ఇవన్నీ ప్రైవేటుకే...

ABN , First Publish Date - 2021-08-25T00:32:34+05:30 IST

ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థల ఆస్తుల నిర్వహణ ప్రైవేటీకరణకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే.

ఇవన్నీ ప్రైవేటుకే...

న్యూఢిల్లీ : ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థల ఆస్తుల నిర్వహణ ప్రైవేటీకరణకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే. నాలుగేళ్లలో సుమారు రూ. 6 లక్షల కోట్లు  సమీకరించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నప్రభుత్వం...  నేషనల్ మోనిటైజేషన్ పైప్‌లైన్‌(ఎన్‌ఎంపీ)ను  ప్రకటించింది. ఈ ఎన్‌ఎంపీ పరిధిలోకి కేంద్ర ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థల ముఖ్యమైన, మౌలిక వసతులు వస్తాయి. సమీకరణలో భాగంగా 2021-22 లో రూ. 88 వేల కోట్లు, 2022-23 లో రూ. 1.62 లక్షల కోట్లు, 2023.24 లో రూ. 1.79 లక్షల కోట్లు, 2024-25 లో రూ. 1.67 లక్షల కోట్లు సమీకరించనున్నారు. తద్వారా సమకూరే నిధులను మళ్లీ మౌలిక వతుల కల్పనకు వెచ్చించనున్నట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. అయితే... మోనెటైజేషన్ అంటే ఆస్తుల విక్రయంకాదు. ఆస్తులను పూర్తిస్థాయిలో వినియోగించుకునేందుకు ప్రైవేటు సంస్థలకు అప్పగించడం. గడువు తీరిన తర్వాత వాటిని తిరిగి ప్రభుత్వానికి ఇచ్చివేయాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలిలా ఉన్నాయి. 


పన్నెండు శాఖలకు చెందిన ఇరవైకి పైగా ఆస్తులు ఎన్‌ఎంపీలో ఉంటాయి. ఇందులో ప్రధానంగా రోడ్లు, రైల్వేలు, విద్యుత్తు వ్యవస్థలున్నాయి. కాగా... 2022 నుండి మొదలుకుని, 2025 నాటివరకు ఈ కార్యక్రమం అమలుకానుంది. ఆపరేటర్ మెయింటెనెన్స్, ట్రాన్స్‌ఫర్, టోల్ ఆపరేటర్ ట్రాన్స్‌ఫర్, ఆపరేషన్, మెయింటెనెన్స్, డెవలప్‌మెంట్, రిహాబిలిటేట్ ఆపరేట్ మెయింటెయిన్ ట్రాన్స్‌ఫర్ విధానాల్లో ఈ ఆస్తులను అప్పగిస్తారు.మొత్తంమీద... రైల్వేలో 400 స్టేషన్లు, 90 పాసింజర్ రైళ్లు, 1400 కిలో మీటర్ల ట్రాక్, 265 గూడ్స్ షెడ్లు, 741 కిలో మీటర్ల కొంకణ్ రైల్వే, 4 హిల్ రైల్వే స్టేషన్లు, 674 కిలోమీటర్ల డెడికేటెడ్ ప్రైట్ కారిడార్, 15 రైల్వే స్టేడియంలు పన్రైవేటుకు పరిమిత కాలం అప్పగిస్తారు. అదే సమయంలో ఎయిర్ పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని 25 విమానాశ్రయాలను కూడా ప్రైవేటీకరించనున్నారు. తొమ్మిది మేజర్  పోర్టుల్లోని 31 ప్రాజెక్టులను పీపీపీ విధానంలో అప్పగిస్తారు. బీబీఎన్ఎల్, బీఎస్ఎన్ఎల్, డిపార్టుమెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్‌లోని ఆస్తులను ప్రైవేటుకు అప్పటించనున్నారు. జాతీయ స్టేడియంలు, ప్రాంతీయ కేంద్రాలు, పట్టణ ప్రాంతాల్లోని కాలనీలు, అతిధిగృహాలు, హోటళ్ళు  వంటి వాటిని కూడా ప్రైవేటుకు అప్పగించనున్నారు. ఇక ఆయా రంగాలనుంచి సమీకరించుకునేందుకు కేంద్రం పెట్టుకున్న లక్షాలిలా ఉన్నాయి. 


* 26,700 కిలో మీటర్ల రోడ్ల అప్పగింత ద్వారా రూ. 1.60 లక్షల కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

* 28,608 సీకేటీ కిలోమీటర్ల విద్యుత్తు సరఫరా వ్యవస్థ అప్పగింత ద్వారా రూ. 45,200 కోట్లను  సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

* 6 గిగావాట్ల జల, సౌర విద్యుదుత్పత్తి ద్వారా రూ. 39,832 కోట్లను సమీకరించాలని లక్ష్యం. 

