Advertisement
Advertisement
Abn logo
Advertisement

రాష్ట్రంలోని ప్రధాన డ్యాములన్నీ కేంద్రం గుప్పిట్లోకి

  • కేంద్రం పర్యవేక్షణలో డ్యామ్‌ల భద్రత!
  • నీటి నిల్వ, విడుదలను పర్యవేక్షించనున్న కేంద్రం
  • అవసరమైనప్పుడు మరమ్మతులకు ఆదేశం
  • జాతీయ, రాష్ట్ర కమిటీలు, అథారిటీల ఏర్పాటు
  • జాతీయ కమిటీ ఆదేశాలను అమలు చేసేలా
  • రాష్ట్ర కమిటీ, అథారిటీలకు బాధ్యతలు
  • నిబంధనలు ఉల్లంఘిస్తే జైలుశిక్ష, జరిమానా


హైదరాబాద్‌, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): సాగునీటి ప్రాజెక్టుల ఆనకట్ట (డ్యామ్‌)ల భద్రత ఇక పరోక్షంగా కేంద్ర ప్రభుత్వ నియంత్రణలోకి వెళ్లనుంది. ప్రాజెక్టుల పటిష్ఠతను దృష్టిలో ఉంచుకొని ఆయా ప్రాజెక్టుల్లో ఏ సమయంలో ఎంత మేరకు నీటిని నిల్వ ఉంచాలన్న విషయాన్ని కేంద్రమే పరోక్షంగా పర్యవేక్షించనుంది. దీంతోపాటు ప్రాజెక్టుల నుంచి ప్రమాణాల మేరకు నీటి విడుదలను, ఆయా డ్యామ్‌లకు చేయాల్సిన మరమ్మతులను నిర్దేశించనుంది. ఇందుకు నిధులు కేటాయించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తుంది. ఈ మేరకు డ్యామ్‌ సేఫ్టీ బిల్లును పార్లమెంటు తాజాగా ఆమోదించడంతో అది చట్ట రూపం దాల్చనుంది. ఏయే డ్యామ్‌లు ఈ చట్ట పరిధిలోకి వస్తాయనే అంశంపై మూడు కొలమానాలు పేర్కొంది. వీటిలో ఒకటి.. భూమి నుంచి 15 మీటర్ల ఎత్తు నిర్మాణం కలిగిన డ్యామ్‌, రెండోది 500 మీటర్ల పొడవైన క్రస్ట్‌ గేట్లు కలిగి ఉన్న డ్యామ్‌, మూడోది ప్రతి సెకనుకు 2 వేల క్యూబిక్‌ మీటర్ల నీటిని విడుదల చేసే డ్యామ్‌. కాగా, రాష్ట్రంలో భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల డ్యామ్‌లు 38 ఉండగా.. వీటిలో చాలా వరకు ఈ చట్టం పరిధిలోకి రానున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో జూరాల, నాగార్జునసాగర్‌, మూసీ, శ్రీరాంసాగర్‌, కడెం నారాయణరెడ్డి వంటి ప్రాజెక్టులకు పలు సమస్యలున్నాయి. అయితే నీటి నిల్వలు నిండుగా ఉండటంతో అధికారులు వీటి మరమ్మతుల జోలికి వెళ్లడంలేదు.


నిధుల కొరత కూడా ఇందుకు ఒక కారణం. అయితే కొత్త చట్టం అమల్లోకి రావడంతో ఆయా ప్రాజెక్టులకు విధిగా మరమ్మతులు చేయాలని కేంద్రం గనుక భావిస్తే.. దీనిపై రాష్ట్రానికి ఆదేశాలు జారీ చేస్తుంది. గేట్లను రీప్లేస్‌ చేయాల్సివచ్చినా, లీకేజీ సమస్య వచ్చినా, గేట్లను ఎత్తే రోప్‌లు, మోటార్లు పాడైపోయినా.. కేంద్రం ఆదేశాలిస్తే రాష్ట్రం వెంటనే వాటి మరమ్మతులకు నిధులు విడుదల చేసి, చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఏమాత్రం నిర్లక్ష్యం వ హించినా సంబంధిత యంత్రాంగంపై కఠిన చర్యలుంటాయి. నిర్వహణ లోపంతో ప్రాణనష్టం జరిగితే ఏకంగా రెండేళ్ల జైలుశిక్ష విధించేలా చట్టం వెసులుబాటు కల్పించింది. ఇక ఆదేశాలను పాటించకపోతే ఏడాది జైలుశిక్ష లేదా జరిమానా, రెండింటిలో ఏదైనా ఒకటి లేదా రెండూ కలిపి విధించే అధికారం చట్టానికి ఉంది. చట్టం అమలులో కేంద్ర, రాష్ట్ర కమిటీలు సమానమైన అధికారాలు కలిగి ఉంటాయి. కేంద్రం చేసే మార్గదర్శకాలు/సూచనలను అమలు చేసేలా చూడటం రాష్ట్ర కమిటీల బాధ్యత. 

