సర్వ సమానత్వమే అల్లాహ్‌ అభిమతం

ABN , First Publish Date - 2021-02-19T08:33:48+05:30 IST

దైవం దృష్టిలో అందరూ సమానులేనంటూ విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని దివ్య ఖుర్‌ఆన్‌ చాటి చెప్పింది. సాంఘికంగా, ఆర్థికంగా అసమానతలు తొలగిపోవడానికి మార్గనిర్దేశం చేసింది.

సర్వ సమానత్వమే అల్లాహ్‌ అభిమతం

దైవం దృష్టిలో అందరూ సమానులేనంటూ విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని దివ్య ఖుర్‌ఆన్‌ చాటి చెప్పింది. సాంఘికంగా, ఆర్థికంగా అసమానతలు తొలగిపోవడానికి మార్గనిర్దేశం చేసింది. మనిషి జీవితంలో సాంఘిక, ఆధ్యాత్మిక అంశాలు ఒకదానితో ఒకటి పెనవేసుకొని ఉంటాయి. ఈ సమానత్వ భావన దైవం నుంచి సంక్రమించిన సిద్ధాంతం. పవిత్ర ఖుర్‌ఆన్‌లోని వాక్యాలు, మహా ప్రవక్త బోధనలూ దీన్ని చాటి చెబుతున్నాయి. ఈ సమానత్వాన్ని లోకంలో నెలకొల్పే బాధ్యత మానవులదే! 


‘‘తొలి మానవుడైన ఆదమ్‌ సంతతికి పెద్దరికాన్ని ప్రసాదించాం. వారికి నేల మీదా, నీటిలో నడిచే వాహనాలను ప్రసాదించాం. పరిశుద్ధమైన వస్తువులను ఆహారంగా ఇచ్చాం. మేము సృష్టించిన ఎన్నో ప్రాణులపై వారికి స్పష్టమైన ఆధిక్యాన్ని అనుగ్రహించాం’’ అని దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ ప్రకటించారు. మానవులంతా అనుసరించాల్సినది ఏకత్వ సిద్ధాంతాన్నే. అదే తాహీద్‌ (ఏకేశ్వరోపాసన). తొలి మానవుడు, తొలి ప్రవక్త హజ్రత్‌ ఆదమ్‌. మానవ జాతి అంతా ఆయన సంతానమే. అందరూ ఒకే మూలం నుంచి ఉద్భవించారు. ప్రపంచ మానవులందరూ సోదరులనీ, భాష, రంగు, రూపం, ప్రాంతం లాంటి భేదాలు అర్థం లేనివనీ దీని ద్వారా మనకు వెల్లడి అవుతుంది.


ప్రారంభంలో మానవులందరూ ఒకే మార్గాన్ని అనుసరించారు. కానీ ఆ తరువాత పరిస్థితులు మారాయి. అభిప్రాయ భేదాలు ఉత్పన్నమయ్యాయి. అప్పుడు ప్రవక్తలను అల్లాహ్‌ ఈ భూమి పైకి పంపాడు. వారు సత్యమార్గంలో నడిచేవారికి శుభ వార్తలు తెలిపేవారు. వక్రమార్గాన్ని అనుసరిస్తే దుష్ఫలితాలు కలుగుతాయని హెచ్చరించేవారు. సత్యం విషయంలో... ప్రజలలో పొడచూపిన విభేదాలు పరిష్కరించడం కోసం... ప్రవక్తలతో పాటు పరమ సత్యాన్ని తెలిపే పవిత్ర గ్రంథాన్ని (దివ్య ఖుర్‌ఆన్‌ను) కూడా పంపాడు. 


ఇస్లాం ఆవిర్భావానికి ముందు... అరబ్బులు తామే అధికులమని భావించేవారు. మహా ప్రవక్త మహమ్మద్‌ బోధలు వారిలో మార్పు తెచ్చాయి. ఆయన కాలంలో... మసీదు అధికారిక కార్యకలాపాలకు నిలయంగా ఉండేది. సామూహిక ప్రార్థనలకు ఇమామ్‌గా ప్రవక్తే వ్యవహరించేవారు. నీగ్రో బానిస అయిన హజ్రత్‌ బిలాల్‌కు ముఅజ్జన్‌ (ప్రార్థనకు ఆహ్వానించే వ్యక్తి) పదవిని ఇచ్చి ఎంతగానో గౌరవించారు. అలాగే తాను మరణశయ్యపై ఉన్నప్పుడు, పూర్వం బానిస అయిన జైద్‌ కుమారుడు ఒసామాను సైన్యాధ్యక్షునిగా నియమించారు. ఇలాంటి ఎన్నో ఉదంతాల ద్వారా సర్వ సమానత్వ భావనలోని ఔన్నత్యాన్ని మహా ప్రవక్త మహమ్మద్‌ చాటి చెప్పారు.


మహమ్మద్‌ వహీదుద్దీన్‌

Updated Date - 2021-02-19T08:33:48+05:30 IST