Abn logo
Jun 23 2021 @ 00:06AM

మొత్తంగా కృష్ణాజలాలకే ఎసరు పెట్టారు!

సాగునీటి రంగంలో తాను అనుసరిస్తున్న విధానాల ఫలితంగా గోడ దెబ్బ చెంప దెబ్బ అంటే ఏమిటో తెలిసి వస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లే ఉంది. కేంద్ర ప్రభుత్వం తోక కోసి సున్నం పెడుతున్నా గట్టిగా అడగ లేకున్నది. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి ప్రత్యక్ష పోరాటానికి సవాలు విసిరినా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేందుకు తదనుగుణమైన చర్యలు ఏమీ కనించడం లేదు. ఈ అంశంలో కేసీఆర్ ద్విముఖ పోరాటానికి తెర లేపారు. వాస్తవం చెప్పాలంటే కేసీఆర్ ఈ పాటికే వ్యూహాత్మకంగా పైచేయి సంపాదించారు. ఒకవైపు అంతర్ రాష్ట్ర జల వివాద చట్టం సెక్షన్ 3 మేరకు కృష్ణ జలాల పంపిణీకి కొత్త ట్రిబ్యునలును గాని లేదా బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునలుకు బాధ్యత అప్పగించేందుకు కేంద్ర జల వనరుల శాఖ మంత్రి షెకావత్ వద్ద మాట తీసుకున్నారు. ఇదే జరిగితే బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 512 టియంసిలు భవిష్యత్తు గాలిలో దీపమే. మరో వేపు ఆంధ్ర ప్రదేశ్‍తో బస్తీమే సవాల్ అంటూ పలు కొత్త ప్రాజెక్టులు ప్రకటించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అటు కేంద్ర ప్రభుత్వంతోనూ ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తోను మెతక వైఖరి అవలంబిస్తూ సాగునీటి రంగంలో రాష్ట్ర ప్రయోజనాలను బలి పెడుతున్నారు. 


గత ఏడాది అక్టోబరులో అపెక్స్ కౌన్సిలు సమావేశం జరిగింది. ఈ సందర్భంలో సుప్రీంకోర్టులో ఉన్న కేసు వెనక్కి తీసుకుంటే 1956 అంతర్ రాష్ట్ర జల వివాద చట్టం సెక్షన్ 3 మేరకు కృష్ణ నదీ జలాల పంపిణీని బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునలుకు నివేదించుతానని కేంద్ర జల శక్తి శాఖ మంత్రి షెకావత్ తెలంగాణ ముఖ్యమంత్రికి హామీ ఇచ్చారు. ఆ మేరకు తెలంగాణ సుప్రీంకోర్టులో ఉన్న కేసును ఉపసంహరించుకొని కొత్తగా ట్రిబ్యునల్‍గాని బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్‍కు గాని అంతర్ రాష్ట్ర జల వివాద చట్టం సెక్షన్ 3 మేరకు నివేదించమని కోరింది. అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో జగన్మోహన్ రెడ్డి ఈ ప్రతిపాదనను ఎందుకు అంగీకరించారు? అంతేకాదు రాష్ట్ర విభజన చట్టం 11వ షెడ్యూలులో లేని అన్ని ప్రాజెక్టులు కొత్తవిగా భావింపబడుతున్నాయి. 11 షెడ్యూలులో లేకున్నా తెలంగాణ నిర్మిస్తున్న పాలమూరు రంగారెడ్డి దిండి తదితర ప్రాజెక్టుల గురించి ఏపీ ముఖ్యమంత్రి సమావేశంలో గట్టిగా ఎందుకు నిలదీయ లేదు? పైగా కేంద్ర జల సంఘం వద్ద సాంకేతిక అనుమతులు లేని అన్ని ప్రాజెక్టులు కొత్తవి అని కేంద్ర మంత్రి నిర్వచనం ఇస్తే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆమోదించడంతో ఏపీ పలు పాత ప్రాజెక్టులకు సమస్యలు వచ్చిపడ్డాయి. అపెక్స్ కౌన్సిల్ సమావేశం సమస్యలను పరిష్కరించకపోగా కొత్త సమస్యలను తెర మీదకు తెచ్చింది. ఒక్క పోతురెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణ పనుల విషయంలో మౌనం పాటించినందున ఇప్పుడు గోడ దెబ్బ చెంప దెబ్బ తినవలసి వస్తోంది.


వాస్తవంలో ఏపీ, తెలంగాణల మధ్య కృష్ణ జలాల కేటాయింపులపై వివాదం లేదు. చట్టబద్ధత గల బచావత్ ట్రిబ్యునల్ తీర్పు అమలులో ఉంది. ఎవరి వాటా ఎంతో బచావత్ ట్రిబ్యునల్ తీర్పులో స్పష్టంగా ఉంది. సుప్రీంకోర్టు విధించిన స్టే మేరకు అమలులోలేని బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ అవార్డులోనూ స్పష్టంగా ఉంది. బచావత్ ట్రిబ్యునల్ విచారణ సందర్భంగా తెలంగాణ ప్రాంతం తరపున సరైన వాదన వినిపించ లేదనేది తెలంగాణ ఫిర్యాదు. ఇందుకు న్యాయపరంగా ఎలాంటి ఆధారం లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ అడగడం కేంద్రమంత్రి సరే అనడం మన ముఖ్యమంత్రి మౌనం దాల్చడంతో నేడు అసలుకే మోసం వస్తోంది. 


