సర్వ సన్నద్ధం

ABN , First Publish Date - 2020-09-19T10:41:42+05:30 IST

సచివాలయ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 20 నుంచి 26 వరకూ ఈ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు యంత్రాంగం సన్నద్ధమవుతోంది.

సర్వ సన్నద్ధం

 రేపటి నుంచి సచివాలయ పరీక్షలు

 1198 పోస్టులకు 49,584 మంది పోటీ

 పూర్తయిన ఏర్పాట్లు 

 అభ్యర్థుల కోసం 77 ఆర్టీసీ బస్సులు


(గుజరాతీపేట, సెప్టెంబరు 18):

సచివాలయ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 20 నుంచి 26 వరకూ ఈ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు యంత్రాంగం సన్నద్ధమవుతోంది. జిల్లాలోని 17 మండలాల్లో 312 పరీక్ష కేంద్రాలను సిద్ధం చేసింది. జిల్లాలో 1198 పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీచేసింది. 49,584 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అంటే ఒక్కో పోస్టుకు 41 మంది పోటీ పడుతున్నారు. మహిళలు 23,636 మంది, పురుషులు 25,948 పరీక్షలకు హాజరుకానున్నారు.


తొలిరోజు పరీక్షకు భారీ పోటీ నెలకొంది. 32,793 మంది  హాజరుకానున్నారు.  పర్యవేక్షణకు గానూ  410 మంది చీఫ్‌ సూపరింటెండెంట్లు, 90 మంది అదనపు చీఫ్‌ సూపరింటెండెంట్లు, 410 డిపార్ట్‌మెంట్‌ అధికారులు, 25 ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లు, 264 మంది రెవెన్యూ కోఆర్డినేటర్లు, 1064 మంది హాల్‌ సూపరింటెండెంట్లు, 4,035 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో అభ్యర్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఇప్పటికే కలెక్టర్‌ నివాస్‌ పలుమార్లు సూచనలు చేశారు.


భౌతికదూరం పాటించాలని, శానిటైజర్లు విధిగా తెచ్చుకోవాలని స్పష్టం చేశారు. మరోవైపు ఆర్టీసీ కూడా ప్రత్యేక బస్సులను కేటాయించింది. అభ్యర్థుల సౌకర్యార్థం జిల్లావ్యాప్తంగా 77 బస్సులను ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ డివిజనల్‌ మేనేజర్‌ జి.వరలక్ష్మి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.  ఈ నెల 20 నుంచి 26 వరకు ఐదు డిపోల నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులను నడపనున్నట్లు చెప్పారు. ‘శ్రీకాకుళం, పాలకొండ, టెక్కలి, పలాస క్లస్టర్ల పరిధిలోని 312 పరీక్ష కేంద్రాలకు అభ్యర్థులు చేరుకొనేందుకు ఉదయం 5.30 గంటల నుంచే బస్సులు అందుబాటులో ఉంటాయి. ప్రతి బస్టాండ్‌లో హెల్ప్‌ డెస్క్‌ను ఏర్పాటు చేశాం. పరీక్ష కేంద్రాలకు వెళ్లే మార్గాలపై అభ్యర్థులకు తగిన సూచనలు, సలహాలు అందించనున్నాం.


కొవిడ్‌ను దృష్టిలో ఉంచుకొని ప్రతి బస్సును  శానిటేషన్‌ చేయిస్తున్నాం. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు ప్రత్యేక కమ్యూనికేషన్‌ సెల్‌ అందుబాటులో ఉంటుంది. అత్యవసర సమాచారం కోసం 7382921647, 7382920648 (శ్రీకాకుళం), 7382920351(పాలకొండ), 7381923311(టెక్కలి), 7382924758(పలాస) నంబర్లను  సంప్రదించాలి’ అని ఆర్టీసీ డివిజనల్‌ మేనేజర్‌ సూచించారు. 

Updated Date - 2020-09-19T10:41:42+05:30 IST