డిమాండ్లన్నీ నెరవేర్చాల్సిందే

ABN , First Publish Date - 2022-01-19T05:13:21+05:30 IST

ఉద్యోగ, ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లన్నీ నెరవేర్చేంతవరకు ఉద్యమం ఆగదని ఏపీ ఎన్‌జీవో నంద్యాల శాఖ జేఏసీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మణిశేఖర్‌రెడ్డి, హుసేన్‌రెడ్డి ధ్వజమెత్తారు.

డిమాండ్లన్నీ నెరవేర్చాల్సిందే
నంద్యాలలో మానవహారంగా నాయకులు, ఉద్యోగులు

  1. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల డిమాండ్‌
  2. నల్లబ్యాడ్జీలతో నిరసన, పీఆర్సీ ప్రతుల దహనం


నంద్యాల(నూనెపల్లె), జనవరి 18: ఉద్యోగ, ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లన్నీ నెరవేర్చేంతవరకు ఉద్యమం ఆగదని ఏపీ ఎన్‌జీవో నంద్యాల శాఖ జేఏసీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మణిశేఖర్‌రెడ్డి, హుసేన్‌రెడ్డి ధ్వజమెత్తారు. పీఆర్సీని అమలు చేస్తూ వైసీపీ ప్రభుత్వం వెల్లువరించిన జీవోలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం ఏపీ ఎన్‌జీవో శాఖ నంద్యాల జేఏసీ, ఫ్యాప్టో ఆధ్వర్యంలోని శ్రీనివాససెంటర్‌లోని శ్రీనిధి హోటల్‌ సర్కిల్‌ నుంచి భారీగా ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట రోడ్డుపై మానవహారంగా ఏర్పడి జీవో ప్రతులను దహనం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మణిశేఖర్‌రెడ్డి, హుసేన్‌రెడ్డి మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి రాకముందు వైఎస్‌ జగన్‌ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా, తడిగుడ్డతో గొంతు కోసిన చందంగా వ్యవహరించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. కనీసం 30 శాతం ఫిట్‌మెంట్‌ తగ్గకుండా ఇస్తారనుకుంటే, 23శాతం ప్రకటించడంతో ఉద్యోగుల జీతాలు తగ్గే ప్రమాదం ఉందన్నారు. ప్రభుత్వం ఏర్పడిన వారంలో సీపీఎ్‌సను రద్దు చేస్తామని చెప్పి, మూడేళ్లు గడుస్తున్న హామీ ఊసే లేకుండా దాటవేసే ధోరణిలో వ్యవహరించడం సరికాదన్నారు. కార్యక్రమంలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు కేవీ శివయ్య, సోమేసుల చంద్రశేఖర్‌, జాకీర్‌ హుసేన్‌, సాంబశివుడు, శ్రీనివాసులు, నాగేంద్రప్రసాద్‌, మౌలాలి, సుబ్బయ్య, భాస్కర్‌రెడ్డి, రామచంద్రారెడ్డి, వెంకటేశ్వరరెడ్డి పాల్గొన్నారు. 


పీఆర్సీ ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలి: ఫ్యాప్టో

 పీఆర్సీ అమలు పేరుతో ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలని ఫ్యాప్టో నంద్యాల కన్వీనర్‌ కేవీ శివయ్య డిమాండ్‌ చేశారు. మంగళవారం నంద్యాలలో ఫ్యాప్టో సన్నాహక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా శివయ్య మాట్లాడుతూ పే రీవిజన్‌ కమిషన్‌ వల్ల ఉద్యోగి వేతనం పెరగాల్సిందిపోయి, తగ్గడం విడ్డూరంగా ఉందన్నారు. ఐఆర్‌ 27శాతం కంటే తక్కువ ఫిట్‌మెంట్‌ 23శాతం ప్రకటించడమే గాకుండా, ఏకపక్షంగా హెచ్‌ఆర్‌ఎ్‌స ల్యాబ్‌లను మార్చడంపై ప్రభుత్వ, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక వర్గాల పొట్టగొట్టే చర్యల్లో భాగంగా కనిపిస్తుందని విమర్శించారు. ఇందులో భాగంగా ఈనెల 20న రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ముట్టడి కొనసాగుతుందని తెలిపారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవోలను వ్యతిరేకిస్తూ ఉద్యోగులందరూ నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరుకావాలని, ఉత్తర్వుల ప్రతులను మండల కేంద్రాలలో దహనం చేయాలని పిలుపునిచ్చారు. భవిష్యత్‌లో జరిగే ఉద్యమ కార్యాచరణకు ఫ్యాప్టో నాయకులు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో మౌలాలి, సాంబశివుడు, రామచంద్రారెడ్డి, వర ప్రసాద్‌, సుబ్బయ్య, శ్రీనివాసులు, రంగస్వామి పాల్గొన్నారు. 


