అమ్మో... మేం ఇలా పని చేయలేం : China ఉద్యోగుల గగ్గోలు

ABN , First Publish Date - 2021-10-14T23:39:36+05:30 IST

ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు వారంలో ఆరు

అమ్మో... మేం ఇలా పని చేయలేం : China ఉద్యోగుల గగ్గోలు

బీజింగ్ : ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు వారంలో ఆరు రోజులపాటు పని చేయవలసిన పరిస్థితులను చైనాలోని ప్రైవేటు ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ అతి పని సంస్కృతిపై నిరసన తెలిపేందుకు ఆన్‌లైన్ ఉద్యమాన్ని ప్రారంభించారు. ‘కార్మికుడి జీవితం ముఖ్యమైనదే’నంటూ జరుగుతున్న ఈ ఉద్యమంలో ఉద్యోగులు, కార్మికులు పని చేస్తున్న సమయం వివరాలను సేకరిస్తున్నారు. 


ఈ ఉద్యమకారులు గిట్‌హబ్ అనే సాఫ్ట్‌వేర్ కొలాబరేషన్ సైట్‌లో ఓ పేజీని నిర్వహిస్తున్నారు. ‘‘ఉద్యోగులు కూడా బతకాలి’’ అని పేర్కొన్నారు. టెక్నాలజీ, ఫైనాన్స్ వంటి వివిధ రంగాల్లో పని చేస్తున్నవారు ఏ సమయంలో తమ విధులను ప్రారంభిస్తున్నారు? ఏ సమయానికి ముగిస్తున్నారు? వారంలో ఎన్ని రోజులు పని చేస్తున్నారు? వంటి వివరాలను తెలియజేయాలని కోరుతున్నారు. గురువారం నాటికి ఈ స్ప్రెడ్‌షీట్‌లో 4,000కు పైగా ఎంట్రీలు నమోదయ్యాయి. తమ వివరాలను ఇచ్చిన ఉద్యోగుల్లో టెన్సెంట్ హోల్డింగ్స్ లిమిటెడ్, అలీబాబా గ్రూప్ హోల్డింగ్ లిమిటెడ్, బైట్‌డ్యాన్స్ లిమిటెడ్ వంటి సంస్థలకు చెందినవారు కూడా ఉన్నారు. 


ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు వారంలో ఆరు రోజులపాటు పని చేయడాన్ని 996 అంటారు. దీనిపై ఈ సంవత్సరం పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. అతిగా పని చేయడం వల్ల కొందరు ప్రాణాలు కోల్పోయినట్లు ఉద్యమకారులు చెప్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో కూడా అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ స్పందిస్తూ, ఉమ్మడి సౌభాగ్యం కోసం దేశం పని చేయాలని పిలుపునిచ్చారు. దీంతో అధికారులు రంగంలోకి దిగి, అసమంజసమైన ఓవర్‌టైమ్, ఇతర నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడరాదని సంస్థల యాజమాన్యాలను హెచ్చరించారు. 


Updated Date - 2021-10-14T23:39:36+05:30 IST