సాగునీటి ప్రాజెక్టుల నీటి పంపిణీలో ఉన్న సహజ న్యాయ సూత్రాలకు అనుగుణంగా బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ కూడా బచావత్ ట్రిబ్యునల్ తీర్పు జోలికి వెళ్లలేదు. ఒక దఫా కేటాయింపులు జరిగి అవి "వినియోగంలో" ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మార్పు చేసే అవకాశం లేదు. బచావత్ ట్రిబ్యునల్ తీర్పులో అన్యాయం జరిగిందని ఇప్పుడు తెలంగాణ గోల చేస్తుంటే దాన్ని కేంద్ర ప్రభుత్వం పరిగణనలోకి ఎలా తీసుకొంటుంది? కేంద్రం కూడా బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు అమలులోనికి రాకున్నా దానికి అనుగుణంగా ఒకవైపు కర్ణాటకకు పగ్గాలు వదలిపెట్టి మరోవైపు ఆంధ్ర ప్రదేశ్ గొంతు కోస్తూ తెలంగాణకు అనుకూలంగా వ్యవహరించబోతోంది. బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ ఆర్డీయస్ కేటాయించిన నాలుగు టిఎంసిల వినియోగానికి కాలువ తవ్వతుండగా ఇప్పుడు కేసీఆర్ గోల చేస్తున్నారు. 11వ షెడ్యూలులో లేని ప్రాజెక్టులను తెలంగాణ చకా చకా నిర్మిచుకుపోతుంటే పోతురెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణ పనులపై తెలంగాణ కోర్టులను ఆశ్రయించినట్లు ఏపీ ప్రభుత్వం ఎందుకు కోర్టులకెక్కడం లేదు? 


రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రెండు రాష్ట్రాల మధ్య పంపకం జరగని నీళ్లు ఉన్నా లేదా నీటి ఎద్దడి ఉన్నా ఈ సందర్భాల్లో ప్రొటొకాల్ ఏమిటో నిర్ణయించే బాధ్యతను కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన చట్టం సెక్షన్ 89 మేరకు బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్‌కు బాధ్యతను అప్పగించింది. వాస్తవం ఇదైతే 1956 అంతర్ రాష్ట్ర జల వివాద చట్టం సెక్షన్ 3 మేరకు తిరిగి బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్‌కు కేంద్రం ఎందుకు నివేదిస్తోంది? అపెక్స్ కౌన్సిల్ సమావేశంలోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ ప్రతిపాదనను ఎందుకు అడ్డుకోలేదు? 


ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్‍కు నివేదిస్తే బచావత్ ట్రిబ్యునల్ తీర్పు మేరకు ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్‍లో "వినియోగం"లో ఉన్న నీటి కేటాయింపులు పక్కనపెట్టే అవకాశం ఉంది. తిరిగి మొత్తంగా కృష్ణ జలాలను రెండు రాష్ట్రాల మధ్య పంపిణీ చేసేందుకు ట్రిబ్యునల్‍కు అధికారం దఖలు పడుతుంది. దీనివల్ల ఇప్పుడు ఉన్న కేటాయింపులు మారిపోవచ్చు. ప్రధానంగా బచావత్ ట్రిబ్యునల్ రాయలసీమకు చేసిన కేటాయింపుల్లో భారీ కోత పడవచ్చు. ఎందుకంటే ఆంధ్ర ప్రదేశ్ కృష్ణ బేసిన్ నుంచి ఇతర బేసిన్ (పెన్నా)లకు నీరు తరలించుతోందనేది తెలంగాణ ప్రధానమైన ఫిర్యాదు. 