డ్యామ్‌ సేఫ్టీ కోసం జాతీయ కమిటీ..

జాతీయ కమిటీకి చైర్‌పర్సన్‌గా సీడబ్ల్యూసీ చైర్మన్‌ ఉంటారు. కేంద్ర ప్రభుత్వంలో సంయుక్త కార్యదర్శి తత్సమాన కేడర్‌కు చెందిన 10 మంది అధికారులు సభ్యులుగా ఉంటారు. రాష్ట్రాల నుంచి ఈఎన్‌సీ తత్సమాన కేడర్‌కు చెందిన ఏడుగురు అధికారులు రొటేషన్‌ పద్ధతిలో సభ్యులుగా ఉంటారు. వీరిని కేంద్ర ప్రభుత్వం ఎక్స్‌అఫీషియో సభ్యులుగా నామినే ట్‌ చే స్తుంది. ముగ్గురు స్పెషలిస్టులు కూడా సభ్యులుగా ఉంటారు. బిల్లు.. చట్టరూపం దాల్చిన 60 రోజుల్లోగా జాతీయ కమిటీని ఏర్పాటు చేయాలి. మూడేళ్లకు ఒకసారి కమిటీని పునర్‌వ్యవస్థీకరించాలి. కాగా, ఈ కమిటీ ప్రధాన బాధ్యత.. డ్యామ్‌లు తెగకుండా చర్యలు తీసుకోవడం. త గిన నిబంధనలు రూపొందించడం. కమిటీ ఏడాదిలో రెండుసార్లు సమావేశం కావాలి. ఒక సమావేశం మాత్రం వర్షాకాలానికి ముందు జరగాలి. 


జాతీయ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ...

చట్టాన్ని నోటిఫై చేసిన 60 రోజుల్లోగా జాతీయ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీని కేంద్రం ఏర్పాటు చేయాలి. కేంద్ర ప్రభుత్వంలోని అదనపు కార్యదర్శి తత్సమాన కేడర్‌కు చెంది, డ్యామ్‌ సేఫ్టీపై అవగాహన, పట్టు కలిగిన అధికారి నేతృత్వంలో జాతీయ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ ఏర్పడనుంది. దీని కార్యాలయాన్ని దేశ రాజధానిలోగానీ, ఇతర ప్రాంతాల్లోగానీ ఏర్పాటు చేసుకోవచ్చు. కేంద్రప్రభుత్వం ఇచ్చే ఆదేశాలను అమలు చేయడం, రాష్ట్ర డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ లేవనెత్తే అంశాలను పరిశీలించి.. వాటిని పరిష్కరించడం ఈ అథారిటీ బాధ్యత. 


స్టేట్‌ డ్యామ్‌ సేఫ్టీ కమిటీ...