ఆళ్లగడ్డ: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఈ పీఆర్సీ మాకోద్దంటూ రాష్ట్ర భాషోపాధ్యాయ సంఘం రాష్ట్ర కార్యదర్శి కన్నయ్య అన్నారు. మండలంలోని కోటకందుకూరు జడ్పీ ఉన్నత పాఠశాల ఎదుట మంగళవారం ప్రధానోపాధ్యాయుడు రాంపుల్లారెడ్డి ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలు ధరించి నినాదాలు చేశారు. పీఆర్సీ తీవ్ర నిరాశకు గురిచేసిందని, హెచ్‌ఆర్‌ఏ స్లాబ్‌ను యథాతధంగా కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు ప్రసాదరెడ్డి, నాగభూషణరెడ్డి, ఉపాధ్యాయినులు క్రిష్ణవేణి, దినదివ్యకుమారి పాల్గొన్నారు.


చాగలమర్రి: ప్రభుత్వం విడుదల చేసిన పీఆర్సీ జీవో పట్ల యూటీఎఫ్‌ సంఘ నాయకులు, ఉపాధ్యాయులు తీవ్రంగా వ్యతిరేకించారు. మంగళవారం చింతలచెరువు ఉన్నత పాఠశాలలో నల్ల బ్యాడ్జీ లు ధరించి నిరసన తెలి పారు. యూటీఎఫ్‌ అధ్యక్షుడు డెన్ని జాన్సన్‌ మాట్లాడుతూ హెచ్‌ఆర్‌ఏ తగ్గింపు పట్ల ప్రభుత్వంపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నామన్నారు. ఉద్యోగుల జీతాల్లో భారీ కోత విధించడం అన్యాయమన్నారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం భాస్కర నరసింహారెడ్డి, ఉపాధ్యాయులు బెన్నయ్య, నారాయణమూర్తి, శైలజాబాయి, శ్రీనాథ్‌రెడ్డి, లింగమూర్తి పాల్గొన్నారు.


శిరివెళ్ల: ప్రభుత్వం విడుదల చేసిన అశాస్త్రీయ పీఆర్సీ ఉత్తర్వులు ఉద్యోగ, ఉపాధ్యాయుల జీవితాల్లో చీకట్లు నింపాయని ఏపీటీఎఫ్‌ 1938 జిల్లా అదనపు కార్యదర్శి నగిరి శ్రీనివాసులు, ఫ్యాప్టో నాయకులు పీవీ ప్రసాద్‌, మహమ్మద్‌ ఖాసీం అన్నారు. ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా రాజనగరం, శిరివెళ్ల గ్రామాల్లో ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలు ధరించి మంగళవారం  నిరసన వ్యక్తం చేశారు. అనంతరం పీఆర్సీ ఉత్తర్వుల ప్రతులను దహనం చేశారు. ఫిట్‌మెంట్‌ 30 శాతం తగ్గకుండా ఇవ్వాలని, ఇంటి అద్దె అలవెన్సులు యథాతధంగా కొనసాగించాలని, ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 60 సంవత్సరాలుగా కొనసాగించాలని వారు డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు వరాహమయ్య, అబ్ధుల్‌ రహీం, గురువయ్య, వెంకటేశ్వరరెడ్డి, శివశంకరుడు, గోపీకృష్ణ, అనురాధ, రమాదేవి పాల్గొన్నారు. 


ఓర్వకల్లు: ప్రభుత్వం విడుదల చేసిన పీఆర్సీ జీవోలను వ్యతిరేకిస్తూ మంగళవారం ఓర్వకల్లులోని ఎంఆర్‌సీ భవనం ఎదురుగా ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, పీఆర్‌టీయూ ఏపీటీఎఫ్‌, యూటీఎఫ్‌ సంఘాల నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఫిట్‌మెంట్‌ 30 శాతం తగ్గకుండా ఇవ్వాలని, ఇంటి అద్దె అలవెన్సులు యథాతధంగా కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.




Updated Date - 2022-01-19T05:13:21+05:30 IST