వర్సిటీల్లో రాజకీయ కంపు

ABN , First Publish Date - 2020-04-08T09:29:44+05:30 IST

తాజాగా ప్రభుత్వం చేపట్టిన విశ్వవిద్యాలయాల పాలక మండలి సభ్యుల నియామకం రాజకీయ రంగు పులుముకుందనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి.

వర్సిటీల్లో రాజకీయ కంపు

మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు చెప్పిన వాళ్లకే పదవులు

నోట్‌ ఫైల్‌లో సిఫారసు చేసిన వారికే చోటు

అనామకులకు విశిష్ట వ్యక్తుల కోటాలో స్థానం


అమరావతి, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి): తాజాగా ప్రభుత్వం చేపట్టిన విశ్వవిద్యాలయాల పాలక మండలి సభ్యుల నియామకం రాజకీయ రంగు పులుముకుందనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు సూచించిన వారికే పదవులు వరించాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.  క్లాస్‌-2 మెంబర్లకు సంబంధించి రాష్ట్ర ఉన్నత విద్యా మండలి నోట్‌ఫైల్‌లో సిఫారసు చేసిన వారికే చోటు దక్కడం గమనార్హం. విశిష్ట వ్యక్తుల కోటాలో అనామకులకు స్థానం కల్పించారు. ఒక్క వర్సిటీలోనూ సామాజిక సమతుల్యం పాటించ లేదు. 


ఆంధ్ర విశ్వవిద్యాలయంలో 9 మంది పాలక మండలి సభ్యుల్లో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సిఫారసు చేసిన ఆరుగురిని నామినేట్‌ చేశారు. ఒకరిని సీఎంవో సిఫారసు చేసిందని నియమించారు.  


శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో 9 మంది సభ్యుల్లో నలుగురిని విజయసాయిరెడ్డి సామాజిక వర్గం నుంచే నామినేషన్‌ చేశారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి, మంత్రి ఆదిమూలపు సురేశ్‌, సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎంపీ మిథున్‌ రెడ్డి, సీఎం ముఖ్య సలహాదారు అజేయ కల్లం, సీఎం ప్రత్యేక కార్యదర్శి ధనుంజయ్‌రెడ్డి సిఫారసు చేసిన వారిని నియమించారు. పాలక మండలి సభ్యుడిగా ఇవ్వడం కుదరకపోవడంతో ఒకరికి ఏకంగా ‘సెట్‌’ కన్వీనర్‌ పదవి కట్టబెట్టారు.


ఆచార్య నాగార్జున వర్సిటీలో సీఎంవో, హోంమంత్రి మేకతోటి సుచరిత, ఎమ్మెల్యేలు కిలారు వెంకట రోశయ్య, ముస్తఫా, ఆళ్ల రామకృష్ణారెడ్డి, నంబూరు శంకరరావు, మంత్రులు మోపిదేవి వెంకటరమణ, ఆదిమూలపు సురేశ్‌, సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సిఫారసు చేసిన వారిని నామినేట్‌ చేశారు. ప్రొబెషన్‌ కూడా డిక్లేర్‌ కాని టీచర్‌ను సీనియర్‌ ప్రొఫెసర్‌ కేటగిరీ కింద నామినేట్‌ చేశారు. పర్మినెంట్‌ ప్రిన్సిపాల్‌ కాని వ్యక్తిని అఫిలియేటెడ్‌ కాలేజి ప్రిన్సిపాల్‌ కోటాలో నియమించారు. మంత్రి సిఫారసు మేరకే ఈయనకు దక్కిందని ఉన్నత విద్యామండలి చైర్మన్‌ మెసేజ్‌ పెట్టడం విచిత్రం.


శ్రీ కృష్ణదేవరాయ వర్సిటీలో నలుగురు సభ్యులను అనంత వెంకట్రామిరెడ్డి, శ్రీధర్‌రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పిన వారినే నియమించారు.


