Abn logo
May 7 2021 @ 04:23AM

మద్యం ఢమాల్‌

పగటి కర్ఫ్యూతో సగమే విక్రయాలు

ఉదయమే తెరిచినా జోరు అంతంతే

విడిరోజుల్లో రోజుకు రూ.65 కోట్లు

ఇప్పుడు రోజుకు 36కోట్లే అమ్మకాలు

బార్లలో మరింత పతనం..20శాతమే

రూ.10 కోట్లు అమ్మేచోట రూ.2 కోట్లే

ఆంక్షలతో ఆదాయంపై తీవ్ర ప్రభావం


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

ఉదయం ఆరు గంటల నుంచే ప్రభుత్వం మద్యం షాపులను బార్లా తెరిచినా మందుబాబులు సీసాల కోసం పరుగులు పెట్టడం లేదు. ఆదాయం తగ్గిపోకూడదనే లక్ష్యంతో ఉదయాన్నే షాపులు తీస్తున్నప్పటికీ మద్యం అమ్మకాల్లో జోరు కనిపించడం లేదు. ఇక బార్లు అయితే ఉన్నాయా లేవా అన్నట్టుగా అమ్మకాలు పడిపోయాయి. మొత్తంగా కర్ఫ్యూ నిబంధనలు మద్యం అమ్మకాలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. తొలి రెండు రోజుల గణాంకాలు చూస్తే ఈ నెల ఆదాయం అంతంతమాత్రంగానే ఉంటుందని అర్థమవుతోంది. సాధారణంగా రోజుకు మద్యం షాపుల్లో రూ.65 కోట్ల వరకు అమ్మకాలు జరుగుతాయి. కానీ బుధవారం కేవలం రూ.36 కోట్ల విలువైన మద్యమే అమ్ముడైంది. గురువారం కూడా అటూఇటూగా అంతే అమ్మకాలు జరిగాయి. ఇక బార్లలో రోజుకు సగటున రూ.10 కోట్ల అమ్మకాలు జరుగుతాయి. కానీ ఇప్పుడు రోజుకు రూ.2 కోట్లకు మించి అమ్మకాలు లేవు. అంటే ఏకంగా 80శాతం అమ్మకాలు పడిపోయాయి. సాధారణంగా బార్లలో వ్యాపారం సాయంత్రం నుంచి రాత్రి వరకు బాగా సాగుతుంది. సాధారణ సమయాల్లోనూ మధ్యాహ్నం లోపల బార్లకు వచ్చేవారూ పెద్దగా ఉండరు. ఇప్పుడు ఆ సమయాల్లోనే బార్లు మూస్తుండటంతో అమ్మకాలు పడిపోయాయి. ఇక షాపుల్లోనూ సాధారణ స్థాయి అమ్మకాలు లేకపోవడం ఎక్సైజ్‌ శాఖను విస్మయానికి గురిచేస్తోంది. సాధారణంగా రాష్ట్రంలో మద్యం అమ్మకాలు ఉదయం 11గంటల నుంచి రాత్రి 9గంటల వరకు సాగుతాయి. కర్ఫ్యూ నేపథ్యంలో అమ్మకాలు తగ్గకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం అన్ని వ్యాపారాల తరహాలో మద్యం షాపులను ఉదయాన్నే తెరవాలని నిర్ణయించింది. అందువల్ల సాధారణంగా వచ్చే ఆదాయానికి ఢోకా ఉండదని భావించింది. కానీ ఒకేసారి సగం అమ్మకాలు పడిపోవడంతో ఆదాయం మరింత తగ్గిపోతుందేమోననే ఆందోళన ప్రభుత్వ వర్గాల్లో వ్యక్తమౌతోంది. 


ఎందుకంటే..?

కొవిడ్‌ విస్తరణ నేపథ్యంలో అన్ని వ్యాపారాలు మందగించాయి. ఒక్క మద్యం మాత్రమే ప్రభుత్వానికి అత్యధిక ఆదాయాన్ని తెచ్చిపెట్టే ఆర్థిక వనరు. రోజుకు రూ.70కోట్ల మద్యం అమ్మితే దాదాపు రూ.60 కోట్లు ప్రభుత్వ ఖజానాకు వచ్చిపడతాయి. మరే ఇతర శాఖ నుంచీ ప్రభుత్వానికి రోజువారీ ఈ స్థాయి ఆదాయం వచ్చే అవకాశం లేదు. అందువల్ల మద్యం అమ్మకాలు తగ్గకుండా ఉంటేనే కరోనా గడ్డు పరిస్థితులు అధిగమించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. కాగా మద్యం అమ్మకాలు పడిపోవడానికి కూడా కరోనానే కారణంగా కనిపిస్తోంది. కొవిడ్‌ కారణంగా ఉపాధి పనులు తగ్గిపోవడం, ఆస్పత్రులకు ఎక్కువ మొత్తంలో నగదు వెచ్చించడం లాంటి అంశాలు మద్యం అమ్మకాలు తగ్గిపోయేలా చేశాయని భావిస్తున్నారు. గత కొద్ది రోజులుగా కరోనా వ్యాప్తి తీవ్రస్థాయిలో ఉండటంతో ఉపాధి పనులు ఆగిపోయాయి. ఒకవేళ పనులు ఉన్నా బయటికెళ్లేందుకు ప్రజలు ధైర్యం చేయలేకపోతున్నారు. మరోవైపు సాధారణ జ్వరం, జలుబు వచ్చినా మెడిసిన్‌ ఖర్చు పెరిగిపోతుంది. సాధారణ రోగాలకు కూడా కొవిడ్‌ తరహా మెడిసిన్‌ వాడుతుండటం సాధారణ ప్రజలపై ఆర్థిక భారం మోపుతోంది. ఫలితంగా నగదు లావాదేవీలు తగ్గిపోతుండటంతో అవి మద్యం అమ్మకాలపై ప్రభావం చూపుతున్నాయి. 


బెల్టులుంటేనే ఈ మాత్రమైనా..

తెలంగాణ నుంచి వస్తున్న నాన్‌ డ్యూటీ పెయిడ్‌ లిక్కర్‌, నాటుసారా కూడా మద్యం అమ్మకాల తగ్గిపోవడానికి కారణం అవుతున్నాయి. ఆ రెండూ ఏపీ మద్యం ధరల కంటే తక్కువ కావడమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. అయితే ఈ మధ్యకాలంలో బెల్టు షాపుల సంఖ్య రాష్ట్రంలో పెరిగిపోయింది. బెల్టులు ఉంటేనే అమ్మకాలు ఈ మాత్రం అయినా ఉన్నాయని, లేదంటే ఇంకా దారుణంగా పడిపోయేవనే వాదన వినిపిస్తోంది.

Advertisement