తూత్తుకూడి కస్టోడియల్ మరణాల కేసుపై ఐక్య రాజ్య సమితి స్పందన

ABN , First Publish Date - 2020-07-12T16:43:15+05:30 IST

పోలీసు కస్టడీలో అమానుషంగా హింసించడం వల్ల తండ్రీకొడుకులు మరణించినట్లు

తూత్తుకూడి కస్టోడియల్ మరణాల కేసుపై ఐక్య రాజ్య సమితి స్పందన

న్యూయార్క్ : పోలీసు కస్టడీలో అమానుషంగా హింసించడం వల్ల తండ్రీకొడుకులు మరణించినట్లు నమోదైన కేసు దేశవ్యాప్తంగా ప్రజలను తీవ్రంగా కలచివేసిన సంగతి తెలిసిందే. ఈ అమానవీయ సంఘటనపై ఐక్య రాజ్య సమితి (ఐరాస) కూడా స్పందించింది. ఈ కేసులోని ప్రతి మరణంపైనా సంపూర్ణంగా దర్యాప్తు జరిపించవలసిన అవసరం ఉందని ఐరాస సెక్రటరీ జనరల్‌కు అధికార ప్రతినిథి స్టెఫానే డుజరిక్ అన్నారు. 


ఐరాస వారానికోసారి నిర్వహించే మీడియా సమావేశంలో శనివారం డుజరిక్ మాట్లాడారు. తమిళనాడులోని సతంకుళం పోలీస్ స్టేషన్‌లో పోలీసు కస్టడీలో చిత్రహింసలకు గురైన తండ్రీకొడుకులు మరణించిన సంఘటనపై విలేకర్ల ప్రశ్నలకు స్పందించారు. 


‘‘ఈ కేసులన్నిటిలోనూ, సూత్రప్రాయంగా, సంపూర్ణ దర్యాప్తు జరగవలసిన అవసరం ఉందనుకుంటున్నాను’’ అని డుజరిక్ పేర్కొన్నారు. 


కోవిడ్-19 నిబంధనలను ఉల్లంఘించారంటూ...

జయరాజ్ (59) సతంకుళం మెయిన్ బజార్ ఏరియాలో ఓ దుకాణం నడుపుతున్నారు. ఆయన ఆ దుకాణాన్ని జూన్ 19న కోవిడ్-19 నిబంధనలను ఉల్లంఘించారంటూ పోలీసులు పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్ళారు. ఆ విషయం తెలుసుకున్న ఆయన కుమారుడు జే బెనిక్స్ (31) పోలీస్ స్టేషన్‌కు వెళ్ళి, తన తండ్రి గురించి అడిగారు. దీంతో ఇద్దర్నీ కోవిల్‌పత్తి సబ్ జైలులో ఉంచారు. వారిని కస్టడీలో తీవ్రంగా హింసించారని ఆరోపణలు వచ్చాయి. గాయపడిన తండ్రీకొడుకులను ఓ ఆసుపత్రిలో చేర్పించారని, వీరిద్దరూ ఆసుపత్రిలో ప్రాణాలు కోల్పోయారని కేసు నమోదైంది. 


దేశవ్యాప్తంగా ఈ కేసుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. మొదట్లో దీనిపై సీబీసీఐడీ దర్యాప్తు చేపట్టింది. ఆ తర్వాత దీనిని కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి అప్పగించారు.


ఈ కేసుతో సంబంధం ఉందనే ఆరోపణలపై జూలై 4న ఐదుగురు పోలీసు సిబ్బందిని ట్యూటికోరిన్ జైలు నుంచి మధురై సెంట్రల్ జైలుకు బదిలీ చేశారు. 


Updated Date - 2020-07-12T16:43:15+05:30 IST