బందోపాధ్యాయ్ సమర్ధుడైన అధికారి, కేంద్రం ఆయనను బాధిస్తోంది: మమత

ABN , First Publish Date - 2021-06-24T00:47:35+05:30 IST

బాధ్యతల నిర్వహణలో ప్రవర్తన సరిగా లేదంటూ పశ్చిమబెంగాల్ మాజీ చీఫ్ సెక్రటరీ అలపన్...

బందోపాధ్యాయ్ సమర్ధుడైన అధికారి, కేంద్రం ఆయనను బాధిస్తోంది: మమత

కోల్‌కతా: బాధ్యతల నిర్వహణలో ప్రవర్తన సరిగా లేదంటూ పశ్చిమబెంగాల్ మాజీ చీఫ్ సెక్రటరీ అలపన్ బందోపాధ్యాయ్‌పై కేంద్రం పెనాల్టీ ప్రొసీడింగ్స్ ప్రారంభించడంపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారంనాడు ఘాటుగా స్పందించారు. బందోపాధ్యాయ్ సమర్ధత కలిగిన,  నిజాయితీపరుడైన అధికారి అని అన్నారు. పశ్చిమబెంగాల్‌కు చెందిన అధికారిని కేంద్రం బాధిస్తోందని, దీనిపై ఆయన (బందోపాధ్యాయ్) ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తమ ప్రభుత్వం అండగా నిలుస్తుందని మమత భరోసా ఇచ్చారు.


అలపన్ బందోపాధ్యాయ్‌పై క్రమశిక్షణా చర్యలు ప్రారంభించడం ద్వారా పశ్చిమబెంగాల్ ప్రభుత్వాన్ని పనిచేయకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తోందంటూ టీఎంసీ రెండ్రోజుల క్రితం ఆరోపించింది. పశ్చిమబెంగాల్ ప్రభుత్వంపై అకారణమైన ద్వేషం పెంచుకోవడం కేంద్ర ప్రభుత్వ విధానంగా మారిందని ఆరోపించింది. బందోపాధ్యాయ్‌పై చర్యలకు ఉపక్రమించడం ద్వారా సమాఖ్య విధానంలో రెచ్చగొట్టే విధానాలకు కేంద్రం తెరలేపుతోందని విమర్శించింది. కాగా, ఈ ఆరోపణలన్నీ నిరాధారమని, మమతా బెనర్జీ ప్రభుత్వం బ్రూరోక్రసీని రాజకీయం చేస్తోందని బీజేపీ తిప్పికొట్టింది.


బందోపాధ్యాయ్ విషయంలో ఇటు మమతా బెనర్జీ, అటు కేంద్ర ప్రభుత్వం పట్టుదల ప్రదర్శించడంతో సమస్య బిగుసుకుంది. మే 31న పదవీ విరమణ చేసిన బందోపాధ్యాయ్ ప్రస్తుతం మమతాబెనర్జీ ప్రధాన సలహాదారుగా నియమితులయ్యారు. దీనికి ముందు ప్రధాని మోదీ అధ్యక్షత వహించిన సమావేశానికి బందోపాధ్యాయ్ హాజరుకాకపోవడాన్ని కేంద్రం సీరియస్‌గా తీసుకుంది. డిజాస్టర్ మేనేజిమెంట్ చట్టంలోని కఠినమైన ఒక నిబంధన కింద ఆయనకు షోకాజ్ నోటీసు పంపింది. ఈ నిబంధన కింద రెండేళ్ల జైలు పడే అవకాశం ఉంటుంది. పెనాల్టీ చర్యలు తీసుకుంటే పదవీ విరమణ అనంతరం వచ్చే ప్రయోజనాలు పాక్షికంగా కానీ, పూర్తిగా కానీ కోల్పోవలసి రావచ్చు.

Updated Date - 2021-06-24T00:47:35+05:30 IST