Abn logo
Jul 29 2021 @ 03:21AM

అక్క.. చెల్లెళ్లకు ధోకా!

  • ‘పెళ్లి కానుక’ అందక రెండేళ్లకుపైనే..
  • అధికారంలోకి రాగానే పేరు మార్పు..
  • ఇప్పుడు ఏకంగా పథకమే ఎత్తివేత!
  • స్కీమ్‌ అమలుచేసే కల్యాణమిత్రలు ఔట్‌


(అమరావతి-ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో చంద్రన్న కల్యాణ కానుకను వైఎ్‌సఆర్‌ పెళ్లికానుకగా మార్చి రెండేళ్లు దాటినా, పథకం అమలుపై ఇంకా అనుమానాలే! పేరుమార్చి.. గత ప్రభుత్వం అమలుచేసిన స్కీమ్‌ గుర్తురాకుండా ఎన్నెన్నో కసరత్తులు చేసిన ఈ పథకంపై చెప్పే కబుర్లేగానీ ఇంతవరకు అక్కచెల్లెమ్మలకు ‘కానుక’ అందలేదు. అయినా,ఎక్కడో ఒక చిన్నఆశ! నిరుపేద కుటుంబాల్లో ఆడపిల్లల పెళ్లిళ్లు భారం కాకుండా ప్రవేశపెట్టిన ‘కానుక’ అందటం ఆలస్యమైనా.. అసలుకైతే అమలు చేస్తారని నమ్మకం! కానీ, ఈ నమ్మకాన్ని వొమ్ముచేసి..ఇన్నాళ్లుగా అనుమానిస్తూ భయపడిదానినే ప్రభుత్వం నిజం చేసింది. డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో ‘పెళ్లి కానుక’ పనులు చూసే కల్యాణమిత్రలను జిల్లాల్లో తొలగించడం.. తిరిగి ఎన్‌రోల్‌ ప్రక్రియ చేపట్టకపోవడంతో వేలాదిమందిని ఆదుకొనే పథకానికి శాశ్వతంగా చాప చుట్టేసినట్టేనని భావిస్తున్నారు.  


నిరుపేద కుటుంబాల్లో ఆడపిల్లల పెళ్లిళ్లు భారం కాకుండా ఉండేందుకు గత ముఖ్యమంత్రి చంద్రబాబు... చంద్రన్న పెళ్లికానుక పేరుతో పథకాన్ని తీసుకొచ్చారు. నవ వధువు అత్తారింటికి వెళ్లినప్పుడు అభద్రతా భావంతో ఉండరానేది పథకం లక్ష్యం. బాల్య వివాహాలు నిర్మూలించేందుకు, పెళ్లిళ్లు రిజిస్ట్రేషన్లతో వధువుకు రక్షణ కల్పించడం విశాల ప్రయోజనాలు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపు కులాలకు చెందిన  పేదింటి ఆడపిల్లలు ‘కానుకు’కు అర్హులు. ఈ పథకాన్ని  10 రకాల వర్గాలకు సింగిల్‌ డెస్క్‌ విధానంలో అమల్లోకి తెచ్చారు.  వధూవరులు వివాహానికి 15 రోజుల ముందు 1100కు ఫోన్‌ చేస్తే కల్యాణమిత్రలు అందుబాటులోకి వచ్చేవారు. పథకం వివరాలు తెలపడంతోపాటు కానుకను అందించడం వరకు కల్యాణమిత్రులే కీలకం. వారినే ఇప్పుడు ప్రభుత్వం తొలగించింది. నిజానికి, కొత్తగా అధికారంలోకి వచ్చిన తొలిరోజు నుంచే ‘పెళ్లి కానుక’పై వైసీపీ సర్కారు గురిపెట్టింది. చంద్రన్న పెళ్లికానుక చేసిన ప్రభుత్వం..


