కరోనాపై అప్రమత్తం

ABN , First Publish Date - 2021-02-25T04:30:21+05:30 IST

జిల్లాలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. లాక్‌డౌన్‌ ఆంక్షలు తొలగించడంతో జనం జాగ్రత్తలు విస్మరించారు.

కరోనాపై అప్రమత్తం
కామారెడ్డి జిల్లాలోని మద్నూర్‌ అంతరాష్ట్ర చెక్‌పోస్టు వద్ద కరోనా పరీక్షలు చేస్తున్న దృశ్యం

- జిల్లాలో మళ్లీ పంజా విసురుతున్న మహమ్మారి కరోనా
- పొరుగు రాష్ట్రాల నుంచి విస్తరిస్తున్న కరోనా వైరస్‌
- జిల్లాలోనూ పెరుగుతున్న కరోనా కేసులు
- పక్క రాష్ట్రాల నుంచి వచ్చే వారిపై నిఘా పెట్టిన యంత్రాంగం
- జిల్లా సరిహద్దులో అంతరాష్ట్ర చెక్‌పోస్టుల వద్ద పరీక్షలు
- జిల్లాలో 13వేలకు పైగా కరోనా కేసులు
- కొనసాగుతున్న వ్యాక్సినేషన్‌
- మార్చి 1 నుంచి వృద్ధులకు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ఇవ్వనున్న వ్యాక్సిన్‌

