అందరం బోనులోనే...

ABN , First Publish Date - 2021-09-14T05:50:50+05:30 IST

నాగరక సమాజం, పాలకవ్యవస్థలు, విధాననిర్ణేతలు అందరూ తలవంచుకోవలసిన సందర్భం. అంతా సజావుగా ఉన్నదని భ్రమిస్తూ ఇటువంటి సమాజంలో జీవిస్తున్నందుకు సిగ్గుపడాలి....

అందరం బోనులోనే...

నాగరక సమాజం, పాలకవ్యవస్థలు, విధాననిర్ణేతలు అందరూ తలవంచుకోవలసిన సందర్భం. అంతా సజావుగా ఉన్నదని భ్రమిస్తూ ఇటువంటి సమాజంలో జీవిస్తున్నందుకు సిగ్గుపడాలి. మొన్న గురువారం నాడు సాయంత్రం హైదరాబాద్‌లోని సైదాబాద్ సింగరేణి కాలనీలో ఒక ఆరేళ్ల చిన్నారి మీద పొరుగునే ఉండే ఒక దుర్మార్గుడు అత్యాచారం చేసి, హత్య చేశాడు. హతురాలు గిరిజన బాలిక. హంతకుడు ఆటోడ్రైవర్. జరిగింది శ్రామికులు నివసించే గుడిసెల కాలనీ. కానీ, అటువంటి సంఘటన ఎక్కడైనా, ఏ బాలికకైనా జరగవచ్చు. ఈ అఘాయిత్యం జరిగిన తరువాత గడచిన నాలుగైదు రోజుల్లో ఎన్నో ఇటువంటివి జరిగి ఉండవచ్చు. ఈ మాటలు రాస్తున్న సమయంలో కూడా ఎక్కడో ఎవరో అభాగ్యురాలికి, చిన్నారికి అపకారం జరుగుతూ ఉండవచ్చు. కాయకష్టం చేసుకునేవాడు, మధ్యతరగతి ఉద్యోగి, ధనవంతుడు ఏ మగవాడైనా అటువంటి అఘాయిత్యానికి పాల్పడవచ్చు. ఆడపిల్లకు, ముఖ్యంగా చిన్నారి ఆడపిల్లకు ఎక్కడైనా పూర్తి రక్షణ ఉన్నదా అన్నది అనుమానమే. సార్వత్రకం, సార్వజనీనం చేసి నేర తీవ్రతను తగ్గించడం పొరపాటు. బాలిక సామాజిక నేపథ్యం, పేదరికం ఆ కుటుంబానికి కలిగిన కష్టాన్ని రెట్టింపు చేస్తాయి. దాడికి పాల్పడిన దుర్మార్గుడు సామాజికంగా ఎటువంటి ప్రాబల్యం లేనివాడు కావడం వల్ల తగిన కఠినాతి కఠినమయిన శిక్షను తప్పించుకునే అవకాశాలు తక్కువ. బిల్లా, రంగా అనే ఇద్దరు పేరుమోసిన నేరస్థులు గీత, సంజయ్ అనే ఇద్దరు మైనర్ పిల్లలను హింసించి చంపినందుకు మరణశిక్ష పొందారు. అది నలభయ్యేళ్ల కిందట దేశాన్ని కుదిపివేసిన దుర్మార్గ ఘటన. పదిహేనేళ్ల బాలికను రేప్ చేసి చంపాడనే అభియోగంపై ధనుంజయ చటర్జీ అనే సెక్యూరిటీ గార్డు దోషిగా నిర్ధారణ పొంది, ఉరిశిక్ష అనుభవించాడు. నేరం జరగడానికి, న్యాయం జరగడానికి మధ్య సుదీర్ఘమైన ప్రక్రియలు ఉండడం వల్ల, ప్రజలలో అసంతృప్తులు పెరగడం సహజం. అందుకే, దోషిని వెంటనే శిక్షించాలన్న డిమాండ్‌లు వస్తున్నాయి. కొన్ని సందర్భాలలో ప్రజాగ్రహం తీవ్రంగా ఉన్నప్పుడు, అటువంటి ‘శీఘ్ర న్యాయాన్ని’ అమలు చేయడానికి పోలీసులు, ప్రభుత్వాలు ఉత్సాహపడుతున్నాయి కూడా. 


