ఏపీలో దొరకని మందు తెలంగాణకు కాసుల విందు

ABN , First Publish Date - 2020-02-22T07:03:46+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌లో తీసుకువచ్చిన కొత్త మద్యం విధానం.. తెలంగాణకు కాసుల పంట పండిస్తోంది. నూతన పాలసీలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మద్యం రేట్లను భారీగా పెంచేయడంతోపాటు మద్యం ప్రియులకు ఇష్టమైన బ్రాండ్లు కాకుండా కొత్త బ్రాండ్లను విక్రయిస్తోంది. మరోవైపు...

ఏపీలో దొరకని మందు తెలంగాణకు కాసుల విందు

ఏపీ షాపుల్లో పెరిగిన మద్యం ధరలు

మందుబాబులకు దొరకని ఇష్టమైన మద్యం 

సరిహద్దులోని తెలంగాణ వైపు దుకాణాల్లో

తక్కువ ధర, అందుబాటులో అన్ని బ్రాండ్లు

మద్యం ప్రియుల క్యూ.. భారీగా అమ్మకాలు


(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): ఆంధ్రప్రదేశ్‌లో తీసుకువచ్చిన కొత్త మద్యం విధానం.. తెలంగాణకు కాసుల పంట పండిస్తోంది. నూతన పాలసీలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మద్యం రేట్లను భారీగా పెంచేయడంతోపాటు మద్యం ప్రియులకు ఇష్టమైన బ్రాండ్లు కాకుండా కొత్త బ్రాండ్లను విక్రయిస్తోంది. మరోవైపు తెలంగాణలో తమకు నచ్చిన బ్రాండ్ల మద్యం తక్కువ ధరకే లభిస్తోంది. దీంతో మందుబాబులు రెండు రాష్ట్రాల సరిహద్దులోని తెలంగాణ వైపు ఉన్న మద్యం దుకాణాలకు క్యూ కడుతున్నారు. ఫలితంగా ఏపీలో మద్యం ఆదాయం తగ్గిపోతుండగా.. తెలంగాణకు భారీ ఆదాయం సమకూరుతోంది. కృష్ణా జిల్లా సరిహద్దుల్లో తెలంగాణ వైపు ఉన్న మద్యం దుకాణాల్లో గతంలో రోజుకు లక్షరూపాయల వరకు జరిగే విక్రయాలు.. ఇప్పుడు రూ.5-10 లక్షలకు పెరిగాయి. ఏపీలోని వీరులపాడు మండలం జయంతి, జుజ్జూరు దుకాణాల్లో కలిపి రోజుకు రూ.2లక్షల మద్యం విక్రయాలు మాత్రమే జరుగుతున్నాయి. కాగా ఇదే మండలాన్ని ఆనుకుని తెలంగాణలో ఉన్న ఎర్రుపాలెంలోని మద్యం దుకాణంలో రోజుకు రూ.6లక్షలు, మీనవోలు దుకాణంలో రూ.5లక్షలు, దెందుకూరు, మడుపల్లి దుకాణాల్లో రూ.3లక్షల చొప్పున విక్రయాలు జరుగుతున్నాయి. జగ్గయ్యపేట మండలం షేర్‌ మహ్మద్‌పేట, గండ్రాయి దుకాణాలు రెండూ కలిపి రోజుకు రూ.2 లక్షల్లోపే వ్యాపారం చేస్తుండగా, ఇక్కడికి కూతవేటు దూరంలో ఉన్న సూర్యాపేట జిల్లా రామాపురం క్రాస్‌రోడ్డులోని దుకాణం ఒక్కటే రోజుకు రూ.10 లక్షల విక్రయాలు చేస్తోంది. ఇవికాకుండా తెలంగాణ వైపు అనధికారికంగా పుట్టగొడుగుల్లా వెలిసిన బెల్టుషాపుల ద్వారా లక్షల్లో విక్రయాలు జరుగుతున్నాయి. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం మర్లకుంట గ్రామానికి మందుబాబులు క్యూ కడుతున్నారు. తిరువూరు బార్‌లో ధర అధికంగా ఉండటంతో 3కిలోమీటర్ల దూరంలో ఉన్న తెలంగాణ గ్రామాలకు  మద్యంప్రియులు తరలిపోతున్నారు. ఏపీలోని వైన్‌షాపుల్లో విశ్రాంత గదులు తీసివేయడంతో తెలంగాణలోని మద్యం దుకాణాలకు వెళ్లి అక్కడే తాగి వస్తున్నారు.కర్నూలు జిల్లా నుంచి తెలంగాణలోని అలంపూర్‌ మండలంలో ఉన్న మద్యం దుకాణాలకు క్యూ కడుతున్నారు. కృష్ణానది నుంచి పుట్టీల్లో తెలంగాణ లిక్కర్‌ను ఆంధ్రాకు తరలించి బెల్టుషాపుల ద్వారా విక్రయిస్తుండడంతో నాగర్‌కర్నూలు జిల్లాలోని కొల్లాపూర్‌, దోమలపెంట, పెంట్లవెల్లిలో గిరాకీ ఏర్పడింది. 


అక్కడ చీప్‌ లిక్కర్‌ ధరకు ఇక్కడ బ్రాండ్‌ 

మందుబాబులకు అలవాటైన మద్యంతోపాటు లైట్‌ బీర్లు సైతం ఏపీలో లభించడంలేదు. వాటి స్థానంలో కొత్త బ్రాండ్లను విక్రయిస్తున్నారు. మరోవైపు వివిధ బ్రాండ్ల ధరలు తెలంగాణతో పోలిస్తే.. క్వార్టర్‌ బాటిల్‌కు రూ.30, ఫుల్‌ బాటిల్‌కు రూ.120 దాకా అధికంగా ధరలు ఉన్నాయి. ఏపీలో చీప్‌ లిక్కర్‌ ధరకే తెలంగాణలో బ్రాండ్‌ మద్యం లభిస్తోంది. దీంతో సరిహద్దులోని వారంతా తెలంగాణ దుకాణాలకు తరలుతున్నారు. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలానికి కనుచూపు మేరలో ఉన్న వాడపల్లి, దామరచర్లలోని రెండు దుకాణాలు, అడవిదేవులపల్లి మండల కేంద్రంలో నెలకు రూ.కోటికి మించి మద్యం వ్యాపారం సాగుతోంది. సరిహద్దుల్లో ఏపీవారు తెలంగాణ నుంచి పెద్దమొత్తంలో మందు కొనుగోలు చేస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఒక వ్యక్తి 2 ఫుల్‌ బాటిళ్లు, 6 క్వార్టర్లకు మించి మద్యం తీసుకెళ్లకుండా, నాన్‌ డ్యూటీ పెయిడ్‌ మద్యం ఏపీలోకి వెళ్లకుండా ప్రత్యేకంగా చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు.  తెలంగాణలోనే సరిహద్దు గ్రామాలే కాకుండా ఏపీతో సరిహద్దు ఉన్న తమిళనాడు గ్రామాలలోని మద్యం షాపులు కూడా ఏపీనుంచి వెళ్లిన మద్యం ప్రియులతో కళకళలాడుతున్నాయి.

Updated Date - 2020-02-22T07:03:46+05:30 IST