అన్ని వర్గాలనూ ఆదుకోవాలి

ABN , First Publish Date - 2020-03-26T09:03:05+05:30 IST

ప్రపంచంలో కరోనా వైరస్‌ సృష్టించిన అలల తాకిడి, ప్రపంచ వ్యాప్తంగా అన్ని వర్గాలను తాకి వారి జీవితాలను దుర్లభం చేస్తుంది. అన్ని ప్రకృతి భీభత్సాల్లాగానే కరోనా ఉపద్రవం కొన్ని వర్గాల ప్రజా సమూహాలను నిశబ్దంగా

అన్ని వర్గాలనూ ఆదుకోవాలి

ప్రపంచంలో కరోనా వైరస్‌ సృష్టించిన అలల తాకిడి, ప్రపంచ వ్యాప్తంగా అన్ని వర్గాలను తాకి వారి జీవితాలను దుర్లభం చేస్తుంది. అన్ని ప్రకృతి భీభత్సాల్లాగానే కరోనా ఉపద్రవం కొన్ని వర్గాల ప్రజా సమూహాలను నిశబ్దంగా కౌగలించుకొంది. ఆ కౌగిలింతలో ఆ వర్గాలు విలవిల లాడుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విపత్తు సమయంలో పేదలను ఆదుకోవడానికి బడ్జెట్‌ కేటాయించి, పథకాలు ప్రకటించాయి. ఇది చాలా అత్యవసరంగా చేయవలసిన పని అయితే, సమాజంలో బాధితులను గుర్తించడం, వారికి సహాయం అందేలా చర్యలు చేపట్టడం కూడా చాల పెద్ద ఛాలెంజ్‌. ప్రభుత్వాల దగ్గర, ఇటువంటి సందర్భంలో నష్టపోయే సమూహాల వివరాలు, సమాచారం ఉన్పప్పటికీ, ఇంకా వెలుగులోకి రానటువంటి మానవ సమూహాలు చాలానే ఉన్నాయి. వాటిని గుర్తించి ఆదుకోవడానికి ప్రభుత్వాలకు సంకల్పం, ఆచరణ సిద్ధి ఉండాలి. ఈ విషయంలో ఢిల్లీ కేంద్రంగా పని చేస్తున్న ‘వర్కర్స్‌ పీపుల్‌ భారత్‌’ సంస్థ ఒక వివరమైన నివేదిక తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి అందజేసింది.


దేశంలో 50 కోట్ల మంది అసంఘటిత రంగంలో పని చేస్తున్న కార్మికులున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో వీరి సంఖ్య దాదాపు 2 కోట్ల వరకు ఉంటుంది. తెలంగాణలో అసంఘటిత రంగ కార్మికుల్లో దాదాపు 30 లక్షల దాకా భవన నిర్మాణ కార్మికులున్నారు. ప్రస్తుతం వీరందరికీ పని దొరికే పరిస్థితి లేదు. కొందరు ఇదివరకే గ్రామాలకు వెళ్ళారు. రవాణా వ్యవస్థ స్తంభించడంతో సొంతూళ్లకు వెళ్లలేని వారు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. జంట నగరాలైన హైదరాబాద్‌ సికింద్రాబాద్‌లలో 92 లేబర్‌ అడ్డాలున్నాయి. అడ్డా మీద కూర్చుండే వంద మంది కూలీలలో పదిమందికి మాత్రమే పని దొరుకుతుంది. మధ్యాహ్నం వరకు పని కోసం చూసి తక్కినవారు ఇండ్లకు వెళ్ళిపోతున్నారు. పదిహేను రోజులుగా పనిసరిగా లేకపోవడంలో నిత్యావసర వస్తువులు కొనుక్కోవడం, బస్తీలలో ఇంటి కిరాయి కట్టడం ఇబ్బందిగా ఉందని వాళ్ళు చెప్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం అయిదు రూపాయిలకే భోజనం పెట్టే కేంద్రాలు పెంచి లేబర్‌ అడ్డాలు సమీపంలో ఏర్పరిస్తే వారికి కనీసం భోజనం అందుబాటులో ఉంటుంది.


నగరాల్లో పేదలు చాలా మంది రాత్రి పూట ఫుట్‌పాత్‌లపై రైల్వే స్టేషన్ చుట్టు పక్కల, బస్‌స్టాండ్‌లలో, షాపుల ముందు పడుకుంటారు. ఇప్పుడు పోలీసులు ఎవ్వరిని బహిరంగ ప్రదేశాల్లో పడుకోనివ్వడం లేదు. దానితో వీరంతా రైల్వేట్రాక్‌ పక్కన బోగీలున్న చోట, అక్కడక్కడ చెట్ల పొదల్లోకి వెళ్ళి పడుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్న నైట్‌ షెల్టర్‌లలోకి, వైద్య పరీక్షలు జరిపిన తర్వాతనే అనుమతిస్తామని నిర్వాహకులు అంటున్నారు. ఇప్పటికే హైదరాబాద్‌లో ఉన్న 12 షెల్టర్లు, జిల్లాలలో ఉన్న ఒకటి, రెండు కేంద్రాలు నిండిపోయి ఉన్నాయి. అందుకని మరిన్ని కేంద్రాలు ఏర్పాటు చేయాలి. 


