ప్రాజెక్టులన్నీ తీసుకోవాల్సిందే

ABN , First Publish Date - 2021-10-22T07:57:13+05:30 IST

గోదావరిలో తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులను స్వాధీనం చేసుకోవడానికి గల సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయాలని కేంద్ర ప్రభుత్వం గోదావరి నదీ యాజమాన్య బోర్డును ఆదేశించింది.

ప్రాజెక్టులన్నీ తీసుకోవాల్సిందే

  • గోదావరిపై చెప్పినవన్నీ తీసుకోండి
  • సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయండి
  • కృష్ణా ప్రాజెక్టుల అప్పగింతపై ఒత్తిడి తేవాలి
  • రెండు నదీ బోర్డులకు కేంద్రం ఆదేశాలు
  • బచావత్‌ తీర్పునకు కేంద్రం కట్టుబడాల్సిందే
  • కృష్ణా బోర్డు చైర్మన్‌కు తెలంగాణ లేఖ

హైదరాబాద్‌, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): గోదావరిలో తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులను స్వాధీనం చేసుకోవడానికి గల సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయాలని కేంద్ర ప్రభుత్వం గోదావరి నదీ యాజమాన్య బోర్డును ఆదేశించింది. ఇటీవల గోదావరి బోర్డుకు డిప్యుటేషన్‌ మీద వచ్చిన కేంద్ర జల వనరుల సంఘం(సీడబ్ల్యూసీ) చీఫ్‌ ఇంజనీర్‌ అతుల్‌కుమార్‌ నాయక్‌కు కేంద్రం ఈ బాధ్యతలను అప్పగించింది. ఆయన నేతృత్వంలోని ఏడుగురు అధికారులతో కూడిన బృందం ఈ నెల 25 నుంచి 28 దాకా శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నుంచి సీతారామ దాకా ప్రాజెక్టులను పరిశీలించనుంది. గెజిట్‌ అమలుపై కేంద్ర జల వనరుల శాఖ బుధవారం రాత్రి గోదావరి, కృష్ణా బోర్డుల ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించింది. సమావేశంలో బోర్డుల ప్రతినిధులు ఇప్పటిదాకా తామేం చేశామో కేంద్రానికి వివరించారు. గోదావరిలో తొలిదశలో ఉమ్మడి ప్రాజెక్టు పెద్దవాగును తీసుకోవడానికి వీలుగా బోర్డు సమావేశంలో తీర్మానం చేశామని గోదావరి బోర్డు ప్రతినిధులు వెల్లడించారు. పెద్దవాగును బోర్డు పరిధిలోకి తేవడానికి తెలంగాణ అంగీకరించినప్పటికీ ప్రాజెక్టును అప్పగిస్తూ ఎలాంటి జీవో ఇవ్వలేదని తెలిపారు. తెలంగాణలో గోదావరిపై షెడ్యూల్‌-2లో పొందుపర్చిన ప్రాజెక్టులన్నీ బోర్డుకు అప్పగిస్తేనే పెద్దవాగు అప్పగింతకు సంబంధించి జీవో ఇస్తామని ఏపీ సమాచారం ఇచ్చినట్లు వెల్లడించారు. పెద్దవాగు ఒకటే తీసుకుంటే బోర్డుకు ఎలాంటి సహకారం ఇవ్వబోమని ఏపీ తేల్చిచెప్పిందన్నారు. ఒకటే ప్రాజెక్టు తీసుకోవాలని ఎందుకు అనుకున్నారని జల వనరుల శాఖ ఉన్నతాధికారులు ప్రశ్నించారు. గెజిట్‌లోని షెడ్యూల్‌-2లో పేర్కొన్న ప్రాజెక్టులన్నీ స్వాధీనం చేసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. 


ఒక ప్రాజెక్టు తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనం ఏముంటుందని ప్రశ్నించారు. ప్రాజెక్టులన్నీ తీసుకోవడానికి వీలుగా చర్యలు తీసుకోవాలని కేంద్రం ఆదేశించడంతో అతుల్‌ కుమార్‌ నాయక్‌ నేతృత్వంలో ఏడుగురు అధికారులతో అప్పటికప్పుడే బోర్డు బృందాన్ని ఏర్పాటు చేసింది. కృష్ణాలో సైతం శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుల పరిధిలోని 15 నీటి విడుదల పాయింట్లను తమకు అప్పగించాలని కోరుతూ తీర్మానం చేసి, ఆ ప్రతులను తెలుగు రాష్ట్రాలకు పంపించామని కృష్ణా బోర్డు కేంద్రానికి వివరించింది. ఏకకాలంలో రెండు రాష్ట్రాల ప్రాజెక్టులను స్వాధీనం చేసుకోవాలని ఏపీ మెలిక పెట్టిందని అధికారులు కేంద్రానికి నివేదించారు. ప్రాజెక్టులను అప్పగించేదాకా తెలుగు రాష్ట్రాలపై ఒత్తిడి పెంచాలని కేంద్రం ఆదేశించింది. ప్రాజెక్టులను బోర్డుల పరిధిలోకి తీసుకురాకపోతే మరిన్ని సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని కేంద్రం స్పష్టం చేసింది. 


