‘సాగర్‌’లో ఏరులై పారుతున్న మద్యం

ABN , First Publish Date - 2021-04-08T08:20:20+05:30 IST

నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికలో మద్యం ఏరులై పారుతోంది. ఓటర్లను ఆకట్టుకునేందుకు రాజకీయ పక్షాలు విందు భోజనాలు, మద్యం సిట్టింగ్‌లకు ప్రాధాన్యం ఇస్తున్నాయి.

‘సాగర్‌’లో ఏరులై పారుతున్న మద్యం

  • మార్చిలో రూ.18.23 కోట్ల విక్రయాలు.. 
  • ఏప్రిల్‌లో రెండు రోజుల్లో రూ.2.8 కోట్ల అమ్మకాలు
  • గతేడాది మార్చితో పోలిస్తే రూ.11.64 కోట్లు ఎక్కువ
  • పెరిగిన ప్రీమియం బ్రాండ్ల విక్రయాలు

నల్లగొండ, ఏప్రిల్‌ 7(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికలో మద్యం ఏరులై పారుతోంది. ఓటర్లను ఆకట్టుకునేందుకు రాజకీయ పక్షాలు విందు భోజనాలు, మద్యం సిట్టింగ్‌లకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఆత్మీయ సమ్మేళనాల పేరుతో రాజకీయ పక్షాలు గ్రామాలు, మండల కేంద్రాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ప్రతి గ్రామంలో మూడు ప్రధాన పార్టీల నుంచి ప్రచారంలో పాల్గొంటున్న కనీసం 100 మందికి సాయంత్రం మందు తప్పనిసరి అయింది. కుల పెద్దలు, యువ నేతలకు ప్రత్యేక విందు. నోటిఫికేషన్‌ విడుదలైన మార్చి నెల నుంచి పోలింగ్‌ ఉన్న ఏప్రిల్‌లో అధికార, విపక్షాల నేతలు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు తమకు కేటాయించిన గ్రామాల్లోనే మకాం వేసి స్థానిక నేతలతో కలిసి ఇంటింటికీ తిరిగి ప్రచారం చేస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు రకరకాల ప్రలోభాలకు గురి చేస్తున్నారు. అధికార పార్టీ ఇప్పటికే రెండో దశ ప్రచారం పూర్తి చేయగా.. కాంగ్రెస్‌, బీజేపీ పక్షాలు రెండో దశ ప్రచారంలో ఉన్నాయి. 


సాగర్‌లో ఎన్నికల ప్రచారం ఊపందుకున్న మార్చి 8వ తేదీ నుంచే మద్యం విక్రయాలు విపరీతంగా పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. మార్చి నెలలో నియోజక వర్గంలోని 7 మండలాలు, 2 మునిసిపాలిటీల్లో మద్యాన్ని రికార్డు స్థాయిలో విక్రయించారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా మార్చి నెలలోనే రూ.18.23 కోట్ల మద్యం విక్రయం జరిగింది. దీంట్లో లిక్కర్‌ పెట్టెలు 23,121 కాగా, బీర్లు పెట్టెలు 14,062 ఉన్నాయి. గతేడాది మార్చిలో మద్యం విక్రయాల విలువ రూ.7.87 కోట్లే. అంటే గతేడాదితో పోలిస్తే ఇప్పటికే అదనంగా రూ.11.64 కోట్ల విక్రయాలు జరిగాయి. పెద్దవూర, త్రిపురారం, హాలియా, నాగార్జునసాగర్‌, గుర్రంపోడు, తుమ్మడం షాపుల నుంచే మద్యం విక్రయాలు భారీగా సాగుతున్నాయి. ఏప్రిల్‌ 6వ తేదీ వరకు చూస్తే వరుస సెలవుల వల్ల మద్యం డిపోలు రెండు రోజులే తెరిచి ఉంచారు. ఈ రెండు రోజుల్లోనే నియోజకవర్గంలో 2,557 పెట్టెల లిక్కర్‌, 1572 బీర్ల పెట్టెలు విక్రయం కాగా వాటి విలువ రూ.2.8 కోట్లు. రానున్న వారం రోజుల్లోనే భారీ సభలు, రోడ్‌ షోలు ఉన్నాయి. 17వ తేదీన పోలింగ్‌ జరగనున్న నేపథ్యంలో మద్యం విక్రయాలు మరింతగా పెరుగుతాయన్న అంచనాలున్నాయి. 


బీర్లు, చీప్‌ లిక్కర్‌ వద్దు.. ప్రీమియం లిక్కరే ముద్దు

నియోజకవర్గంలో బీర్లతో పోలిస్తే లిక్కర్‌ సేల్స్‌ ఎక్కువగా జరుగుతున్నాయి. ఒక్క బీరు ఖరీదు రూ.150కి పైగా ఉండటం, దానికి బదులు క్వార్టర్‌ సీసాలు పంపిణీ చేయడం రాజకీయ పార్టీలకు సులభంగా మారిందని వ్యాపారులు చెబుతున్నారు. గత ఏడాది మార్చితో పోలిస్తే ఈ నెలలో లిక్కర్‌ సీసాలు 11,716 పెట్టెలు ఎక్కువగా అమ్మకం కాగా.. బీర్లు 539 పెట్టెలు తగ్గాయి. అదే సమయంలో మద్యం విక్రయాల్లో సాధారణ రోజులతో పోలిస్తే ప్రస్తుతం ప్రీమియం బ్రాండ్లనే సాగర్‌ జనం వినియోగిస్తున్నారు. రూ.1000 దాటిన ఫుల్‌ బాటిల్‌ సిగ్నేచర్‌, బ్లెండర్స్‌ ఫ్రైడ్‌ వంటి ప్రీమియం బ్రాండ్లే ఎక్కువగా సేల్‌ అవుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు.

Updated Date - 2021-04-08T08:20:20+05:30 IST