మద్యం మోసం!

ABN , First Publish Date - 2020-05-26T16:58:08+05:30 IST

సర్కారు మద్యం మందుబాబులకు చుక్కలు చూపెడుతోంది. లాక్‌డౌన్‌ అక్రమార్కులకు.

మద్యం మోసం!

డిమాండ్‌ ఉన్న బ్రాండ్లు బ్లాక్‌మార్కెట్‌కు

అధిక ధరలకు విక్రయిస్తున్న సిబ్బంది

అధికారులకు భారీగా మామూళ్లు 

పక్క రాష్ట్రాల నుంచి తెచ్చి విక్రయాలు

రెడ్‌జోన్లకు జోరుగా మద్యం సరఫరా

గుప్పుమంటున్న నాటుసారా


ఒంగోలు (ప్రకాశం): సర్కారు మద్యం మందుబాబులకు చుక్కలు చూపెడుతోంది. లాక్‌డౌన్‌ అక్రమార్కులకు బాగా కలిసొచ్చింది. లిక్కర్ విక్రయాలు నిలిపివేసిన సమయంలో కొందరు మద్యం దుకాణాల సిబ్బంది, కాస్తంత పలుకుబడి కలిగిన వ్యక్తులు కుమ్మక్కై రెచ్చిపోయి భారీ ధరలకు అమ్ముకొని సొమ్ము చేసుకున్నారు. విక్రయాలకు గ్రీన్‌సిగ్నల్‌ లభించిన తర్వాత అక్రమ వ్యాపారం కట్టలు తెంచుకుంది. ఒకవైపు నాటుసారా, మరోవైపు ఇతర రాష్ట్రాల నుంచి మద్యం దిగుమతి అవుతుండగా, పెరిగిన ధరలను అవకాశంగా చేసుకొని సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారు. అంతేకాదు డిమాండ్‌ ఉన్న మద్యం బాటిళ్లను బ్లాక్‌మార్కెట్‌కు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. అధికారులకూ భారీగా మామూళ్లు ఇస్తుండటంతో వారు కూడా మిన్నకుండిపోతున్నారు. దీంతో మద్యం దుకాణాల్లో సిబ్బంది వ్యవహారం ఇష్టారాజ్యంగా మారిపోయింది. 


మద్యం విక్రయాల్లో అవినీతి గుప్పుమంటోంది. కొందరు సిబ్బంది ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ అక్రమ విక్రయాలకు తెరతీశారు. సర్కారీ దుకాణాల ముసుగులో బయట మద్యం తెప్పించి భారీ ధరలకు అమ్మడం, డిమాండ్‌ ఉన్న బ్రాండ్లను బ్లాక్‌ మార్కెట్‌కు తరలించి సొమ్ము చేసుకోవడం ఎక్కువైంది. అక్రమ వ్యాపారాన్ని అరికట్టేందుకు ఏర్పాటు చేసిన స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ బ్యూరో (ఎస్‌ఈబీ)లో కొంతమంది అధికారులు మామూళ్లు మాట్లాడుకొని అక్రమ వ్యాపారానికి పచ్చజెండా ఊపుతున్నారన్న ఆరోపణలున్నాయి.


డిమాండ్‌ ఉన్న బ్రాండ్లు మాయం

నూతన మద్యం విధానంలో పాత బ్రాండ్లు లేవు. ఉన్నవి కూడా కొన్నే. వాటిలో కొన్ని బ్రాండ్లకు బాగా డిమాండ్‌ ఉంది. ఇదే అదనుగా దుకాణాల్లో పనిచేసే సిబ్బంది ఆ బ్రాండ్లను బ్లాక్‌మార్కెట్‌కు తరలించి విక్రయిస్తున్నారు. దుకాణాలకు చేరకుండానే కేస్‌లు బయటకు వెళుతున్నాయి. తప్పనిసరి పరిస్థితిలో  దుకాణాల్లో ఎప్పుడూ వినని బ్రాండ్ల మద్యం కొనుగోలు చేస్తున్నామని మందుబాబులు అంటున్నారు. 


