అలర్ట్‌..!

ABN , First Publish Date - 2020-10-13T08:10:18+05:30 IST

భారీ వర్షాల నేపథ్యంలో బయటకు రావాలంటే ప్రజలు భయపడుతున్నారు. నోరు తెరిచిన నాలాలు, పైపులైన్లు ఎక్కడ

అలర్ట్‌..!

భారీ వర్షాలతో భర భద్రం

 వరద నీరు వెళ్లేందుకు మ్యాన్‌హోళ్ల మూతలు ఓపెన్‌

 ప్రమాదాలు సంభవించే అవకాశాలు 

 మూతలు తెరిచి ఉన్నాయని నాలుగు రోజుల్లో 34 ఫిర్యాదులు

 72 గంటలు అప్రమత్తంగా ఉండండి

 పురాతన భవనాలు, గోడల పక్కన ఉన్న వారిని ఖాళీ చేయించండి

 అధికారులకు లోకే్‌షకుమార్‌ ఆదేశం


నగరజసులారా.. బహుపరాక్‌! ఎడతెరిపి లేని భారీ వర్షాలతో జర భద్రం. నోళ్లు తెరిచిన మ్యాన్‌హోళ్లు, పొంగిపొర్లుతున్న డ్రైనేజీలు, రోడ్లపై భారీ గుంతలతో ప్రమాదాలు పొంచి ఉన్నాయి.  ఇప్పటికే జీహెచ్‌ఎంసీ అప్రమత్తమైంది. ముంపునకు గురయ్యే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించింది. బాధిత ప్రజలను తరలించేందుకు పునరావాస కేంద్రాలను గుర్తించింది. పురాతన, శిథిల భవనాల్లో ఉంటున్న వారిని ఖాళీ చేయించాలని నిర్ణయించింది. మూసీ పరీవాహక ప్రాంత ప్రజలు  అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.


హైదరాబాద్‌ సిటీ, అక్టోబర్‌ 12 (ఆంధ్రజ్యోతి): 

భారీ వర్షాల నేపథ్యంలో బయటకు రావాలంటే ప్రజలు భయపడుతున్నారు. నోరు తెరిచిన నాలాలు, పైపులైన్లు ఎక్కడ ప్రాణాలు బలి తీసుకుంటాయో అని బెంబేలెత్తుతున్నారు. వరద నీరు నిలిచిన చోట.. దానిని పంపిం చేందుకు పలు ప్రాంతాల్లో సివరేజీ మ్యాన్‌హోల్స్‌ మూతలూ తొలగిస్తున్నారు. ఇది అత్యంత ప్రమాదకరం. గుర్తించకపోతే ప్రమాదాలు జరిగే అవకాశముంది. నిలిచిన నీటి అడుగున ఉండే మూతలేని మ్యాన్‌హాల్స్‌ మృత్యు ద్వారాలుగా మారే అవకాశం ఉంది. గతంలోనూ ఈ తరహా ప్రమాదాలు జరిగాయి. జీహెచ్‌ఎంసీ కాల్‌సెంటర్‌కు మ్యాన్‌హోల్‌  మూతలు తెరిచి ఉన్నాయని గత నాలుగు రోజుల్లో 34 ఫిర్యాదులు వచ్చాయి. ప్రజలెవరూ మ్యాన్‌హోల్‌ మూతలు తెరవవద్దని అధికారులు కోరుతున్నారు. 


ఫిర్యాదుల వెల్లువ

వాన కష్టాలపై జీహెచ్‌ఎంసీకి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. శుక్రవారం నుంచి నాలుగు రోజుల్లో 1275 ఫిర్యాదులు వచ్చాయి. డ్రైనేజీ ఓవర్‌ ఫ్లోకు సంబంధించినవే దాదాపు 60 శాతానికిపైగా ఫిర్యాదులున్నాయి. వర్షపు నీరు సివరేజీ పైపులైన్లలో కలుస్తుండడంతో వ్యర్థాలు మేట వేసి మురుగు పొంగిపొర్లుతోంది. వివిధ ప్రాంతాల నుంచి 766 మంది డ్రైనేజీ ఓవర్‌ ఫ్లో అవుతోందని ఫోన్లు, ఫొటోల ద్వారా అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. వరద నీరు  నిలిచిందని 300 మంది, మ్యాన్‌ హోల్‌ కవర్లు తెరిచి ఉన్నాయని 34 మంది ఫిర్యాదు చేశారు. సోమవారం 279 ఫిర్యాదులు రాగా.. ఇందులోనూ 211 డ్రైనేజీ ఓవర్‌ ఫ్లో అవుతోందన్నవే కావడం గమనార్హం. 


అత్యవసర బృందాలు సిద్ధంగా ఉండాలి 

 లోకే్‌షకుమార్‌ ఆదేశం

పురాతన, శిథిల భవనాల్లో ఉంటున్న వారిని ఖాళీ చేయించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ డీఎస్‌ లోకే్‌షకుమార్‌ సోమవారం ఆదేశాలు జారీ చేశారు. రాబోయే 72 గంటలపాటు అధికారులు, మాన్‌సూన్‌, డీఆర్‌ఎఫ్‌ బృందాలు సిద్ధంగా ఉండాలన్నారు. సోమవారం మధ్యాహ్నం నుంచి భారీ వర్షం కురవడంతో ఆయన వెంటనే అధికార యంత్రాంగాన్ని అలర్ట్‌ చేశారు. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో 9 నుంచి 16 సెంటిమీటర్ల వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు.

 భవనాలు, పురాతన ప్రహరీ గోడలు, ఖాళీ స్థలాల పక్కన ఉండే సెల్లార్ల రిటైనింగ్‌ వాల్స్‌పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సెల్లార్ల వద్ద ప్రమాదాలు జరగకుండా ఇసుక సంచులు, రిటైనింగ్‌  వాల్‌, బారీకేడ్లు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. కంట్రోల్‌ రూమ్‌, కాల్‌ సెంటర్‌, ఇతర మార్గాల్లో వచ్చిన ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని సర్క్యులర్‌ జారీ చేశారు. ముంపు ముప్పు పెరిగితే బాధిత ప్రజలను తరలించేందుకు పునరావాస కేంద్రాలుగా గుర్తించిన పాఠశాలలు, కమ్యూనిటీ హాళ్లలో అవసరమైన వసతులు కల్పించాలని జోనల్‌, డిప్యూటీ మునిసిపల్‌ కమిషనర్లకు సూచించారు. 


Updated Date - 2020-10-13T08:10:18+05:30 IST