పాపం.. పళని!

ABN , First Publish Date - 2021-05-04T10:20:27+05:30 IST

‘ఎడప్పాడి పళని స్వామి పాలన బాగానే ఉంది. కానీ... ఈసారి మాత్రం మా ఓటు స్టాలిన్‌కే వేస్తాం’... ఎన్నికల ముందు తమిళనాడులో కనిపించిన మూడ్‌ ఇది! ఇప్పుడు అదే జరిగింది... ‘గౌరవప్రదమైన’ స్థాయిలో సీట్లు వచ్చినప్పటికీ, అన్నాడీఎంకే అధికారం కోల్పోయింది. ‘స్థానిక భావోద్వేగాలు’ తీవ్రంగా ఉండే

పాపం.. పళని!

కమలంతో పొత్తే కొంప ముంచిందా?

జయలేని లోటు కనిపించనివ్వని నేత

బీజేపీతో దోస్తీపైనే ‘తమిళుల’ అసంతృప్తి


(చెన్నై - ఆంధ్రజ్యోతి)

‘ఎడప్పాడి పళని స్వామి పాలన బాగానే ఉంది. కానీ... ఈసారి మాత్రం మా ఓటు స్టాలిన్‌కే వేస్తాం’... 

ఎన్నికల ముందు తమిళనాడులో కనిపించిన మూడ్‌ ఇది!  ఇప్పుడు అదే జరిగింది... ‘గౌరవప్రదమైన’ స్థాయిలో సీట్లు వచ్చినప్పటికీ, అన్నాడీఎంకే అధికారం కోల్పోయింది. ‘స్థానిక భావోద్వేగాలు’ తీవ్రంగా ఉండే తమిళనాట... బీజేపీతో చెలిమి అన్నాడీఎంకే కొంప ముంచినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.


2016లో తప్ప తమిళనాట జరిగే ప్రతి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు ఏకపక్షంగానే తీర్పునిస్తూ వచ్చారు. ఓడిన పార్టీకి రెండు మూడు స్థానాలకంటే ఎక్కువగా వచ్చేవి కావు. ఒకమారు ఏకంగా జయలలిత కూడా పరాజయం పాలయ్యారు. 2016 ఎన్నికలు మాత్రం కాస్త భిన్నంగా జరిగాయి. ఆ ఎన్నికల్లో అన్నాడీఎంకేకు 136, ప్రతిపక్ష డీఎంకేకు 89 స్థానాలు వచ్చాయి. అయితే... ఇప్పుడు మళ్లీ పాత సంప్రదాయమే పునరావృతమవుతుందని, అన్నా డీఎంకే చిత్తుచిత్తుగా ఓడిపోతుందని అంతా భావించారు. కానీ... ఆదివారం వెలువడిన ఫలితాలు ఇందుకు భిన్నంగా కనిపించాయి. కారణం... ముఖ్యమంత్రిగా పళనిస్వామి తీసుకున్న నిర్ణయాలు, పాలనాపరమైన విధానాలేనని స్పష్టమవుతోంది. జయ కన్నుమూత తర్వాత... 2017 ఫిబ్రవరి 16న ఎడప్పాడి పళనిస్వామి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. శశికళ నామినేటెడ్‌ సీఎంగా పడిన ముద్రను చెరిపేసుకునేందుకు ఆదిలో ఇబ్బడిముబ్బడిగా సంక్షేమ పథకాలు అమలు చేశారు.


ప్రతిపక్షనాయకుల పట్ల సైతం ఉదారంగా వ్యవహరించారు. దీంతో ప్రతిపక్షాల నుంచి విమర్శలే వినిపించలేదు. మంత్రివర్గంలోనూ, ఇతర నామినేటెడ్‌ పదవుల్లోనూ జయ నియమించిన వారినే కొనసాగించారు. ఇక జయ ప్రవేశపెట్టిన పథకాలను ఎక్కడా లోటుపాట్లు రాకుండా అమలు చేశారు. కాంట్రాక్టులు, ఇతర వ్యవహారాల్లో చేతివాటం ప్రదర్శించే నేతల పట్ల చూసీచూడనట్లు వ్యవహరించినా... ప్రజలకు అందాల్సిన సంక్షేమ పథకాలకు ఎక్కడా కొరతరానీయలేదు. అభ్యర్థుల ఎంపికలోనూ ఎడప్పాడి ఆచితూచి వ్యవహరించారు. గతంలో జయలలిత ఎంపిక చేసిన వారికే అగ్రతాంబూలం ఇచ్చారు. మొత్తంగా పదేళ్లుగా పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ... ప్రభుత్వ వ్యతిరేకత కనిపించకుండా చూసుకున్నారు. నాయకత్వ లేమి కనిపించకుండా ప్రచారంలో అన్నీ తానై వ్యవహరించారు. తన నియోజకవర్గంలో ఒకే ఒకరోజు ప్రచారం చేసుకున్న ఎడప్పాడి.. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి అభ్యర్థుల కోసం రేయింబవళ్లు తిరిగారు.