పక్క రాష్ట్రాల నుంచి మద్యం

రాష్ట్రంలో మద్యం ధరలు 70శాతంపైనే పెరగడం, అదీ అవసరమైన బ్రాండ్‌లు అందుబాటులో లేకపోవడాన్ని ఆసరాగా చేసుకొని కొందరు అక్రమ వ్యాపారానికి తెరలేపారు. ముఖ్యంగా కర్ణాటక, తెలంగాణల నుంచి మద్యాన్ని కార్లు, లారీల్లో తెచ్చి విక్రయిస్తున్నారు. అందుకు ఉదాహరణ చిత్తూరు జిల్లాలో కర్ణాటక నుంచి లారీలో తరలిస్తుండగా పోలీసులు పట్టుకోవడమే. లారీలో ఉన్న వారిని విచారించగా మందును చీరాలకు తరలిస్తున్నట్లు తెలిసింది. అంతేకాదు సముద్ర మార్గం నుంచి కూడా మద్యం తెచ్చి సొమ్ము చేసుకుంటున్నారు. 


మామూళ్ల మత్తులో అధికారులు

అక్రమ మద్యం విక్రయాలకు సంబంధించి అధికారులకు భారీగా మామూళ్లు ముడుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఒక ప్రాంతంలో ఉన్న అధికారి ‘మీరు ఎలాగైనా అమ్ముకోండి నాకు మాత్రం వారానికి ఒక పెట్టె మద్యం ఇవ్వాలి’ అంటూ హుకుం జారీచేసినట్లు తెలిసింది. మరోప్రాంత అధికారి తనకు రోజుకు దుకాణానికి రూ.వెయ్యి మామూలివ్వాలని షరతు పెట్టారు. ఇలా అధికారులు మామూళ్ల మత్తులో విచ్చలవిడిగా విక్రయాలకు జెండా ఊపేశారు. ఇదే అదనుగా ప్రభుత్యం 70 శాతం ధర పెంచితే దానికి 5 నుంచి 10శాతం అదనంగా సిబ్బంది దండుకుంటున్నారు.


రెడ్‌జోన్లలో మద్యం విక్రయాల నిలిపివేత కొంతమందికి వ్యాపారంగా మారింది. ఇదే అదనుగా గ్రీన్‌జోన్లలో మద్యం దుకాణాల సిబ్బందితో  చేతులు కలిపి భారీగా మద్యం కొనుగోలు చేసి రెడ్‌జోన్లలో అధిక ధరలకు అమ్ముకుంటున్నారు. మద్యం ధరలు పెరగడంతోపాటు సారా కాసేవారికి రెక్కలు వచ్చాయి. పశ్చిమ ప్రాంతంలో ఉన్న తండాలలో అధికంగా నాటుసారాను కాస్తున్నారు. కొంతమంది కుటీర పరిశ్రమలా మార్చుకొని విక్రయిస్తున్నారు.


నేడు ఎక్సైజ్‌ అధికారులతో ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ సమీక్ష

మద్యం, ఇసుక అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరోను ఏర్పాటు చేసింది. అందుకు సంబందించి ఏఎస్పీని నియమించింది. జిల్లాలో రాజేంద్రరావు అదనపు ఎస్పీగా భాధ్యతలు చేపట్టారు. అంతేకాకుండా ఎక్సైజ్‌శాఖలో 70శాతం మంది అధికారులు, సిబ్బందిని అక్కడ నుంచి ఎస్‌ఈబీకి పంపించి గత వారం రోజులుగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎస్పీ సిద్ధార్థకౌశల్‌ మంగళవారం ఎస్‌ఈబీ అధికారులతో సమీక్ష చేయనున్నారు. అనంతరం తీసుకునే చర్యలతో మద్యం పరవళ్లకు అడ్డుకట్ట పడుతుందా? లేదా? అనేది వేచిచూడాలి.


అక్రమార్కులపై కేసులు

మద్యం అక్రమ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఎవరినీ వదలం. కేసులు నమోదు చేస్తాం. అద్దంకి ప్రాంతంలో మా సిబ్బంది ఆదివారం దాడులు నిర్వహించి కేసులు నమోదు చేశారు. సిబ్బంది విషయంపై దృష్టిసారించి చర్యలు తీసుకుంటాం.

- రాజేంద్రరావు, అదనపు ఎస్పీ (ఎస్‌ఈబీ) 

Updated Date - 2020-05-26T16:58:08+05:30 IST