ఉదయాన్నే మద్య దర్శనం

ABN , First Publish Date - 2021-05-05T09:15:15+05:30 IST

ప్రజలు నిద్ర లేవకముందే రాష్ట్రంలో మద్యం షాపులు తెరుచుకోనున్నాయి. టీ తాగే సమయానికి ముందే మందు అందుబాటులోకి రానుంది

ఉదయాన్నే మద్య దర్శనం

ఆరుగంటలకల్లా సర్కారీ షాపులు

12 గంటల తరువాత మూత


అమరావతి, మే 4 (ఆంధ్రజ్యోతి): ప్రజలు నిద్ర లేవకముందే రాష్ట్రంలో మద్యం షాపులు తెరుచుకోనున్నాయి. టీ తాగే సమయానికి ముందే మందు అందుబాటులోకి రానుంది. గతంలో ఎన్నడూ చూడని విధంగా మొట్టమొదటిసారి ఉదయం 6గంటల నుంచే మద్యం షాపులు తెరవాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు బుధవారం నుంచి కర్ఫ్యూ నిబంధనలు అమల్లోకి వస్తున్నాయి. వాటికి అనుగుణంగా మద్యం అమ్మకాల సమయాల్లోనూ మార్పులు చేసింది. ఉదయం 11 గంటలకు తెరిచి రాత్రి తొమ్మిది గంటలల్లా ప్రస్తుతం సర్కారీ షాపులు మూతపడుతున్నాయి. అయితే, ఇకపై ఉదయం 6 గంటల నుంచే మద్యం షాపులు తెరుచుకొంటాయి. కర్ఫ్యూ నిబంధనల ప్రకారం అన్నింటితోపాటు.. అవీ 12 గంటల తర్వాత బంద్‌ అవుతాయి. ఈ మేరకు ఎక్సైజ్‌ శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. మద్యం సరఫరా చేసే డిపోలు కూడా ఇవే నిబంధనలు పాటించాలని తెలిపింది. గతేడాది కరోనా తీవ్రస్థాయిలో ఉన్న సమయంలో 43 రోజుల పాటు మద్యం అమ్మకాలను పూర్తిగా ఆపేశారు. కానీ ఇప్పుడు అందుకు విరుద్ధంగా ప్రభుత్వం అమ్మకాలకే మొగ్గు చూపింది. ఇదంతా ఆదాయం కోసమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కర్ఫ్యూ అమలుచేస్తే ఒకచోట నలుగురు కంటే గుమికూడకూడదు. అలాంటప్పుడు బార్లకు అనుమతి ఎలా ఇస్తారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇంకోవైపు ఎప్పటిలాగే మద్యం షాపుల వద్ద క్యూలు ఉంటాయు. అలా క్యూలు ఉంటే కరోనా వ్యాప్తి పెరిగిపోతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభుత్వం మాత్రం మద్యం అమ్మకాలను నిలిపివేసేందుకు ఏమాత్రం సుముఖంగా కనిపించడం లేదు.

Updated Date - 2021-05-05T09:15:15+05:30 IST