క్వారంటైన్‌ సెంటర్‌లో ఉన్న వారికి అన్ని వసతులు

ABN , First Publish Date - 2020-04-08T09:59:58+05:30 IST

క్వారంటైన్‌ సెంటర్లలో ఉన్న వారికి అన్ని వసతులు కల్పిస్తామని మంత్రి పేర్ని నాని అన్నారు. పెడన పల్లోటి స్కూల్‌లో

క్వారంటైన్‌ సెంటర్‌లో ఉన్న వారికి అన్ని వసతులు

 పెడన సెంటర్‌ను పరిశీలించిన మంత్రి పేర్ని నాని


మచిలీపట్నం, పెడన, ఏప్రిల్‌ 7: క్వారంటైన్‌ సెంటర్లలో ఉన్న వారికి అన్ని వసతులు కల్పిస్తామని మంత్రి పేర్ని నాని అన్నారు. పెడన పల్లోటి స్కూల్‌లో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ సెంటర్‌ను ఆయన మంగళవారం   పరిశీలించారు. సోమవారం సరఫరా చేసిన భోజనం బాగోలేదని క్వారంటైన్‌ సెంటర్‌లో ఉంటున్న వారు చెప్పారని,  మంచి భోజనాన్ని పెట్టించే ఏర్పాట్లు చేశామన్నారు. తాగునీటికి ఇబ్బంది లేకుండా దాతల సహకారం తీసుకుంటున్నామన్నారు. ముఖ్యమంత్రి   జగన్‌ ఆదేశాల మేరకు సేవల్లో లోటు లేకుండా చూస్తున్నామన్నారు.


ఎక్కడైనా చిన్న లోపం జరిగితే రాజకీయం చేస్తున్నారని, అది మంచిది కాదన్నారు. పాజిటివ్‌ రిపోర్టు వచ్చిన వారిని విజయవాడ తరలిస్తామని, నెగిటివ్‌ రిపోర్టు వస్తే ఇంటికి పంపి గదికే పరిమితం కావాలంటు న్నామన్నారు. ప్రతి ఒక్కరూ ధైర్యంగా ఉండాలని కోరారు. దాతల సహకారంతో క్వారంటైన్‌ పరిసరాల్లో పారిశుధ్య చర్యలు నిర్వహించాలని  కమిషనర్‌ అబ్దుల్‌ రషీద్‌ను ఆదేశించారు. క్వారంటైన్‌ ప్రత్యేక అధికారి, హౌసింగ్‌ పీడీ ధనుంజయుడు, తహసీల్దార్‌ మధుసూధనరావు, చేనేత జౌళి శాఖ ఏడీ రఘునందనరావు, ఆర్డీవో ఖాజావలి ఉన్నారు.


రెడ్‌జోన్‌లో మంత్రి పేర్ని నాని పర్యటన

రెడ్‌జోన్‌ ప్రాంతంలో పూర్తి స్థాయి పారిశుధ్యం నిర్వహించాలని మంత్రి పేర్ని నాని అన్నారు.  మచిలీపట్నంలోని రెడ్‌జోన్‌  ప్రాంతాల్లో మంగళవారం ఆయన పర్యటించి ప్రజలకు పాలు, కూరగాయలు ప్రత్యేక వాహనాల ద్వారా ఇంటింటికీ అందుతున్నాయా లేదా పరిశీలించారు. వలంటీర్లు, ఆశ వర్కర్లు, ఏఎన్‌ఎంలు సర్వే చేయాలని, ఎవరికైనా అనారోగ్యం ఉంటే అక్కడే మందు బిళ్లలు ఇవ్వాలని, ఆందోళనకరంగా ఉంటే ఆసుపత్రికి తరలించాలన్నారు. ప్రతి గంటకు పరిస్థితులు సమీక్షిస్తామన్నారు.  

Updated Date - 2020-04-08T09:59:58+05:30 IST