ఈఎన్‌సీ తత్సమాన కేడర్‌లోని అధికారులతో ఈ కమిటీని రాష్ట్ర స్థాయిలో వేయాలి. దీనికి ఈఎన్‌సీ ఎక్స్‌అఫీషియో చైౖర్‌పర్సన్‌గా వ్యవహరిస్తారు. చీఫ్‌ ఇంజనీర్‌ తత్సమాన హోదా కలిగిన ఆరుగురికి మించకుండా అధికారులు ఇందులో ఉంటారు. ఒక డ్యామ్‌లో నిల్వల వల్లగానీ,  వరదను విడుదల చేయడం వల్లగానీ ఎగువ, దిగువ రాష్ట్రాలపై ప్రభావం చూపే అవకాశం ఉంటే.. ఈ కమిటీలో ఆయా రాష్ట్రాలకు చెందిన చీఫ్‌ ఇంజనీర్‌ తత్సమాన స్థాయి అధికారులు కూడా సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీలో సీడబ్ల్యూసీ ప్రతినిఽధి కూడా ఉంటారు. ఇంజనీరింగ్‌ సంస్థలకు చెందిన హై డ్రాలజీ లేదా డ్యామ్‌ డిజైన్లకు చెందిన ముగ్గురు మించకుండా నిపుణులు సభ్యులుగా ఉంటారు. కేంద్ర ఎలక్ట్రిసిటీ అథారిటీకి చెందిన డైరెక్టర్‌ తత్సమాన కేడర్‌కు చెందిన అధికారి కూడా ఉంటారు. ప్రతీ మూడేళ్లకు ఒకసారి కమిటీని పునర్‌వ్యవస్థీకరించాల్సి ఉంటుంది. 

ఈ కమిటీ ఏడాదికి రెండుసార్లు సమావేశం కావాల్సి ఉంటుంది. అందులో ఒకసారి మాత్రం వర్షాకాలానికి ముందు సమావేశం కావాలి. 


స్టేట్‌ డ్యామ్‌ సేఫ్టీ ఆర్గనైజేషన్‌...

చట్టం అమల్లోకి వచ్చిన 80 లేదా 100 రోజుల్లోపు స్టేట్‌ డ్యామ్‌ సేఫ్టీ ఆర్గనైజేషన్‌ను రాష్ట్రప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. 30 డ్యామ్‌లకు పైగా ఈ కమిటీకి అప్పగించాలి. నీటిపారుదలశాఖ చీఫ్‌ ఇంజనీర్‌ తత్సమాన కేడర్‌కు చెందిన అధికారి నేతృత్వంలో ఈ సంస్థ పనిచేయాలి. దీని కార్యకలాపాలు, నిర్వహణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు లోబడి ఉంటాయి.

 

రిపోర్టులన్నీ పబ్లిక్‌ డొమైన్‌లో..

డ్యామ్‌ల భద్రతకు సంబంధించిన వివరాలన్నింటినీ పబ్లిక్‌ డొమైన్‌లో పెట్టాల్సి ఉంటుంది. ఆర్థిక సంవత్సరం ముగిసిన మూడు నెలల్లోపు రాష్ట్ర అథారిటీ, ఆర్నెల్లలోపు కేంద్ర అథారిటీలు నివేదికలు తయారుచేసి, చట్టసభల్లో ప్రవేశపెట్టి, వాటిని కూడా డొమైన్‌లో పెట్టాలి. ఆ నివేదికలను ఎప్పటికప్పుడు జాతీయ విపత్తుల యాజమాన్య సంస్థ, రాష్ట్ర విపత్తుల యాజమాన్య సంస్థ పరిశీలిస్తూ... డ్యామ్‌ భద్రతపై తగిన సూచనలు, సలహాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ప్రతి ప్రాజెక్టుకూ అత్యవసర ప్రణాళికను తయారుచేయాలి. 


ఇదీ నేపథ్యం..

