Abn logo
Jun 4 2021 @ 00:00AM

ఎక్కువ లాభం ఇచ్చేది అతడే!

ఒకసారి మదీనాలో పెద్ద కరవు వచ్చింది. జనం తిండిగింజలు లేక అల్లాడిపోతున్నారు. ప్రజల దుస్థితిని గమనించి తల్లడిల్లిన ఖలీఫా అబూబకర్‌ ‘‘ఈ రోజు సాయంత్రానికల్లా దేవుడు మీ బాధను తీరుస్తాడు’’ అని జోస్యం చెప్పాడు. 


విచిత్రమేమిటంటే... ఆ రోజు సాయంత్రమే సిరియా నుంచి హజ్రత్‌ ఉస్మాన్‌కు చెందిన వాణిజ్య బిడారాలు మదీనాకు చేరుకున్నాయి. వెయ్యి ఒంటెల మీద ధాన్యం బస్తాలు కిటకిటలాడుతున్నాయి. ఈ సరుకు వచ్చిందని తెలియగానే... మదీనాలోని పెద్ద పెద్ద వర్తకులందరూ బేరాలు ఆడడానికి బజారుకు వచ్చి చేరుకున్నారు. 

‘‘ఈ సరుకు మీద మీరు ఎంత లాభం ఇవ్వగలరు?’’ అని ఉస్మాన్‌ ఆ వర్తకులను అడిగారు. 

‘‘మీరు పది రూపాయలకు కొంటే... దానికి నేను పన్నెండు రూపాయలు ఇస్తాను’’ అన్నాడు ఒక వర్తకుడు. 

‘‘నాకు అంతకన్నా ఎక్కువ లాభం వస్తుంది’’ అన్నారాయన. 

‘‘అలాగైతే నేను పదమూడు రూపాయలు ఇస్తాను’’ అన్నాడు మరో వర్తకుడు. 

‘‘నాకు ఇంకా ఎక్కువ లాభం వచ్చే అవకాశం ఉంది’’ అన్నారు ఉస్మాన్‌. 

పధ్నాలుగు రూపాయలకు మరొకరు అడిగారు. ఆయన అదే మాట చెప్పడంతో... ‘‘పోనీ మరో రూపాయి పెంచుతున్నా, సరుకు వదిలెయ్యండి’’ అన్నాడొక వర్తకుడు.

‘‘లాభం లేదు. నాకు అంతకన్నా ఎక్కువ లాభం రావచ్చు’’ అన్నారు ఉస్మాన్‌, తల పైకెత్తి ఆకాశం వైపు చూస్తూ. 

‘‘అంతకన్నా ఎక్కువ లాభం మీకెవరిస్తారు?’’ అని అడిగారు వర్తకులందరూ ఆశ్చర్యపోతూ. 

‘‘నాకు పది రూపాయల సరుకు మీద వంద రూపాయలల ధర లభిస్తుంది. అంతకన్నా ఎక్కువ ధర పెట్టి ఈ సరుకు కొనగలరా’’ అని అడిగారు ఉస్మాన్‌. 

‘‘అంటే పది రూపాయలకు తొంభై రూపాయల లాభమా?’’ అంటూ వర్తకులు నోరు వెళ్ళబెట్టారు. ‘‘ఇది చాలా చోద్యంగా ఉంది. అంత ధర పెట్టి మేం కొనలేం’’ అన్నారు వాళ్ళు. 

‘‘అయితే వినండి. నేను ఈ మొత్తం సరుకును దానం చేస్తున్నాను. దానికి మీరే సాక్షులు. నా పెట్టుబడికి పదింతలు లాభం ప్రసాదించేవాడు దేవుడే’’ అన్నారు ఉస్మాన్‌. 

ఈ సంగతి వినగానే, తిండి గింజల కోసం కటకటలాడుతున్న పేద ప్రజలు ఎంతో సంబరపడ్డారు. సిరియా నుంచి వచ్చిన మొత్తం వెయ్యి ఒంటెల ఎత్తు ఆహార ధాన్యాలను ఉస్మాన్‌ అప్పటికప్పుడు పేదలకు దానం చేశారు.

ఆ రోజు రాత్రి దైవ ప్రవక్త మహమ్మద్‌కు ఆప్తుడైన హజ్రత్‌ అబ్దుల్లా బిన్‌ అబ్బాస్‌కు ఒక కల వచ్చింది. దైవ ప్రవక్త కాంతులు వెదజల్లే దుస్తులు ధరించి, టర్కీ జాతి తెల్ల గుర్రం మీద ఎక్కడికో వెళ్తున్నట్టు కలలో కనిపించింది.

‘‘దైవ ప్రవక్తా! మీరు హడావిడిగా ఎక్కడికి వెళ్తున్నారు?’’ అని అడిగారు హజ్రత్‌ బిన్‌.

‘‘ఈ రోజు ఉస్మాన్‌ వెయ్యి ఒంటెల ఆహార ధాన్యాలు దానం చేశారు కదా! ఆ దానాన్ని దేవుడు స్వీకరించాడు. దానికి ప్రతిఫలంగా ఒక స్వర్గ కన్యతో ఆయన వివాహం జరిపిస్తున్నాడు. ఆ ఉత్సవంలో పాల్గొనడానికి నేను వెళ్తున్నాను’’ అన్నారు దైవ ప్రవక్త.

- మహమ్మద్‌ వహీదుద్దీన్‌