ఆదికవి నన్నయ వర్సిటీలో ఎం.భరత్‌, పి.విశ్వరూప్‌, జక్కంపూడి రాజా, సజ్జల రామకృష్ణారెడి,్డ మేరుగ నాగార్జున సిఫారసు చేసిన వారిని నామినేట్‌ చేశారు. రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ను పబ్లిక్‌ లైఫ్‌ కేటగిరీ కింద, ఓఎన్‌జీసీలో రెసిడెంట్‌ డాక్టర్‌ను ఇండస్ట్రీ కేటగిరీలో విశిష్ట వ్యక్తిగా నామినేట్‌ చేశారు.


యోగివేమన వర్సిటీలో అవినాశ్‌రెడ్డి, అంజాద్‌బాషా, పి.రవీంద్రనాఽథ్‌రెడ్డి, ఆర్‌.శివప్రసాద్‌రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, సిఫారసు చేసిన నలుగురిని  నామినేట్‌ చేశారు. పబ్లిక్‌ లైఫ్‌ కేటగిరీలో కాలేజీ కరస్పాండెంట్‌ను నామినేట్‌ చేశారు.


డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ వర్సిటీ అఫిలియేటెడ్‌ కాలేజీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ను పబ్లిక్‌ లైఫ్‌ కేటగిరీలో ఆ వర్సిటీ ఈసీ సభ్యుడిగా నియమించారు.


జేఎన్‌టీయూ కాకినాడలో  విజయసాయిరెడ్డి ఎక్కువ పేర్లు సిఫారసు చేశారు.


జేఎన్‌టీయూ అనంతపురానికి ప్రిన్సిపాల్‌ కోటాలో టీచర్‌ను, టీచర్‌ కోటాలో ప్రిన్సిపాల్‌ను చూపించారు. కనీసం ప్రొఫెసర్‌ కూడా కాని వ్యక్తిని సీనియర్‌ ప్రొఫెసర్‌గా నియమించారు. జి.పుల్లారెడ్డి ఇంజనీరింగ్‌ కాలేజీ డైరెక్టర్‌ జయరామిరెడ్డి సిఫారసు మేరకు ఆ కాలేజీ ప్రిన్సిపాల్‌ను నియమించారు.


కృష్ణా వర్సిటీలో బాలినేని శ్రీనివాసరెడ్డి, వెలంపల్లి శ్రీనివాస్‌, అజేయ కల్లం, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి సిఫారసు మేరకు నియామకాలు జరిగాయి.


విక్రమ సింహపురి వర్సిటీలో మంత్రి బాలినేని, ఎమ్మెల్యే ప్రసన్న కుమార్‌ రెడ్డి సిఫారసు మేరకు సాఫ్ట్‌వేర్‌ కంపెనీ టీం లీడర్‌ను.. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, మంత్రి అనిల్‌ కుమార్‌ సిఫారసు మేరకు కొందరిని నియమించారు.


శ్రీ పద్మావతి మహిళా వర్సిటీలో ఐఏఎస్‌ అధికారి ధనుంజయరెడ్డి భార్య పేరును ఎస్వీయూలోనే కాకుండా ఇక్కడ కూడా ప్యానెల్‌లో పెట్టారు. పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి సిఫారసు మేరకు మరొకరిని నియమించారు. చెన్నైలోని ఓ ఇన్‌స్టిట్యూట్‌ డైరెక్టర్‌ను పబ్లిక్‌ లైఫ్‌ కేటగిరీలో నియమించారు.


రాయలసీమ వర్సిటీలో నలుగురిని రెడ్డి సామాజిక వర్గం నుంచి నామినేట్‌ చేశారు. ఒక కళాశాల మాజీ ప్రిన్సిపాల్‌ను ఇండస్ట్రీ కేటగిరీలో విశిష్ట వ్యక్తిగా నియమించారు. మాజీ వీసీని ఇతరుల కేటగిరీలో నియమించారు. ఆదిమూలపు సురేశ్‌, కర్నూలు నేతల సిఫారసు మేరకు కొందరిని నియమించారు.


ద్రవిడ వర్సిటీలో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ రెడ్డి సిఫారసు మేరకు ఒకరిని సభ్యునిగా నియమించారు.

Updated Date - 2020-04-08T09:29:44+05:30 IST