దేశంలో డ్యామ్‌ల భద్రత కోసం 1982లో సీడబ్ల్యూసీ చైర్మన్‌ నేతృత్వంలో స్టాండింగ్‌ కమిటీని ఏర్పాటు చేయగా.. ఆ కమిటీ 1986 జూలై 10న ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. దీని ఆధారంగా బిహార్‌ ప్రభుత్వం 2006లోనే చట్టం చేసి, అమలు చేస్తోంది. కాగా, డ్యామ్‌ సేఫ్టీ కోసం కేంద్ర ప్రభుత్వం సమగ్రంగా చట్టం చేయాలంటూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తోపాటు పశ్చిమబెంగాల్‌ శాసనసభలు తీర్మానం చేసి, కేంద్రానికి పంపించాయి. 2010లో ఈ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టగా.. దీనిని పార్లమెంటరీ స్టాడింగ్‌ కమిటీకి పంపించారు. ఆ తరువాత పక్కనపెట్టారు. తాజాగా లోక్‌సభలోనూ, రాజ్యసభలోనూ ఆమోదించారు. ఈ బిల్లును సెలెక్ట్‌ కమిటీకి పంపించాలని ప్రతిపక్షాలు విజ్ఞప్తి చేసినా కేంద్రం ముందుకే వెళ్లింది. బిల్లు చట్టరూపం దాల్చడంతో దీని అమలు కోసం జాతీయ, రాష్ట్ర స్థాయిలో కమిటీలు వేశారు. డ్యామ్‌ సేఫ్టీ కోసం జాతీయ కమిటీ, జాతీయ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ, స్టేట్‌ డ్యామ్‌ సేఫ్టీ కమిటీ, స్టేట్‌ డ్యామ్‌ సేఫ్టీ ఆర్గనైజేషన్‌లను ఏర్పాటు చేయనున్నారు. 


రాష్ట్ర పరిధిలోనే ఉన్నా... 

డ్యామ్‌ల భద్రత కోసం చట్టం తెచ్చినప్పటికీ ఆయా డ్యామ్‌లు రాష్ట్రం పరిధిలోనే ఉండనున్నాయి. వీటి భద్రత విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం చూపకుండా తగిన చర్యలు తీసుకునే బాధ్యత కూడా రాష్ట్రానిదే. నిరంతరం డ్యామ్‌ల భద్రతపై కేంద్రం నిరంతరం సమీక్ష చేస్తూ.. తగిన మార్గదర్శకాలు జారీ చేస్తుంది. వాటిని రాష్ట్ర ప్రభుత్వం/చట్ట పరిధిలో ఏర్పడిన కమిటీలు అమలు చేయాల్సి ఉంటుంది. ప్రాజెక్టుల భద్రతకు తీసుకునే చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందించాల్సి ఉంటుంది. వర్షాకాలానికి ముందు, ఆ తర్వాత డ్యామ్‌ను నిరంతరం పరిశీలించాలి. ఇక చట్టం పరిధిలో మోపే అభియోగాలను ఏ కోర్టులో కూడా సవాలు చేయడానికి వీల్లేకుండా డ్యామ్‌ సేఫ్టీ చట్టం చేశారు. ఏటా స్టేట్‌ డ్యామ్‌ సేఫ్టీ సంస్థ.. రాష్ట్రంలో డ్యామ్‌ల భద్రతపై నివేదికలు తయారుచేసి, శాసనసభ/శాసనమండలిలో ప్రవేశపెట్టాలి. డ్యాఫ్‌ సేఫ్టీ చట్టం అమలు నేపథ్యంలో.. కొత్తగా డ్యామ్‌లు నిర్మించాలన్నా, మరమ్మతులు చేయాలన్నా కేంద్రం/రాష్ట్రం ప్రభుత్వం నోటిఫై చేసే అథారిటీ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ నిర్మాణ సంస్థ నాణ్యత లేకుండా పనులు చేస్తున్నట్లు అథారిటీ గుర్తిస్తే.. కాంట్రాక్ట్‌ను రద్దు చేసే అధికారం కూడా అథారిటీకి కల్పించారు. ప్రతిపాదిత ప్రాంతం భూకంపాలు వచ్చే జోన్‌లో ఉందా? సురక్షితమైనదా? కాదా? వంటి అంశాలను కేంద్రం చూడనుంది. చట్టం ప్రకారం.. ప్రతి డ్యామ్‌ పరిధిలో హైడ్రో మీటరోలాజికల్‌ స్టేషన్‌ను ఏర్పాటు చేయాలి. భూకంపం వచ్చే ప్రాంతాల్లోనైతే దానిని గుర్తించే కేంద్రాలు పెట్టాలి. డ్యామ్‌ నుంచి నీటిని విడుదల చేసే సమయంలో కచ్చితంగా దిగువ ప్రాంతాల్లో నివాసముండే ప్రజలకు ఆస్తి, ప్రాణనష్టం కలగకుండా చర్యలు తీసుకోవాలి. 

Advertisement
Advertisement