చంద్రబాబు తెప్పించినా మాకు అభ్యంతరం లేదు : ఆళ్ల నాని

ABN , First Publish Date - 2021-05-12T21:02:07+05:30 IST

కోవిడ్ కట్టడి, వ్యాక్సినేషన్‌తో పాటు తదితర సమస్యలపై సమావేశమైన మంత్రివర్గ ఉపసంఘం భేటీ ముగిసింది.

చంద్రబాబు తెప్పించినా మాకు అభ్యంతరం లేదు : ఆళ్ల నాని

అమరావతి : కోవిడ్ కట్టడి, వ్యాక్సినేషన్‌తో పాటు తదితర సమస్యలపై సమావేశమైన మంత్రివర్గ ఉపసంఘం భేటీ ముగిసింది. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం ఆళ్ల నాని ప్రతిపక్ష నేత చంద్రబాబుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్ బయోటెక్‌తో ఆయనకున్న బంధుత్వాన్ని ఉపయోగించి, రాష్ట్రానికి వ్యాక్సిన్‌ను తెప్పించినా తమకు ఎలాంటి అభ్యంతరమూ లేదని నాని స్పష్టం చేశారు. వ్యాక్సినేషన్ విషయంలో ప్రతిపక్షాలు కావాలని రాద్ధాంతం చేస్తున్నాయని తీవ్రంగా మండిపడ్డారు. వ్యాక్సిన్ కొనుగోలు అనేది రాష్ట్ర ప్రభుత్వ చేతిలోనే ఉందని చంద్రబాబు అవాస్తవాలు మాట్లాడుతున్నారని, ప్రజలను భయ భ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ ఉచితంగా జరగాలన్నదే సీఎం జగన్ అభిమతమని, 1600 కోట్లు ఖర్చు చేయడానికి కూడా వెనకాడమని స్పష్టం చేశారు. కేంద్రం ఎన్ని వ్యాక్సిన్లు ఇశచ్చినా, పంపిణీకి తాము సిద్ధమని, ఒకే రోజు ఆరు లక్షల డోసులు వేసిన ఘనత ఏపీ సర్కార్‌దేనని ప్రకటించారు. 


రెండో వేవ్‌లో ఆక్సిజన్ అవసరం అధికంగా ఉందని, అందుకే ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారులను ఆక్సిజన్ రవాణా పర్యవేక్షణ కోసం నియమించామని తెలిపారు. రాష్ట్రానికి 910 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరమని ఇప్పటికే తాము ప్రధానికి లేఖ రాశామని, ప్రతి జిల్లాలో కూడా ఆక్సిజన్ ప్లాంట్స్ సిద్ధం చేస్తున్నామని వివరించారు. మరోవైపు ఆక్సిజన్ వృధా కాకుండా అన్ని చర్యలూ తీసుకుంటున్నామని మంత్రి వివరించారు.  ఆక్సిజన్, రెమిడేసివిర్, బెడ్స్, హోమ్ ఐసోలేషన్, కోవిడ్ కేర్ సెంటర్లపై తాము చర్చించామని వెల్లడించారు. తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో చోటు చేసుకున్న సంఘటనలు పునరావృత్తం కాకుండా చేపట్టాల్సిన చర్యలపై కూడా చర్చించామని పేర్కొన్నారు. ఆక్సిజన్ సరఫరాకు స్పష్టమైన మార్గదర్శకాలను సీఎం జగన్ తమకు సూచించారని, ఆక్సిజన్ పైప్‌లైన్లను వెంటనే వెరిఫై చేయాలని తాము అధికారులను ఆదేశించామని పేర్కొన్నారు. ఆక్సిజన్ డిమాండ్‌ను బట్టి పంపిణీకి ఏర్పాట్లు చేస్తామని, 20 వేలకు పైబడి కేసులు వస్తున్నాయని వెల్లడించారు. రాష్ట్రంలో 11000 ఆక్సిజన్ బెడ్స్ ఇప్పటికే సమకూర్చామని, ఆక్సిజన్ బెడ్స్‌కి టెండర్లను పిలిచారని, ప్రస్తుతం 590 మెట్రిక్ టన్నులు ఆక్సిజన్‌ను వాడుతున్నామని ఆళ్ల నాని పేర్కొన్నారు.  

Updated Date - 2021-05-12T21:02:07+05:30 IST