అసంఘటిత రంగంలో ఉన్న ఇంకొక వర్గం గృహ కార్మికులు. వీరిలో 99% స్త్రీలే. తెలంగాణలో దాదాపు 8లక్షల వరకు గృహ కార్మికులు ఉంటే, హైదరాబాద్‌లో వారి సంఖ్య దాదాపు 2 లక్షలు. కనీసం నాలుగు ఇండ్లలో పనిచేస్తున్న వారు ఎక్కువ ‘రిస్క్‌’కు గురయ్యే ప్రమాదముంది. వీరంతా ప్రభుత్వ ఆసుపత్రులను ఆశ్రయించేవారే. చాలా ఆసుపత్రుల్లో ఓపీ నిలిపేశారు. అందుకని, అన్ని ఆసుపత్రులలో ఓపీని అనుమతించడం, బస్తీ దవాఖానలు, అర్బన్‌హెల్త్‌ సెంటర్లు, ఏరియా హస్పిటల్‌ వ్యవస్థలను మెరుగు పరచాలి. కార్పొరేట్‌, ప్రయివేట్‌ ఆసుపత్రుల్లోనూ పేదలకు కొంత సమయం, ఉచితంగా ఓపీ వసతి కల్పించమని ప్రభుత్వం కచ్చితమైన ఆదేశాలు ఇవ్వాలి. 

ఇదే మాదిరిగా తెలంగాణలోని వీధి వ్యాపారుల్లో 24,800 మంది జంట నగరాల్లోని ఉన్నారని ప్రభుత్వ సంస్థ ‘మెప్మా’ తెలిపింది. షట్‌డౌన్‌తో వీరి వ్యాపారం చేయలేకున్నారు. వారాంతపు సంతలూ నడవడం కష్టంగా ఉంది. 


హైదరాబాద్‌లో పాటు రాష్ట్రంలోని పెద్ద పట్టణాలకు ఉపాధి కోసం కార్మికులు వలస వస్తుంటారు. వారికి ఆధార్‌ కార్డు గానీ, రేషన్‌ బియ్యం గాని లభించవు. తెల్ల కార్డు లబ్ధిదారుల నుంచి రేషన్‌ బియ్యాన్ని వారు ఎక్కువ ధర చెల్లించి కొంటారు. గ్రామాలు, నగరాల బయట, బట్టీల దగ్గరే నివసిస్తుంటారు. వారి ఆరోగ్యాన్ని పట్టించుకునే వ్యవస్థ గాని, సంక్షేమాన్ని చూసే వ్యవస్థలు గాని లేవు. ఇప్పటి అత్యవసర పరిస్థితిలో ఈ సమూహానికి ఎట్లా ఉపాధి కల్పించాలో ఆలోచించాలి. దాదాపు 15వేల మంది కార్మికులు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికుల షీట్‌ మెటల్‌, ఫర్నేసుల్లో చేస్తుంటారు. వీళ్ళు ఏ కార్మిక సంఘంలో సభ్యులు కారు. వారి సమస్యలు కూడా పట్టించుకోవలసి ఉంది. ట్రాన్స్‌జెండర్లలో కొందరు భిక్షాటన చేస్తారు. తమ గురించి ఎవ్వరూ పట్టించుకోవడం లేదని ఒకరు నాతో అన్నారు. వాళ్ళకు ఉపాధి కల్పించడం, ఆహారం గాని, ఆహార వస్తువులు గాని అందచేసే ప్రయత్నం చేయాలి.


కొన్ని స్వచ్ఛంద సంస్థలు, ట్రస్టులు సానిటైజర్‌ సీసాలను, మాస్క్‌లు సరఫరా చేస్తున్నాయి. కొన్ని సంస్థలు ఆహారాన్ని అందిస్తున్నాయి. అయితే, ఇవి సరిపోవు మరెన్నో సంస్థలు, వ్యక్తులు ముందుకు రావలసి ఉంది. ఇంత పెద్ద ప్రజా సంక్షోభం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ ప్రభుత్వానికి సహకరించడానికి, తమ వంతుగా చేయదగ్గ పనులు, సహాయాలు చేయాలి. తెలంగాణ ప్రభుత్వం ఈ విపత్తులో పేద ప్రజలను ఆదుకోవడానికి కొన్ని ప్రకటనలు చేయడం సంతోషకరం. పైన వివరించిన అన్ని వర్గాలకు కూడా ఆపన్న హస్తం అందిస్తుందని ఆశిద్దాం. 

 యస్‌. జీవన్‌ కుమార్‌

మానవ హక్కుల వేదిక

Updated Date - 2020-03-26T09:03:05+05:30 IST