం పోతుందని అన్నారు. సమాజ్‌వాదీ పార్టీ అధికారంలోకి వస్తే, విద్యుత్తు రంగాన్ని సంస్కరిస్తామని హామీ ఇచ్చారు. 


ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికలు వచ్చే సంవత్సరం ప్రారంభంలో జరుగుతాయి. లఖింపూర్ ఖేరీలో అక్టోబరు 3న జరిగిన సంఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో నలుగురు రైతులు ఉన్నారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అశిష్ మిశ్రాను పోలీసులు అరెస్టు చేశారు. ఆయన కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు. 


Advertisement
Advertisement