భర్తను వదిలేసి ప్రియుడితో సహజీవనం.. రక్షణ కావాలని హైకోర్టులో పిటిషన్.. చివరకు..

ABN , First Publish Date - 2021-06-18T19:05:01+05:30 IST

నా భర్త నన్ను చిత్రహింసలు పెట్టాడు. అతడితో కలిసి నేను ఉండలేకపోయాను. అందుకే నన్ను అర్థం చేసుకునే వ్యక్తితో కలిసి సహజీవనం చేస్తున్నా. నా ఇష్ట ప్రకారం మేజర్ అయిన మరో వ్యక్తితో కలిసి జీవిస్తున్నా.

భర్తను వదిలేసి ప్రియుడితో సహజీవనం.. రక్షణ కావాలని హైకోర్టులో పిటిషన్.. చివరకు..

‘నా భర్త నన్ను చిత్రహింసలు పెట్టాడు. అతడితో కలిసి నేను ఉండలేకపోయాను. అందుకే నన్ను అర్థం చేసుకునే వ్యక్తితో కలిసి సహజీవనం చేస్తున్నా. నా ఇష్ట ప్రకారం మేజర్ అయిన మరో వ్యక్తితో కలిసి జీవిస్తున్నా. మా సహజీవనానికి నా భర్త నుంచి కానీ, బంధువుల నుంచి కానీ ఇబ్బందులు రానీయకుండా మాకు రక్షణ కల్పించండి’ అంటూ ఓ వివాహిత కోర్టు మెట్లెక్కింది. ఈ పిటిషన్‌పై విచారణ చేసిన కోర్టు ఓ షాకింగ్ తీర్పునిచ్చారు. ఆ పిటిషన్‌ను రద్దు చేయడమే కాకుండా ఐదు వేల రూపాయల జరిమానా కూడా విధించారు. ఈ కేసునకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 


ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ వివాహిత, ఆమె ప్రియుడు అలహాబాద్ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. ఆ వివాహిత భర్త, బంధువుల నుంచి రక్షణ కల్పించాలని ఆ పిటిషన్‌లో కోరారు. ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ కౌశల్ జయేంద్ర థాకెర్, జస్టిస్ దినేశ్ పాఠక్ ధర్మాసనం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. భర్త ఇబ్బందులు పెట్టారన్న దానికి ఆధారాలు ఏమున్నాయని వివాహితను ప్రశ్నించింది. కనీసం మీరు ఏదైనా పోలీస్ స్టేషన్‌లో కూడా మీ భర్తపై ఫిర్యాదు చేసినట్టు ఆధారాలు లేవనీ, మీరు చేసే ఆరోపణలను నిజమని తాము నమ్మలేమని వ్యాఖ్యానించింది. 


ఇదే సమయంలో భర్తను వదిలేసి వేరే వ్యక్తితో సహజీవనం చేయడమనేది హిందూ వివాహ చట్టానికి పూర్తి వ్యతిరేకమని స్పష్టం చేసింది. ‘మేమిద్దరం మేజర్లం. కలిసి ఉండాలని నిర్ణయించుకున్నాం. మాకు ఆ మాత్రం హక్కు లేదా?’ అన్న పిటిషనర్ వాదనలకు కూడా ధర్మాసనం బదులిచ్చింది. రాజ్యాంగం ప్రకారం దేశంలో ప్రతీ ఒక్కరికీ హక్కులు ఉన్నాయనీ, కానీ అవి చట్టం పరిధిలో ఉండాలని పిటిషనర్లకు ధర్మాసనం గుర్తు చేసింది. సమాజంలో చట్ట వ్యతిరేక పనులను చేయడానికి తాము ఎలా అంగీకరిస్తామని వ్యాఖ్యానించింది. విచారణ అనంతరం ఈ పిటిషన్‌ను కొట్టివేసిన ధర్మాసనం, ఆమెకు 5వేల రూపాయల జరిమానాను కూడా విధించింది. భర్త నుంచి ఇబ్బందులు ఉంటే చట్ట ప్రకారం నడుచుకోవాలని సూచించింది. 

Updated Date - 2021-06-18T19:05:01+05:30 IST