కిషన్‌ రెడ్డి మాటలన్నీ అబద్ధాలే

ABN , First Publish Date - 2021-12-01T09:32:36+05:30 IST

వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర మంత్రి జి.కిషన్‌ రెడ్డి చెప్పే మాటలన్నీ అబద్ధాలేనని రాష్ట్ర మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు.

కిషన్‌ రెడ్డి మాటలన్నీ అబద్ధాలే

  • సీఎం కేసీఆర్‌ రైతు బాంధవుడు: మంత్రి హరీశ్‌రావు 
  • చిల్లరగాళ్లు కాదు.. ప్రధాని మాట్లాడాలి: జగదీశ్‌రెడ్డి
  • ధాన్యం కొనుగోలుపై కేంద్ర మంత్రులది తలోమాట
  • సీఎం కేసీఆర్‌ రైతు బాంధవుడు: హరీశ్‌రావు 
  • చిల్లరగాళ్లు కాదు.. ప్రధాని మాట్లాడాలి: జగదీశ్‌రెడ్డి 
  • కిషన్‌రెడ్డికి వ్యవసాయం గురించి తెలుసా?: ఎ. జీవన్‌రెడ్డి


సంగారెడ్డి/హైదరాబాద్‌/శంషాబాద్‌ రూరల్‌, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర మంత్రి జి.కిషన్‌ రెడ్డి చెప్పే మాటలన్నీ అబద్ధాలేనని రాష్ట్ర మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా మంగళవారం ఆయన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌, అందోలు, సంగారెడ్డి నియోజకవర్గాల్లో జరిగిన టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధుల సమావేశాల్లో మాట్లాడారు. వరి ధాన్యం కొనుగోలుకు సంబంధించి కేంద్ర మంత్రులు పీయూష్‌ గోయెల్‌, కిషన్‌రెడ్డి.. తలోరకంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. కేంద్రం వ్యవహరిస్తున్న తీరు వల్లే రాష్ట్రంలో తడిసిన వరి ధాన్యాన్ని కొనలేకపోతున్నామని చెప్పారు. ధాన్యం కొనుగోలుపై బీజేపీ, కాంగ్రె్‌సలకు మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. సీఎం కేసీఆర్‌ రైతు బాంధవుడని, సింగూరు ప్రాజెక్టు ద్వారా ఎత్తిపోతలను ఏర్పాటు చేసి సంగారెడ్డి జిల్లాకు సాగు నీరందించాలని నిర్ణయించారని ఆయన తెలిపారు. కాగా, ‘‘ధాన్యం కొనుగోళ్లపై సమాధానం చెప్పాల్సింది మీలాంటి చిల్లరమల్లరగాళ్లు కాదు.. దమ్ముంటే ప్రధానమంత్రి మోదీ, కేంద్ర మంత్రులతో చెప్పించండి’’ అని మంత్రి జగదీశ్‌రెడ్డి బీజేపీ నేతలకు సూచించారు. మంగళవారం ఆయన శంషాబాద్‌ విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రప్రభుత్వ వైఖరి ఏంటో స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. 


బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌వి చిల్లర, చెత్త మాటలని విమర్శించారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలంగాణ రైతులకు ఏం చేశారో చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. కాగా, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి వ్యవసాయం, వడ్ల గురించి తెలుసా అని పీయూసీ చైర్మన్‌, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ఏ.జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. మంగళవారం టీఆర్‌ఎ్‌సఎల్పీ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. పారా బాయిల్డ్‌ రైస్‌ ఒప్పందంపై సీఎం కేసీఆర్‌ సంతకం చేస్తే తప్పేమిటని, రాజ్యాంగాన్ని ఎన్నోసార్లు మార్చుకున్నామని, ఆ ఒప్పందాన్ని మార్చుకోలేమా అని నిలదీశారు. టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌కు నోటుతో ఓట్లు కొనడమే తెలుసని, వడ్లు కొనడం గురించి ఏం తెలుసని అని ఆయన ప్రశ్నించారు.

Updated Date - 2021-12-01T09:32:36+05:30 IST