* 8,154 కిలోమీటర్ల సహజవాయు పైప్‌లైన్ అప్పగింత ద్వారా రూ. 24,462 కోట్ల సమీకరణ లక్ష్యం. 

* 3,930 కిలోమీటర్ల పెట్రోలియం పైప్ లైన్ అప్పగింత ద్వారా రూ. 22,503 కోట్ల సమీకరణ లక్ష్యం. 

* 210 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గిడ్డంగుల ప్రైవేటీకరణ ద్వారా రూ. 28,900 కోట్లను  సమీకరించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది.

* ఎనిమిది రకాల రైల్వే ఆస్తుల ప్రైవేటీకరణ ద్వారా రూ. 1.52 లక్షల కోట్ల సమీకరణ లక్ష్యం. 

* ఇక... టెలికం రంగంలో 2.86 లక్షల కిలో మీటర్ల ఫైబర్, 14,917 టవర్ల ద్వారా రూ. 35,100 కోట్ల సమీకరణకు లక్ష్యం. 

* 25 ఏఏఐ విమానాశ్రయాల ప్రైవేటీకరణ ద్వారా ద్వారా రూ. 20,782 కోట్ల సమీకరణ లక్ష్యం. 

* నౌకాయాన రంగంలో 9 మేజర్ పోర్టుల్లోని 31 ప్రాజెక్టుల ద్వారా రూ. 12,828 కోట్ల  సమీకరణ లక్ష్యం. 

* బొగ్గు, ఇతరత్రా గనుల రంగంలోని 160 బొగ్గు, 761 ఇతర గనుల వేలం ద్వారా రూ. 28,747 కోట్లు సమీకరణకు లక్ష్యం. 

* ఇక క్రీడా రంగంలోని రెండు జాతీయ స్టేడియంలు, రెండు ప్రాంతీయ కేంద్రాల ద్వారా రూ. 11,450 కోట్లు సమీకరించాలని లక్ష్యం. 

* పట్టణ రియల్ ఎస్టేట్ రంగంలోని కాలనీలు, ఆతిథ్య కేంద్రాల ద్వారా రూ. 15 వేల కోట్లసమీకరణ లక్ష్యం. 

* విమానాశ్రయాల విషయానికొస్తే... వారణాసి, చెన్నై, నాగపూర్, భువనేశ్వర్ తదితర 25 ఏఏఐ విమానాశ్రయాలను రానున్న నాలుగేళ్లలో ప్రవేటీకరించనున్నారు. ఉదయ్‌పూర్, డెహ్రాడూన్, ఇండోర్, రాంచి, కోయంబత్తూరు, జోధ్‌పూర్, వడోదర, పాట్నా, విజయవాడ, తిరుపతి విమానాశ్రయాలు కూడా ఇదే బాటలో  ఉన్నాయి. కాగా... ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో టైర్ 2, టైర్ 3 నగరాలైన అమృత్‌సర్, వారణాసి, భువనేశ్వర్, ఇండోర్, రాయపూర్, తిరుచ్చి విమానాశ్రయాలను అప్పగించనుంది. దేశంలో 137 విమానాశ్రయాలు ఏఏఐ నిర్వహిస్తోంది. ఇందులో 24 అంతర్జాతీయ విమానాశ్రయాలు, 10 కస్టమ్ విమానాశ్రయాలు, 103 డొమెస్టిక్ విమానాశ్రయాలు ఉన్నాయి.


ఇప్పటికే ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు విమానాశ్రయాలను ఇలా (పీపీపీ మోడ్‌లో) అప్పగించిన విషయం తెలిసిందే. చెన్నై, వడోదర వంటి పెద్ద విమానాశ్రయాలను 2023-24 ఆర్థిక సంవత్సరంలో, కాలికట్, కోయంబత్తూరు, మధురై, జోద్‌పూర్ తదితర ఎనిమిది విమానాశ్రయాలను 2022-23 లో, డెహ్రాడూన్, అగర్తలా, ఉదయ్‌పూర్ విమానాశ్రయాలను 2024-25 ఆర్థిక సంవత్సరంలో పీపీపీ మోడల్‌కు తీసుకు రానుంది.


కాగా... ఎయిరిండియా వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ ఫైనాన్షియల్ బిడ్డింగ్ ప్రక్రియ వచ్చే నెలలో ఉంటుందని డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిజ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్ విభాగం వెల్లడించింది. అలాగే దీనిని ఈ ఏడాది డిసెంబరు నాటికి అప్పగించే అవకాశాలున్నాయని చెబుతున్నారు. బీపీసీఎల్ లావాదేవీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి పూర్తికావచ్చని, ఫైనాన్షియల్ బిడ్డింగ్ డిసెంబరు  నాటికి పూర్తవుతుందని వెల్లడించింది. 

Updated Date - 2021-08-25T00:32:34+05:30 IST