దారులన్నీ హైదరాబాద్‌కే!

ABN , First Publish Date - 2021-01-18T08:32:12+05:30 IST

సంక్రాంతి పండగ వెళ్లింది. సొంతూళ్లకు వచ్చిన బంధుమిత్రులు తిరుగు ప్రయాణమయ్యారు.

దారులన్నీ హైదరాబాద్‌కే!

  • పోటెత్తిన తిరుగు ప్రయాణం 
  • విజయవాడ నుంచి ఒక్కరోజే 100 బస్సులు
  • పూర్తి రద్దీతో నడిచిన 36 విమానాలు
  • సొంత కార్లు, క్యాబ్‌లు వీటికి అదనం
  • ఫాస్టాగ్‌ ఉన్నా... వాహనాల బారులు
  • కీసర టోల్‌ప్లాజా వద్ద 4 గంటల్లో 
  • 20 వేల వాహనాలు క్లియర్‌

విజయవాడ, జనవరి 17(ఆంధ్రజ్యోతి): సంక్రాంతి పండగ వెళ్లింది. సొంతూళ్లకు వచ్చిన బంధుమిత్రులు తిరుగు ప్రయాణమయ్యారు. వాహనాలన్నీ హైదరాబాద్‌వైపు పరుగులు తీస్తున్నాయి. సొంత వాహనాలు, ప్రైవేటు, ఆర్టీసీ బస్సుల్లో వచ్చిన జనం ఉమ్మడి రాజధానివైపు తరలిపోతున్నారు. తిరిగి వెళ్లే జనానికి ప్రయాణ కష్టాలు వెంటాడుతున్నాయి. ఆర్టీసీ కృష్ణా రీజియన్‌ ఆదివారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో విజయవాడ నుంచి హైదరాబాద్‌కు 100 ప్రత్యేక బస్సులను నడిపింది. చాలామంది ప్రయాణికులు ముందుగానే రిజర్వేషన్‌ చేసుకోవడంతో.. డిమాండ్‌ను బట్టి అధికారులు అదనంగా బస్సులు నడిపారు. హైదరాబాద్‌తోపాటు, చెన్నై, బెంగళూరు వైపు వెళ్లే బస్సులు కూడా కిటకిటలాడాయి.


క్యాబ్‌లకు విపరీతంగా డిమాండ్‌ పెరిగింది. కార్లలో సొంతూళ్లకు వచ్చిన వారు ఆదివారం సాయంత్రం నుంచి హైదరాబాద్‌కు పయనమయ్యారు. దీంతో కీసర టోల్‌గేట్‌ వద్ద కార్లు బారులు తీరాయి. ఫాస్టాగ్‌ ఉన్నా.. నిమిషాల్లోనే టోల్‌ క్లియర్‌ చేస్తున్నా.. టోల్‌ప్లాజా రద్దీగానే ఉంటోంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 20 వేల వాహనాలు కీసర టోల్‌ప్లాజా మీదుగా వెళ్లాయి. రాత్రి వెళ్లే వాహనాలు ఇంకా ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. కీసర టోల్‌ప్లాజా వద్ద ఆరు లేన్లకుగాను నాలుగు ఫాస్టాగ్‌ ఉన్నాయి. అయినా ట్రాఫిక్‌ విపరీతంగా ఉంది. విజయవాడ విమానాశ్రయం నుంచి ఆదివారం 30 విమానాలు ఫుల్‌ రష్‌తో నడిచాయి. శనివారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 36 విమానాలు విజయవాడ నుంచి బయలుదేరాయి. హైదరాబాద్‌, బెంగళూరు, ఢిల్లీ, తిరుపతి, ముంబాయి, చెన్నై, కడపలకు విమాన సర్వీసులు నడిచాయి. రైళ్లు పరిమిత సంఖ్యలో ఉండటం వల్ల ఎక్కువగా కార్లు, విమానాలు, ఆర్టీసీ బస్సులను ఆశ్రయించారు. టెకీలు హైదరాబాద్‌కు బయలుదేరటం కూడా రద్దీకి కారణమని తెలుస్తోంది. ఇప్పటి వరకు వర్క్‌ ఫ్రం హోమ్‌ నిర్వహిస్తున్న టెకీలకు ఆయా సంస్థల నుంచి ఆఫీసులకు రావాలంటూ మెయిల్స్‌ రావటంతో టెకీలు కూడా మూటా ముల్లె సర్దుకుంటున్నారు. పండగ ముందు పది రోజుల వ్యవధిలో హైదరాబాద్‌ నుంచి కేవలం 97 బస్సులను మాత్రమే నడిపిన ఆర్టీసీ కృష్ణా రీజియన్‌ అధికారులు తిరుగు ప్రయాణం సందర్భంగా ఆదివారం ఒక్కరోజే 100 బస్సులను నడపటం విశేషం.

Updated Date - 2021-01-18T08:32:12+05:30 IST