కొవిడ్‌ కాలంలో చక్కని పనితీరు..

గత ఏడాది కొవిడ్‌ ప్రారంభం సమయంలో ఎడప్పాడి క్రియాశీలకంగా వ్యవహరించారు. మూడునెలల పాటు ప్రతి రేషన్‌కార్డుదారుకు వెయ్యి రూపాయలతో పాటు నిత్యావసర వస్తువులు, మాస్కులు ఉచితంగా అందజేశారు. ఎలాంటి జంకు లేకుండా రాష్ట్రవ్యాప్తంగా సంచరిస్తూ ప్రభుత్వాసుపత్రుల్లో చికిత్సను స్వయంగా పర్యవేక్షించారు. ఇప్పుడు దేశమంతా బెడ్‌ల కొరత, ఆక్సిజన్‌ కొరత వచ్చినా తమిళనాట అలాంటి సమస్య తలెత్తకపోవడం గమనార్హం. ఈ చర్యలన్నీ ఎడప్పాడి పాలన పట్ల ప్రజల్లో సానుకూలత కలిగించాయి. ఇక పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలకు మద్దతివ్వాల్సిన గత్యంతరం ఏర్పడినప్పటికీ.. ఆ లోటు తెలియకుండా రైతుల సంక్షేమం కోసం ఆయన పలు కార్యక్రమాలను చేపట్టారు. ఇక... అసెంబ్లీ ఎన్నికల ముందు డీఎంకేను మించి ‘ఉచిత’ హామీలను ప్రకటించారు. రేషన్‌కార్డుదారులందరికీ వాషింగ్‌మెషిన్‌, రెండు గ్యాస్‌ సిలిండర్లు, నెలనెలా మహిళలకు రూ.1500 ఉచితంగా ఇస్తామన్న హామీలు బాగానే పని చేశాయి. అన్నాడీఎంకేకు ఇన్ని స్థానాలు రావడానికి గల కారణాల్లో ఇదీ ఒకటి!


బీజేపీతో వచ్చిన తంటా!

బీజేపీతో జత కట్టడమే అన్నాడీఎంకే కొంపముంచినట్లు వెలువడిన ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ విషయాన్ని అన్నాడీఎంకే నేతలు ప్రచార సమయంలోనే పసిగట్టారు. ప్రధాని నరేంద్రమోదీ, అమిత్‌షాల ఫొటో లు లేకుండానే కొంతమంది అన్నాడీఎంకే అభ్యర్థులు ప్రచారం చేశారు. ఎడప్పాడి ఏ నిర్ణయమైనా పూర్తిస్థాయిలో సొంతంగా తీసుకోలేకపోతున్నారని, ఢిల్లీ ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నారన్న భావన ప్రజల్లో స్పష్టంగా కనిపించింది. ‘మన వ్యవహారంలో నిర్ణయం తీసుకోగలిగిన మన ప్రభుత్వమే మేలు’ అనే అభిప్రాయం చాపకింద నీరులా విస్తరించింది. ఇదే డీఎంకేకు లాభించి, అన్నాడీఎంకే కొంప ముంచనుందని, అంతకుమించి అన్నాడీఎంకే ప్రభుత్వం పట్ల పెద్దగా ప్రజల్లో వ్యతిరేకత లేదంటూ ‘ఆంధ్రజ్యోతి’ ప్రధాన సంచికలో మార్చి 25న కథనం ప్రచురించింది.


ఇప్పుడు అదే అక్షరసత్యమైంది. బీజేపీతో జత కట్టకుంటే మళ్లీ అధికారంలోకి వచ్చే వారమని అన్నాడీఎంకే నేతలే వ్యాఖ్యానించడం గమనార్హం. కానీ... బీజేపీ నేతలు మాత్రం తమ సహకారం లేకుంటే ఇన్ని స్థానాలు వచ్చేవి కావని చెబుతున్నారు. మరోవైపు... ఓటమి పట్ల అన్నాడీఎంకే అసంతృప్తిగా ఉన్నాతమకు బీజేపీ చెర వీడినట్లేనని కొంతమంది సీనియర్లు సంతోషంగా ఉన్నారు. 

Updated Date - 2021-05-04T10:20:27+05:30 IST