మద్యం.. ‘మంత్ర’జాలం

ABN , First Publish Date - 2020-05-30T09:10:40+05:30 IST

కరోనా లాక్‌డౌన్‌తో అన్నింటికీ తాళాలు పడ్డాయి. మద్యం దుకాణాలు, బార్‌లు కూడా తాళాలు పడినా.. అదేమి మాయో!.. సీళ్లు, తాళాలు చెక్కు చెదరకుండానే మద్యం మాయమైపోయింది. జిల్లాలో లాక్‌డౌన్‌కు ముందు 163 దుకాణాలు వ్యాపారం సాగించాయి.

మద్యం.. ‘మంత్ర’జాలం

సరుకులో రూ.లక్షల్లో తేడాలు

చక్రం తిప్పిన ప్రజాప్రతినిధులు

చేతులు కలిపిన సూపర్‌వైజర్లు, సేల్స్‌మెన్లు

లెక్కలు తేల్చిన ఐఎంఎల్‌ డిపోలు

తోట్లవల్లూరు షాపులో రూ.22లక్షలు తేడా?


మద్యంలో ‘మంత్ర’జాలం పనిచేసింది. కస్టోడియన్లుగా ఉండాల్సిన వాళ్లు కాసులకు కక్కుర్తిపడి నేతలతో చేతులు కలిపారు. ‘లాక్‌’ తీయకుండానే లక్షల రూపాయల విలువచేసే మద్యం మాయమైపోయింది. నియంత్రించాల్సిన ఎక్సైజ్‌ శాఖ మిన్నకుండిపోయింది. ‘అధికార’ అండదండలుంటే తెగింపు ఎలా ఉంటుందో తెలిపే నిదర్శనాలు బోలెడు. లక్షల్లో మద్యం లెక్కలు మారిపోయాయి. ఈ సరికొత్త లెక్కలు ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నాయి. 


ఆంధ్రజ్యోతి - విజయవాడ : కరోనా లాక్‌డౌన్‌తో అన్నింటికీ తాళాలు పడ్డాయి. మద్యం దుకాణాలు, బార్‌లు కూడా తాళాలు పడినా.. అదేమి మాయో!.. సీళ్లు, తాళాలు చెక్కు చెదరకుండానే మద్యం మాయమైపోయింది. జిల్లాలో లాక్‌డౌన్‌కు ముందు 163 దుకాణాలు వ్యాపారం సాగించాయి. లాక్‌డౌన్‌తో ఇవన్నీ మూతపడ్డాయి. అప్పటి వరకు జరిగిన అమ్మకాలు, షాపుల్లో సరుకు లెక్కలను ఎక్సైజ్‌ అధికారులు సరిచూశాకే దుకాణాలకు తాళాలు పడ్డాయి. రెండు నెలల సుదీర్ఘ విరామం తరువాత ఈనెల నాలుగో తేదీ నుంచి గ్రీన్‌జోన్లలోని మద్యం దుకాణాలను తెరిచారు. దీనికి ముందుగా జిల్లాలోని ఐఎంఎల్‌ డిపోలకు చెందిన ఆడిట్‌ బృందం ఆయా షాపుల్లో సరుకులను పరిశీలించింది. ఇక్కడే చీకట్లో జరిగిన మద్యం మాయ బట్టబయలైంది. గుడివాడ పట్టణంలో నాలుగు మద్యం దుకాణాల నుంచి రూ.5.45లక్షల విలువైన మద్యం తేడా వచ్చిందని ఈ బృందం నిర్ధారించినట్టు తెలిసింది. జిల్లాలో అత్యధికంగా తోట్లవల్లూరులోని ఒక మద్యం దుకాణం నుంచి ఏకంగా రూ.22లక్షల మద్యం మాయమైనట్టు ఆడిట్‌ అధికారులు గుర్తించారు.


కైకలూరు మండలం కొల్లేటికోటలో రూ.2లక్షల సరుకు మాయమయింది. పెదపారుపూడి మండలం వెంట్రప్రగడలోని దుకాణం నుంచి సుమారు 248 క్వార్టర్‌ మద్యం సీసాలు అదృశ్యమయ్యాయి. ఆయా దుకాణాల్లో ఉన్న సూపర్‌వైజర్లు, సేల్స్‌మెన్లు స్థానిక ప్రజాప్రతినిధులతో చేతులు కలిపి ఈ సరుకును మాయం చేసినట్టు తెలిసింది. అధికారం చేతిలో ఉండడంతో దీనికి సంబంధించిన మొత్తం డబ్బును సూపర్‌వైజర్లు, సేల్స్‌మెన్ల నుంచి గంటల వ్యవధిలో వసూలు చేశారు. వారిపై చర్యలు తీసుకోవడానికి అధికారులను ‘అధికారం’ వెనక్కి లాగేసింది.


ఆ మద్యాన్ని బ్లాక్‌లో అమ్మినందునే సూపర్‌వైజర్లు, సేల్స్‌మెన్లు డబ్బు చెల్లించగలిగారని ప్రజలు బహిరంగంగా మాట్లాడుకుంటున్నారు. అసలు ధర కంటే మూడు రెట్లు పెంచి సరుకును ‘చీకట్లో’ అమ్ముకున్నారు. ఇలా సంపాదించిన డబ్బులను అందరూ కలిసి వాటాలు వేసుకున్నారు. అందువల్లే మాయం చేసిన సరుకుకు డబ్బులను గంటల వ్యవధిలో చెల్లించేశారు. సరుకు గడప దాటినా, గుట్టు రట్టు కాకుండా కాపాడుకున్నారు. మాయమైన సరుకును దుకాణాల పునఃప్రారంభంలో విక్రయించినట్టు రికార్డుల్లో చూపించుకున్నారని తెలుస్తోంది. 

Updated Date - 2020-05-30T09:10:40+05:30 IST