న్యాయం ముందు అందరూ సమానులే

ABN , First Publish Date - 2021-10-20T04:38:37+05:30 IST

న్యాయం ముందు అందరూ సమానులేనని, నిరుపేదలకు ఉచితంగా న్యాయ సహాయం, సేవలు అందించడమే న్యాయ సేవాధికార సంస్థ ధ్యేయమని రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ మెంబర్‌ సెక్రటరి వై.రేణుక అన్నారు.

న్యాయం ముందు  అందరూ సమానులే
టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి రేణుక

 రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రేణుక


సంగారెడ్డిక్రైం, అక్టోబరు 19: న్యాయం ముందు అందరూ సమానులేనని, నిరుపేదలకు ఉచితంగా న్యాయ సహాయం, సేవలు అందించడమే న్యాయ సేవాధికార సంస్థ ధ్యేయమని రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ మెంబర్‌ సెక్రటరి వై.రేణుక అన్నారు. సంగారెడ్డిలోని జిల్లా జడ్జి క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా న్యాయ సేవాధికారులు, జడ్పీ సీఈవో, డీఆర్‌డీవో, డీపీవో, డీఎల్‌పీవోలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, ఇతర జిల్లా అధికారులతో, ఉమ్మడి మెదక్‌ జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.పాపిరెడ్డితో కలిసి ఆమె మంగళవారం టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా రేణుక మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికీ న్యాయచట్టాలు, హక్కులపై అవగాహన ఉండాలన్నారు. ఆర్థిక స్థోమత లేని నిరుపేదలకు ఉచిత న్యాయ సహాయం అందించడానికి జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఉన్నదన్న విషయాన్ని, అది అందిస్తున్న న్యాయ సేవల గురించి జిల్లాలోని ప్రతి ఒక్కరికీ తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రజలకు న్యాయసేవాధికార సంస్థ చేస్తున్న సేవల గురించి తెలియజేయడానికి ఈనెల 2నుంచి నవంబరు 14 వరకు ‘‘ఆజాదీ కా అమృత్‌’’ మహోత్సవంలో భాగంగా ప్రచారోద్యమం చేపట్టినట్లు పేర్కొన్నారు. అనంతరం ఉమ్మడి మెదక్‌ జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.పాపిరెడ్డి మాట్లాడుతూ అక్టోబరు 2 నుంచి పెద్దఎత్తున ప్రచారం నిర్వహిస్తూ అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. ఉచిత న్యాయ సహాయం పొందడం ఎలా అన్న దానిపై రూపొందించిన కరపత్రాలను ఇంటింటికీ చేరే విధంగా ప్రజాప్రతినిధులు కృషి చేయాలని కోరారు. టెలీకాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ హన్మంతరావు ఎస్పీ ఎం.రమణకుమార్‌, స్పెషల్‌ ఎక్సైజ్‌ మెజిస్ర్టేట్‌ హన్మంతరావు, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి సీహెచ్‌. ఆశాలత, జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌ రాజర్షిషా, పలువురు పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-20T04:38:37+05:30 IST