ఈ పెళ్లికి వచ్చినోళ్లంతా అవాక్కయ్యారు..!

ABN , First Publish Date - 2020-02-11T01:29:09+05:30 IST

సంప్రదాయాలను పాటిస్తూనే, కొత్తగా ఆలోచించడంలో యువత ఎప్పుడూ చురుగ్గానే ఉంటారు. న్యాయవాది సుష్మ హరిణి తన వివాహం గురించి అలాగే ఆలోచించారు.

ఈ పెళ్లికి వచ్చినోళ్లంతా అవాక్కయ్యారు..!

సంప్రదాయాలను పాటిస్తూనే, కొత్తగా ఆలోచించడంలో యువత ఎప్పుడూ చురుగ్గానే ఉంటారు. న్యాయవాది సుష్మ హరిణి తన వివాహం గురించి అలాగే ఆలోచించారు. ఆమె కలలను సాకారం చేయడానికి  పెళ్ళి పెద్దలతోపాటు వధూవరులు చాలా శ్రమించారు. మొత్తానికి ఆమె కోరుకున్నట్లుగానే వివాహ మహోత్సవం జరిగింది. అయితే నూతన వధూవరులను దీవించడానికి వచ్చినవారంతా ఆశ్చర్యపోయారు. అక్కడ మంత్రాలు చదువుతూ, వారికి పెళ్లి చేస్తున్న వ్యక్తి ఓ మహిళ కావడంతో అందరూ అవాక్కయ్యారు. వధువు తీసుకున్న ఆదర్శప్రాయమైన నిర్ణయాన్ని ప్రశంసించారు.


చెన్నై శివారులోని దక్షిణ చిత్రలో సుష్మ హరిణి, విఘ్నేశ్ రాఘవన్‌ల వివాహ మహోత్సవం శుక్రవారం జరిగింది. వధువు సుష్మ హరిణి తెలుగింటి అమ్మాయి. వరుడు విఘ్నేశ్ రాఘవన్ తమిళుడు. 


సుష్మ హరిణి తన వివాహం మహిళా పురోహితురాలి చేత చేయించాలని, వాద్యకారులంతా మహిళలే ఉండాలని తన తల్లిదండ్రులకు చెప్పారు. ఆమె కోరికను విన్న తల్లిదండ్రులు మొదట సంశయించారు. మహిళా పురోహితురాలు అందుబాటులో ఉంటారా? అని అనుకున్నారు. వధూవరులు సుష్మ, విఘ్నేశ్ చాలా శ్రమపడి  మైసూరులోని భ్రమరాంబ మహేశ్వరి అనే వేద పండితురాలిని పురోహితురాలిగా ఏర్పాటు చేశారు. అయితే వాద్యకారుల విషయంలో సుష్మ కలలు ఫలించలేదు. సంప్రదాయ రీతిలో నాదస్వరం, మృదంగం వాయించే కళాకారిణులు లభించలేదు. 


వధువు తండ్రి సురేశ్ రెడ్డి మాట్లాడుతూ పురోహితురాలు హిందూ సంప్రదాయబద్ధంగా, శాస్త్రోక్తంగా వివాహం జరిపించారని చెప్పారు. ప్రతి మంత్రానికి అర్థాన్ని ఆంగ్లంలో వధూవరులకు వివరించారని చెప్పారు. పురోహితురాలు పెళ్లి చేయించడమనే విషయం గురించి తాము ఎప్పుడూ వినలేదని, అందువల్ల తాము మొదట్లో ఇది చాలా ఇబ్బందికరమైన నిర్ణయమని అనుకున్నామని చెప్పారు. చివరికి అందరికీ ఇది చాలా సంతోషకరమైన సందర్భంగా, మధుర జ్ఞాపకంగా నిలిచిపోయిందని వివరించారు.


వివాహ మహోత్సవానికి హాజరైన తమ బంధుమిత్రులు పురోహితురాలు భ్రమరాంబ మహేశ్వరి సమర్థతను ప్రశంసించారని, ఆమెను సంప్రదించేందుకు వివరాలు అడిగి తెలుసుకున్నారని చెప్పారు.


వధువు సుష్మ మాట్లాడుతూ సేలంలో మహిళా పురోహితులు వివాహాలు జరిపించడం తనకు తెలుసునని తెలిపారు. అయితే ఈ విధానం ఓ వర్గంలో మాత్రమే ఉందన్నారు. సాధారణంగా పురుష పురోహితులే వివాహాలు జరిపిస్తూ ఉంటారని, దీనిని మార్చాలని తాను అనుకున్నట్లు చెప్పారు. పురోహితురాళ్లు కూడా ఉంటారని, వారి చేత వివాహాలు జరిపించి, ప్రోత్సహించాలని అన్నారు.


Updated Date - 2020-02-11T01:29:09+05:30 IST