ఇటువంటి విషాద దురంతాలు జరిగినప్పుడల్లా ఆవేశపడి పోవడం, నేరస్థులను శిక్షించడంలో ప్రభుత్వాల అలసత్వాన్ని నిందించడంతో సరిపెట్టుకుంటున్నాం. నిర్భయ ఉదంతం సందర్భంలో సమస్య మూలకారణాల అన్వేషణకు, దిద్దుబాటుకు ప్రత్యేక చర్యలు తీసుకునే ప్రయత్నం మొదలయింది. కానీ, సమాజం దృష్టి అంతా దోషులకు శిక్ష అమలు జరగడం మీదనే కేంద్రీకృతమైంది. దోషులు ఉరికంబమెక్కగానే న్యాయం జరిగిందనుకోవడం వేరు, సమస్యకే పరిష్కారం దొరికిందనుకోవడం వేరు. సమస్య, ప్రత్యక్షంగా కనిపించే దోషులు మాత్రమే కాదు. ఆటోడ్రైవర్గా పనిచేసే నిందితుడు గంజాయికి అలవాటు పడ్డాడట. అతని తీరు భరించలేక భార్య పుట్టింటికి వెళ్లిందట. గంజాయి బాగా తలకెక్కి, పొరుగింటి చిన్నారిని తినడానికి ఏవో ఇస్తానని ఆశపెట్టి, అఘాయిత్యం చేశాడట, చంపేశాడట. గంజాయి ఎక్కడి నుంచి వస్తున్నది? ఏ సమస్యలు అతన్ని మాదకద్రవ్యాల వైపు లాగాయి? అతని విచక్షణను చంపిన ప్రభావాలేమిటి? ముక్కుపచ్చలారని పసిపిల్లపై అటువంటి హింస ప్రయోగించేటంత ఉన్మాదం అతనికి ఎక్కడి నుంచి వచ్చింది? అతనొక్కడిలోనే అమానవీయత ఉన్నదా? సమాజంలో అంతటా వ్యాపించి ఉన్నదా? తలెత్తిన విషపు కోరలను కత్తిరించివేస్తే పుట్టలలోని పాములన్నీ సాధుజీవులై పోతాయా?


ఈ మధ్యనే తమిళనాడులో బయటపడిన ఒక ఉదంతం, చిన్నపిలలపై లైంగిక హింసకు సంబంధించిన విషాదకరమైన కోణాన్ని బయటపెట్టింది. తొమ్మిది పదేళ్ల ఆడపిల్లలను వారి తల్లులే రేషన్ షాపు డీలర్ అయిన ఒక దుర్మార్గుడి దగ్గరకు పంపేవారు. అతను వారిపై లైంగిక దాడి చేయడమే కాకుండా, ఆ దుశ్చర్యలను విడియోలో చిత్రీకరించి సొమ్ము చేసుకునేవాడు. ఇప్పటివరకు ఆ నిందితుడు పది మంది దాకా పిల్లలపై లైంగిక దాడులు చేశాడట. ఇందులో ఆ తల్లుల దారిద్ర్యమూ, ఆ దుర్మార్గుడి క్రూరత్వమూ లాభాపేక్ష అన్నీ కలగలసి ఉన్నాయి. చిన్నారులపై అత్యాచారాలు చాలా సందర్భాలలో పరిసరాలలోని వారు, బంధువులు, తెలిసినవారి ద్వారా జరుగుతాయని గణాంకాలు సూచిస్తున్నాయి. కొవిడ్ కట్టడుల కాలంలో మొత్తంగా స్త్రీలపై అత్యాచారాలు పెరగడమే కాకుండా, పిల్లలపై లైంగిక హింస పెరిగిందని అధ్యయనాలు చెబుతున్నాయి. కేరళలో, ఈ ఒక్క సంవత్సరంలోనే ఇప్పటిదాకా పిల్లలపై అత్యాచారాల కేసులు 600 దాకా నమోదయ్యాయి. దేశరాజధాని నగరంలో ఈ ఏడాది మొదటి ఆరునెలల కాలంలో ఆడవారిపై నేరాలు 63 శాతం పెరిగాయట. 


సమస్యకు మూలాలు సామాజిక పునాదులలో ఉన్నాయి. ఆధిపత్య అంతరాలు, ధనిక పేద తారతమ్యాలు లేని సమాజంలో మాత్రమే నేరాలకు తక్కువ ఆస్కారం ఉంటుంది. పేదరికం కానీ, చెడుస్పర్శను గుర్తించలేని లోపం కానీ, అసహాయత కానీ, నిర్మానుష్యత చీకటి వంటి పరిసరాలు కానీ పిల్లలను, ఆడపిల్లలను హింసించడానికి ఆస్కారం ఇవ్వకుండా తగిన రక్షణలు, చైతన్యం కల్పించాలి. పిల్లలను అనుక్షణం కనిపెడుతూ ఉండాలి. హాని చేసే అవకాశమున్న ప్రతి ఒక్కరినీ అనుమానించాలి. కీడెంచి మాత్రమే మేలు ఎంచాలి. 


తీవ్రశిక్షలు, కఠినశిక్షలు సరే, సమాజం అంతా అమానవీయ నేరాలపై తన ఉదాసీన భావాన్ని, సంఘటన జరిగినప్పుడు మాత్రమే స్పందించే స్వభావాన్ని వదులుకోవాలి. నేరాన్ని, హింసను, దుర్మార్గాన్ని ప్రక్షాళన చేసేందుకు మన మీద మనం పెద్ద యుద్ధమే చేయాలి.

Updated Date - 2021-09-14T05:50:50+05:30 IST