కామారెడ్డి, ఫిబ్రవరి 24(ఆంధ్రజ్యోతి):
జిల్లాలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. లాక్‌డౌన్‌ ఆంక్షలు తొలగించడంతో జనం జాగ్రత్తలు విస్మరించారు. పొరుగున ఉన్న మహారాష్ట్రలో కరోనా పాజిటివ్‌ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. ఈ ప్రభావం ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాపై పడుతోంది. మరోసారి కరోనా పంజా విసురుతోంది. ఇరు జిల్లాలో కేసులు నమోదవుతున్నాయి. ముంబాయితో పాటు మహారాష్ట్రలోని ఇతర జిల్లాలతో ఉమ్మడి  నిజామాబాద్‌ జిల్లా వాసులకు సత్ససంబంధాలు అధికంగా ఉన్నాయి. వారి రాకపోకలతో కరోనా వైరస్‌ ముప్పు పొంచి ఉండడంతో జిల్లా ప్రజల్లో ఆందోళన నెలకొంటుంది. ఈ నేపథ్యంలో ఇరు జిల్లాలకు చెందిన యంత్రాంగం అప్రమత్తం అవుతోంది. జిల్లాలోని అంతరాష్ట్ర చెక్‌పోస్టుల వద్ద కరోనా పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసి పరీక్షలు చేయడంతో పాటు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ప్రజలు సైతం అప్రమత్తంగా ఉండాలని కనీస జాగ్రత్తలు పాటించాలంటూ వైద్యులు సూచిస్తున్నారు.
జిల్లా సరిహద్దులో చెక్‌పోస్టుల ఏర్పాటు
నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాలకు పొరుగు రాష్ట్రాలుగా మహారాష్ట్ర, కర్ణాటకలు ఉన్నాయి. అయితే మహారాష్ట్రలో ఇటీవల కాలంలో కరోనా వైరస్‌ విజృంభించడం, పాజిటివ్‌ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. ఈ రాష్ట్రం నుంచి ఉమ్మడి జిల్లాలకు రాకపోకలు వేగంగా సాగుతున్నాయి. రైలు, బస్సులు, కార్ల ద్వారా రాకపోకలు పెరుగుతున్నాయి. దీంతో కరోనా ముప్పు పొంచి ఉందనే ఆందోళనతో ఇరు జిల్లాల అధికారులు అప్రమత్తమై జిల్లా సరిహద్దులో చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. కామారెడ్డి జిల్లాలోని మద్నూర్‌ మండలం సలాబత్‌పూర్‌ వద్ద మహారాష్ట్ర నుంచి వ చ్చి పోయే వారికి కరోనా పరీక్షలు చేసేందుకు చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. ప్రతీ వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు. అదేవిధంగా నిజామాబాద్‌ జిల్లాలోని బోధన్‌లోని సాలూర చెక్‌పోస్టు వద్ద తనిఖీలు చేపడుతున్నారు. పొరుగు రాష్ట్రం నుంచి రాకపోకలు ఎక్కువగా ఉండడంతో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం తప్పనిసరి అని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలు సేఫ్‌జోన్‌లోనే ఉన్నాయి. భవిష్యత్‌పైనే బెంగపెట్టుకుంటున్నారు. జిల్లాలకు గల్ఫ్‌ నుంచి వచ్చేవారు, విదేశాల నుంచి వచ్చే వారి సంఖ్య కూడా అధికంగానే ఉంటోంది.
ఉమ్మడి జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు
ఉమ్మడి జిల్లాలో గత రెండు రోజుల నుంచి కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తున్నాయి. గత 6 నెలల నుంచి కరోనా పాజిటివ్‌ కేసులు ఉమ్మడి జిల్లాలో 5 లోపే నమోదవుతూ వచ్చాయి. దీంతో ఇరు జిల్లాల ప్రజలు సైతం కరోనాపై భయాన్ని వీడి జాగ్రత్తలు పాటించకుండా ఉంటున్నారు. గత రెండు రోజుల నుంచి ఇరుజిల్లాలోని పదికిపైగానే కేసులు నమోదయ్యాయి. నిజామాబాద్‌ జిల్లాలో గడిచిన 24 గంటల్లో 13 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. జిల్లాలో ఇప్పటి వరకు 15,963 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో 15,255 మంది కరోనా నుంచి కొలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం 548 మంది కరోనా వైరస్‌ వల్ల చికిత్స పొందుతున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు కరోనాతో 160 మంది మృతి చెందారు. కామారెడ్డిలో 9 కేసులు నమోదు కాగా జిల్లాలో ఇప్పటి వరకు 13,636 కేసులు నమోదయ్యాయి. 12,936 మంది కరోనా నుంచి కొలుకొని డిశ్చార్జి అయ్యారు. మరో 650 మంది కరోనాతో చికిత్స పొందుతున్నారు. 50 మంది కరోనా భారిన పడి మృతి చెందారు.
కొనసాగుతున్న వ్యాక్సినేషన్‌
ఉమ్మడి జిల్లాలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతోంది. గత నెలరోజుల నుంచి కరోనా వైరస్‌ ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు వ్యాక్సిన్‌ ఇస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌గా గుర్తించబడిన 11,609 మంది రిజిష్టర్‌ చేసుకోగా 6,288 మంది మాత్రమే కొవిషీల్డ్‌ టీకా వేసుకున్నారు. వైద్య విభాగంలో ప్రభుత్వ సిబ్బంది 4,366 మంది రిజిష్టర్‌ చేసుకోగా 3,227, ప్రైవేట్‌ సిబ్బంది 862 మంది రిజిష్టర్‌ చేసుకోగా 610 మంది వ్యాక్సిన్‌ వేసుకున్నారు. ఇక రెవెన్యూ, పోలీసు, మున్సిపల్‌, పంచాయతీరాజ్‌ సిబ్బంది 6,381 మంది రిజిష్టర్‌ చేసుకోగా 6,017 మంది మాత్రమే టీకా వేసుకున్నారు. అంటే మొత్తం ఈ నాలుగు విభాగాలలో కలిపి 54.16 శాతం మాత్రమే టీకా వేయించుకున్నారు. వచ్చే నెల 1 నుంచి కరోనా వ్యాక్సిన్‌ వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 60 ఏళ్ల వయస్సు పైబడిన వారు అదేవిధంగా ఒకటి కన్న ఎక్కువ వ్యాధులతో బాధపడుతున్న 45 ఏళ్ల వయస్సు పైబడిన వారు వ్యాక్సినేషన్‌కు అర్హులు. ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రైవేట్‌ ఆసుపత్రులలో కూడా వ్యాక్సినేషన్‌ ఇచ్చేందుకు కేంద్రం ఏర్పాట్లు చేస్తోంది. ప్రభుత్వ వ్యాక్సిన్‌ కేంద్రాలలో కొవిడ్‌ ఉచితంగానే లభించనుందని ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో వ్యాక్సినేషన్‌ చేయించుకునేవారు డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని కేంద్రప్రభుత్వం ప్రకటించింది.

Updated Date - 2021-02-25T04:30:21+05:30 IST