ఓవర్సీస్‌లో బాక్స్ ఆఫీస్‌ బద్దలు కొట్టిన బన్నీ

ABN , First Publish Date - 2020-02-04T02:52:32+05:30 IST

ఓవర్సీస్‌లో బాక్స్ ఆఫీస్‌ బద్దలు కొట్టిన బన్నీ

ఓవర్సీస్‌లో బాక్స్ ఆఫీస్‌ బద్దలు కొట్టిన బన్నీ

స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన అల..వైకుంఠపురములో చిత్రం రోజుకో రికార్డును సృష్టిస్తోంది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో నాన్ బాహుబలి రికార్డును సృష్టించిన ఈ చిత్రం తాజాగా అమెరికాలోనూ సరికొత్త రికార్డును నెలకొల్పింది. 3.51 మిలియన్ డాలర్ల(రూ. 24 కోట్ల 98 లక్షలు)తో అమెరికాలో ఇప్పటివరకు మూడో స్థానంలో ఉన్న రంగస్థలం చిత్రాన్ని బీట్ చేసి ఆ స్థానాన్ని అల.. వైకుంఠపురములో తాజాగా కైవసం చేసుకుంది. ఆదివారం నాటికి అమెరికాలో అల.. వైకుంఠపురములో చిత్రం 3.57 మిలియన్ డాలర్ల(రూ. 25 కోట్ల 45 లక్షలు)ను సాధించింది. ఇప్పటివరకు 2 మిలియన్ డాలర్ల క్లబ్‌లో కూడా లేని బన్నీ.. ఒకేసారి 3 మిలియన్ క్లబ్‌లో చేరడంతో బన్నీ అభిమానులు తెగ పండగ చేసుకుంటున్నారు. విడుదలై 20 రోజులు దాటినప్పటికీ.. అమెరికాలో అల.. వైకుంఠపురములో చిత్రం మంచి కలెక్షన్లను రాబడుతోంది. 

ఇదిలా ఉండగా.. అమెరికాలో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రాల జాబితాలో తొలి నాలుగు స్థానాల్లో బాహుబలి పార్ట్ 2, బాహుబలి పార్ట్ 1, రంగస్థలం, భరత్ అనే నేను చిత్రాలు ఉన్నాయి. బాహుబలి పార్ట్ 2 అమెరికాలో 20.77 మిలియన్ డాలర్లు(రూ. 147 కోట్ల 82 లక్షలు) సాధించి ఎవరికీ అందని ఎత్తులో ఉంది. ఆ తర్వాత బాహుబలి పార్ట్ 1 7.51 మిలియన్ డాలర్ల(రూ. 53 కోట్ల 45 లక్షలు)తో రెండో స్థానంలో నిలిచింది. 3.51 మిలియన్ డాలర్ల(రూ. 24 కోట్ల 98 లక్షలు)తో రంగస్థలం మూడో స్థానంలో, 3.42 మిలియన్ డాలర్ల(రూ. 24 కోట్ల 34 లక్షలు)తో భరత్ అనే నేను నాలుగో స్థానంలో ఉన్నాయి. 

2018లో 20 రోజుల గ్యాప్‌తో రంగస్థలం, భరత్ అనే నేను చిత్రాలు విడుదల కాగా.. రెండు సినిమాలు అమెరికాలో గట్టి కలెక్షన్లను రాబట్టి మూడు, నాలుగు స్థానాలను కైవసం చేసుకున్నాయి. దాదాపు రెండేళ్లు గడిచినా ఈ రెండు చిత్రాలను మరో చిత్రం బద్దలు కొట్టలేదు. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన సాహో, సైరా నరసింహారెడ్డి చిత్రాలు అమెరికాలో నాన్ బాహుబలి రికార్డును నెలకొల్పుతాయని అందరూ భావించారు. అయితే అమెరికాలో ఆశించిన స్థాయిలో ఈ రెండు చిత్రాలు కలెక్షన్లను రాబట్టలేకపోయాయి. తాజాగా బన్నీ ఈ రికార్డును బద్దలు కొట్టడంతో మెగా ఫ్యామిలీ ఖుషీగా ఉంది. బాహుబలి తరువాత మూడు, నాలుగు స్థానల్లో బన్నీ, రామ్ చరణ్ సినిమాలు నిలవడంతో.. మెగా అభిమానులు సంబరపడుతున్నారు. 

Updated Date - 2020-02-04T02:52:32+05:30 IST