 2019 అక్టోబరులో వైఎ్‌సఆర్‌ కానుకను పెంచుతున్నట్టు ప్రకటించిన పెంచిన కానుకతో పథకాన్ని 2020 ఏప్రిల్‌ 2వ తేదీ నుంచి అమల్లోకి తెస్తామని ప్రకటించింది. ఈ తేదీ ఇచ్చింది.. వెళ్లిపోయింది. సీఎం జగన్‌ 2020 నవంబరు 11న మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ జయంతి సందర్భంగా స్వయంగా హామీ ఇచ్చారు. గతంలో పెండింగ్‌లో ఉన్న పెళ్లికానుక, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంజూరైన పెళ్లికానుక లబ్ధిదారులకు ఈ ఏడాది మార్చిదాకా ఇవ్వలేమని ప్రకటించారు. నిధులు కొరతను కారణంగా చూపారు. కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి తెస్తామని చెప్పారు. అంటే గత ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి వైఎస్సార్‌ పెళ్లి కానుక అందాలి. అయితే తాజా బడ్జెట్‌లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు సంబంధించిన ఏ శాఖ పద్దలోనూ వైఎస్సార్‌ కల్యాణ కానుకకు కేటాయింపులు చేయకపోవడం గమనార్హం. ఇంతలోనే.. కల్యాణ మిత్రలను జిల్లాల్లో తొలగిస్తున్నట్టు వార్తలు!


అన్నీ తామే అయిన మిత్రలు..

కల్యాణకానుక అమలు చేసేందుకు గత ప్రభుత్వం కల్యాణమిత్రలను నియమించింది. డ్వాక్రా సభ్యుల్లోనే కొందరికి ఈ బాధ్యతలు అప్పగించింది. నవ వధూవరులను రిజిస్ట్రేషన్ల ప్రక్రియ వారి ఆధ్వర్యంలో చేపట్టేవారు. వివాహ సమయంలో కల్యాణమిత్ర హాజరై దంపతుల నుంచి వివరాలను సేకరించి పథకం లబ్ధి మంజూరయ్యేందుకు కృషి చేస్తారు. అయితే ఇటీవల డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో పనిచేస్తున్న కల్యాణమిత్రలను జిల్లాల్లో తొలగించారు. ఎన్‌రోల్‌ ప్రక్రియ కూడా చేపట్టకపోవడం లబ్ధిదారులను ఆందోళనకు గురిచేస్తోంది. చంద్రబాబు ప్రభుత్వంలో రాష్ట్రవ్యాప్తంగా 2018-19లో 94,749 రిజిస్ట్రేషన్లు జరగ్గా, అందులో 83,081 మందికి అర్హత కల్పించి 79,709 మందికి రూ.307 కోట్లు విడుదల చేశారు. ఎన్నికలకోడ్‌ అమల్లోకి రావడం, దరఖాస్తుల ప్రక్రియ పూర్తి కాకపోవడం తదితర కారణాల వల్ల అప్పట్లో మంజూరైన వారిలో  2 వేల మందికి  రూ.27 కోట్ల పెళ్లికానుక ఇంకా అందలేదు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019-20 సంవత్సరానికి గాను 77,735 రిజిస్ట్రేషన్లు కాగా అందులో 10,371 మంది వధువులకు రూ.42.96 కోట్లు కానుక మంజూరుచేశారు. దీనికితోడు పథకం లబ్ధిని కొంతమేర పెంచి మరిన్ని ఆశలు కల్పించారు. ఎస్సీ, ఎస్టీల్లో కొత్తగా పెళ్లి అయిన వధువులకు రూ.ఒక లక్ష కానుక ఇవ్వనున్నట్లు ఉత్తర్వులు జారీచేసింది. గతంలో ఇది రూ. 50వేలు. పెళ్లి కానుక వస్తుందని అప్పటినుంచి అక్క..చెల్లెమ్మలు ఎదురుచూస్తూనే ఉన్నారు.