యువతా జాగ్రత్త!

ABN , First Publish Date - 2020-04-08T09:08:30+05:30 IST

కరోనా ప్రభావం వృద్ధులు, చిన్నారులపైనే ఎక్కువ.. మనకేం కాదు అనుకునే యువతకు హెచ్చరిక. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కేసులను చూస్తే యువతే ఎక్కువగా కరోనా బారిన...

యువతా జాగ్రత్త!

  • కరోనా బారిన పడిన వారిలో వీరే అత్యధికులు
  • 396 కేసుల్లో 169 మంది 20-40 ఏళ్లవారే
  • 40 ఏళ్లు పైబడినవారు184 మంది
  • పాజిటివ్‌ల్లో మహిళల కంటే పురుషులే ఎక్కువ
  • నమోదైన కేసులు చెబుతున్నదిదే..
  • పురుషులు (80.56 శాతం)   319,  మహిళలు  (19.44 శాతం) 77

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి): కరోనా ప్రభావం వృద్ధులు, చిన్నారులపైనే ఎక్కువ.. మనకేం కాదు అనుకునే యువతకు హెచ్చరిక. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కేసులను చూస్తే యువతే ఎక్కువగా కరోనా బారిన పడుతోంది. రాష్ట్రంలో మంగళవారం వరకు  404 కేసులు నమోదవ్వగా అందులో 396 కేసుల వివరాలను పరిశీలిస్తే 20-40 ఏళ్ల మధ్యవయసు వారిలోనే ఎక్కువ మంది ఈ మహమ్మారి బారినపడ్డట్లు తాజా లెక్కలు చెబుతున్నాయి. ఆ వయసు వారిలో 169 మందికి కరోనా సోకింది. మొత్తం కేసుల్లో ఇది  సుమారు 42 శాతం కావడం విశేషం. ఇక పదేళ్ల లోపు చిన్నారులు 12 మంది ఉండగా, 20 ఏళ్లలోపు వారు 31 మందిఉన్నారు. 40 నుంచి 60 ఏళ్ల వారిలో 125 మంది, 60 పైబడ్డ వారిలో 59 మందికి వైరస్‌ సోకింది.  మరోవైపు మహిళల కంటే పురుషులే ఎక్కువ మంది కరోనా బారిన పడుతున్నారు. మంగళవారం నాటికి నమోదైన కేసులను పరిశీలిస్తే అందులో 77 మంది మహిళలుండగా, 319 మంది పురుషులున్నారు.   ఇప్పటివరకు నమోదైన కేసుల్లో అత్యధికంగా హైదరాబాద్‌ లో 155, నిజమాబాద్‌ 36, గద్వాలలో 22, వరంగల్‌ అర్బన్‌లో 23, ఆదిలాబాద్‌లో 11, మేడ్చల్‌లో 15, నల్గొండలో 13, రంగారెడ్డిలో 10 మిగిలిన జిల్లాల్లో పదిలోపు కేసులు నమోదయ్యాయి.  రాష్ట్రంలో తొలి కరోనా కేసు నమోదైన మార్చి 2 నుంచి ఏప్రిల్‌ 7 నాటికి నమోదైన కరోనా కేసులను పరిశీలిస్తే...ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగు చూశాయి. మార్చి 14 నుంచి వరుసగా రోజుకు ఒకటి చొప్పున మాత్రమే కేసులు వచ్చాయి. మార్చి 18న కరీంనగర్‌ వచ్చిన ఇండోనేసియా బృందంలో 8 మందికి కరోనా పాజిటివ్‌ సోకింది. ఆ తరువాత నుంచి రెండుకు తగ్గకుండా మార్చి 31 వరకు కేసులు నమోదు అయ్యాయి. మార్చి 27న 14 కేసులు, మార్చి 31న 15 కేసులు నమోదు అయ్యాయి. ఇక ఏప్రిల్‌ 1 నుంచి 7 వరకు కేవలం వారం రోజుల్లో మొత్తం 309 కేసులు నమోదు అయ్యాయి. రోజుకు సగటున 44 కేసుల చొప్పున నమోదయ్యాయి.


23 రోజుల పసికందుకు కరోనా!

మర్కజ్‌ వెళ్లొచ్చిన తండ్రి ద్వారా సంక్రమణ

మహబూబ్‌నగర్‌ పట్టణంలో 23 రోజుల పసికందుకు కరోనా సోకింది. తండ్రి మర్కజ్‌కు వెళ్ళిరావడంతో అతని ద్వారా ఈ మగ శిశువుకు వైరస్‌ సోకింది. ఆయన ట్యూషన్‌ చెప్పే పిల్లల తల్లిదండ్రులిద్దరికి కూడా మంగళవారం పాజిటివ్‌ వచ్చింది.


వయసుల వారీగా కేసులు 

వయసు మంది శాతం

10 లోపు 12 3.03

10-20 31 7.82

20-40 169 42.67

40-60 125 31.56

60 ఏళ్లపైన 59 14.89

మొత్తం 396




Updated Date - 2020-04-08T09:08:30+05:30 IST