గోఎయిర్‌ మినహా.. విమానాల టికెట్‌ బుకింగ్‌లు ప్రారంభం

ABN , First Publish Date - 2020-05-23T08:08:42+05:30 IST

విమానయాన సంస్థలు ఈ నెల 25 నుంచి సేవలను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాయి. ఒక్క గోఎయిర్‌ మినహా.. మిగతా సంస్థలు ఆన్‌లైన్‌ టికెట్‌ బుకింగ్‌ను ప్రారంభించాయి. గోఎయిర్‌ వెబ్‌సైట్‌లో మాత్రం.. జూన్‌ 1 నుంచి టికెట్లు...

గోఎయిర్‌ మినహా.. విమానాల టికెట్‌ బుకింగ్‌లు ప్రారంభం

  • సేవల పునరుద్ధరణకు సిద్ధమైన సంస్థలు
  • 24 గంటలకోసారి ఫ్లైటంతా శానిటైజేషన్‌

న్యూఢిల్లీ, మే 22: విమానయాన సంస్థలు ఈ నెల 25 నుంచి సేవలను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాయి. ఒక్క గోఎయిర్‌ మినహా.. మిగతా సంస్థలు ఆన్‌లైన్‌ టికెట్‌ బుకింగ్‌ను ప్రారంభించాయి. గోఎయిర్‌ వెబ్‌సైట్‌లో మాత్రం.. జూన్‌ 1 నుంచి టికెట్లు అందుబాటులోకి వస్తాయి. కరోనా నేపథ్యంలో ప్రతి 24 గంటలకోసారి తమ విమానాలను పూర్తిస్థాయిలో శానిటైజ్‌ చేస్తామని అన్ని విమానయాన సంస్థలు తెలిపాయి. పైలట్లు, విమానంలోని ఇతర ఉద్యోగులు, క్షేత్ర స్థాయి సిబ్బంది పూర్తిస్థాయిలో పీపీఈ కిట్లు ధరించి సేవలందిస్తారని తెలిపాయి.


విమానంలో ప్రయాణికులు ముట్టుకునే అవకాశం ఉన్న అన్ని ప్రదేశాలను శానిటైజ్‌ చేస్తామని విస్తారా విమానయాన సంస్థ వెల్లడించింది. ప్రస్తుతానికి 24 నగరాలకు తమ సేవలను అందిస్తామని పేర్కొంది. బడ్జెట్‌ క్యారియర్‌గా పేరొందిన ఇండిగో కూడా ఇలాంటి చర్యలనే చేపట్టింది. ప్రతి ప్రయాణికుడికి సేఫ్టీ కిట్లను ఇస్తామని అందులో సర్జికల్‌ మాస్కు, శానిటైజర్‌ ఉంటాయని ఆ సంస్థ సీఈవో రంజన్‌ దత్తావివరించారు. తమ విమానాల్లో వైద్య సదుపాయాలను అందుబాటులో పెడుతున్నట్లు ఎయిర్‌ ఏషియా తెలిపింది. 


14 రోజుల క్వారంటైన్‌

కేరళ ప్రభుత్వం కూడా అసోం బాటలో నడుస్తోంది. డొమెస్టిక్‌ విమానాల్లో తమ రాష్ట్రానికి వచ్చే ప్రయాణికులకు 14 రోజులు క్వారంటైన్‌ తప్పనిసరని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కేకే శైలజ వెల్లడించారు. తమ రాష్ట్రంలో కరోనా కట్టడిలో ఉందని, ఈ పరిస్థితుల్లో ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారి ద్వారా ముప్పు పొంచి ఉందన్నారు. కాగా.. కర్ణాటక కూడా జూన్‌ 1 నుంచి విమాన, రైలు ప్రయాణికులకు సెల్ఫ్‌ క్వారంటైన్‌ నిబంధనను విధించింది.


Updated Date - 2020-05-23T08:08:42+05:30 IST