సహజ న్యాయ సూత్రాల ప్రకారం తెలంగాణ డిమాండ్ సమంజసం కాదు. ఉమ్మడి రాష్ట్రంలో బచావత్ ట్రిబ్యునల్ 1969లో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు, అప్పటి అవసరాలు దృష్టిలో పెట్టుకుని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాకుండా బేసిన్‍లో వున్న మూడు రాష్ట్రాల మధ్య నీటి పంపకం చేసింది. ఒకవేళ తిరిగి పంపిణీ జరిగినా అన్ని రాష్ట్రాల మధ్య జరగాలి. అందుకూ ఈ పాటికే కేంద్రం గండికొట్టింది. అంతే కాదు, బచావత్ ట్రిబ్యునల్ కూడా తన ఫైనల్ తీర్పు చాప్టర్ 7 క్లాజు 14లో 2000 సంవత్సరం మే 31 తర్వాత నియమింపబడే కొత్త ట్రిబ్యునల్ రివ్యూ లేక రివిజన్ చేసే సమయంలో ఏ రాష్ట్రానికైనా తాము కేటాయించిన నీటికి లోబడి అట్టి నీరు "వినియోగంలో" ఉంటే మార్పు చేయకూడదని స్పష్టంగా పేర్కొన్నది. ఆంధ్ర ప్రదేశ్‍కు చెంది బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన నీరు మొత్తంగా వినియోగంలో వున్నందున బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ కూడా ఆ కేటాయింపుల జోలికి వెళ్లలేదు. మిగులు నికర జలాలను మాత్రం పంపిణీ చేసి దిగువ రాష్ట్రమైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‍కు క్యారీ ఓవర్ కింద కేవలం 150 టియంసిలు మిగిల్చింది. ఇప్పుడు రాష్ట్ర విభజన చట్టం సెక్షన్ 89 మేరకు బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ రెండు రాష్ట్రాల మధ్య క్యారీ ఓవర్ కింద వున్న 150 టియంసిల మాత్రమే పంపకం చేయాలి. దీనితో పాటు గోదావరి జలాలు 80 టియంసిల కృష్ణకు చేరుతున్నందున తెలంగాణ వాటా ఎంతో నిర్ధారణ అయి వాటిని పంపకం చేయవలసి వుంది. ఇంతకు మించి పంపకానికి ఏమీ నీళ్లు మిగిలి లేవు. అదే జరిగితే రాష్ట్ర విభజన చట్టం 11వ షెడ్యూల్ ఉన్న ప్రాజెక్టులకు తోడు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాలమూరు రంగారెడ్డి దిండి ఎత్తిపోతల పథకాలు నిరుపయోగం అవుతాయి. ఈ ప్రమాదం గ్రహించే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో వ్యూహాత్మకంగా కేంద్రమంత్రి వద్ద హామీ తీసుకొని సుప్రీంకోర్టులో కేసు వెనక్కి తీసుకున్నారు. 


రాష్ట్ర విభజన అనంతరం 2015 డిసెంబరులో కృష్ణ జలాల పంపిణీ విషయంలో ఏపీ, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలు వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‍లు సుప్రీంకోర్టులో విచారణకు వచ్చాయి. కృష్ణ జలాల పంపిణీ బేసిన్‍లోని అన్ని రాష్ట్రాల మధ్య జరగాలనా? లేక రెండు తెలుగు రాష్ట్రాల మధ్యనా? అన్న విషయం మీద కేంద్ర ప్రభుత్వం అభిప్రాయం చెప్పాలని సుప్రీంకోర్టు కోరింది. కేంద్ర ప్రభుత్వం కొన్నాళ్లు నాన బెట్టి తుదకు రెండు తెలుగు రాష్ట్రాల మధ్యనే విచారణ జరగాలని చెప్పింది. ప్రస్తుతం తెలంగాణ వైపు నుంచి బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ ఎదుట విచారణాంశాలుగా ఉన్న కొన్నింటిని పరిశీలిస్తే తెలంగాణ వ్యూహాన్ని అవగతం చేసుకోగలం: 1) ప్రాజెక్టుల వారీ కేటాయింపుల్లో కెసి కెనాలుకు ఉన్న కేటాయింపును సమీక్షించి బేసినులోని ప్రాజెక్టులకు తిరిగి పంపిణీ చేయాలి. 2) పక్క బేసినులోని ఆయకట్టుకు నీటిని సరఫరా చేస్తున్న కెసి కెనాల్ యస్ఆర్ బిసి సాగర్ కుడి కాలువ తుంగభద్ర ఎగువ కాలువ పంట విధానంలో మార్పుచేసి ఆదా అయ్యే నీటిని ఇతర ప్రాజెక్టులకు కేటాయించాలి. 3) ఇతర మార్గాల ద్వారా వినియోగానికి అవకాశం ఉన్న తెలుగుగంగ ఆర్డీయస్ కుడి కాలువలకు ప్రాజెక్టుల వారీ కేటాయింపుల్లో బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్‌ చేసిన నీటి కేటాయింపులను సమీక్షించాలి. ఇవీ తెలంగాణ డిమాండ్లలో కొన్ని. మొత్తం 18 అంశాలు విచారణాంశాలుగా ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్ర విభజన చట్టం సెక్షన్ 89 మేరకు విచారణ జరుపుతున్న ట్రిబ్యునల్‌ ముందు తెలంగాణ ప్రభుత్వం ఇలాంటి గొంతెమ్మ కోరికలు వ్యక్తం చేస్తే రేపు 1956 అంతర్ రాష్ట్ర జల వివాద చట్టం సెక్షన్ 3 మేరకు వాస్తవంలో ట్రిబ్యునల్‌ ముందు విచారణ జరిగితే ఏపీ ప్రభుత్వానికి చుక్కలు చూపించడమేగాక ఏపీ ప్రజలకు కుచ్చుటోపీ పెడుతుంది. 

వి. శంకరయ్య

విశ్రాంత పాత్రికేయులు