బచావత్‌ తీర్పుకు కట్టుబడాల్సిందే

బచావత్‌ ట్రైబ్యునల్‌కు లోబడే కృష్ణా నదీ యాజమాన్య బోర్డు, కేంద్ర ప్రభుత్వం నడుచుకోవాలని తెలంగాణ స్పష్టం చేసింది. ఈ తీర్పును మార్చే అధికారం కృష్ణా బోర్డుకు కానీ, కేంద్రానికి కానీ లేదని తేల్చిచెప్పింది. 1973లో బచావత్‌ ట్రైబ్యునల్‌ కృష్ణా జలాల పంపకంపై ఇచ్చిన తీర్పు ప్రకారమే శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుల నిర్వహణ విధివిధానాలు ఉండాలని పునరుద్ఘాటించింది. బచావత్‌ తీర్పులోని పేజీ నెం.104లో శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణంపై స్పష్టత ఉందని గుర్తు చేసింది. ఈ మేరకు కృష్ణా బోర్డు ఛైర్మన్‌ మహేంద్రప్రతాప్‌ సింగ్‌కు గురువారం నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ రజత్‌ కుమార్‌ లేఖ రాశారు. శ్రీశైలం ప్రాజెక్టు కట్టిందే జల విద్యుత్‌ అవసరాల కోసమని, ఈ జలాశయంలో నీటిని జల విద్యుత్‌ అవసరాల కోసం కోసం తప్ప మరేతర అవసరాలకు మళ్లించడానికి వీల్లేదని స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో సాగు, తాగు, పారిశ్రామిక అవసరాలు తీర్చడమే నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు ఉద్దేశమని, ఈ ప్రాజెక్టుకు నీటి విడుదల శ్రీశైలం రిజర్వాయర్‌ నుంచే ఉందని, దీనికి ఎలాంటి క్యాచ్‌మెంట్‌ ఏరియా లేదని గుర్తు చేశారు. 


రెండు రిజర్వాయర్లకు బచావత్‌ ట్రైబ్యునల్‌ రక్షణలు ఉన్నాయని తెలిపారు. కృష్ణా జలాలపై బ్రిజేష్‌ కుమార్‌ ట్రైబ్యునల్‌ తీర్పు అమల్లోకి వ చ్చేదాకా బచావత్‌ తీర్పును గౌరవించాల్సిందేనని స్పష్టం చేశారు. శ్రీశైలం రిజర్వాయర్‌ నుంచి ఏపీకి 34 టీఎంసీల కన్నా ఎక్కువగా నీటిని తరలించడానికి వీల్లేదని తేల్చిచెప్పారు. ఏడేళ్లుగా కృష్ణా జలాలను బేసిన్‌ అవతలికి తరలిస్తూ... బచావత్‌ ట్రైబ్యునల్‌ తీర్పుకు విరుద్ధంగా ఏపీ చట్టవిరుద్ధమైన వాదన వినిపిస్తోందని పేర్కొన్నారు. ఒక సంవత్సరం వినియోగించుకోని నీటిని మరుసటి సంవత్సరానికి బదలాయించాలంటూ నిబంధనలను ప్రస్తావించారు. జూలై 15వ తేదీన కేంద్రప్రభుత్వం విడుదల చేసిన గెజిట్‌ అమలుపై చర్చించేందుకు, అధ్యయనం చేయడానికి వీలుగా నిపుణుల కమిటీని వేశామని, కమిటీ తొలి సమావేశం ఈ నెల 20వ తేదీన జరిగిందని తెలిపారు. బచావత్‌ ట్రైబ్యునల్‌ తీర్పునకు లోబడి శ్రీశైలం, సాగర్‌ నిర్వహణ ఉండాలని ఏకాభిప్రాయం వ్యక్తమైందని గుర్తు చేశారు. 

Updated Date - 2021-10-22T07:57:13+05:30 IST