అల్లామ ఎక్బాల్‌ కవిసమయం

ABN , First Publish Date - 2021-03-01T06:42:33+05:30 IST

ఫూల్‌ ఔర్‌ కాంటే కాదు కీల్‌ ఔర్‌ కాంటే కొత్త కవి సమయం?...

అల్లామ ఎక్బాల్‌ కవిసమయం

ఫూల్‌ ఔర్‌ కాంటే కాదు

కీల్‌ ఔర్‌ కాంటే కొత్త కవి సమయం?


రైతులు

పంటల్ని అడవి పందులు, నక్కలు, కోతుల నుంచి

కాపాడుకోవడానికి కంచెలు నాటుతారు

ముళ్ల కంచెలు

భూస్వామ్య మృగాల నుంచి కాచుకోవడానికి

ఇనుప కంచెలు కూడ నాటి మంచెల మీంచి

వడిసెలలే కాదు కొడవళ్లూ విసురుతారు


బలమైన ఎరువులతో ఎదిగిన గోధుమ కర్రలు

ఏపుగా పెరిగిన చెరుకు గడల కన్నా పొడవు

ఇనుప కీలలు, కంచెలు, గోడలు వచ్చాయిపుడు

ఢిల్లీకి తరలివచ్చే పాదాలకడ్డంగా


గోధుమ కోసాక కర్రల మొదళ్ళను

పొలాల్లోనే తగులబెడతారు రైతులు

వచ్చే పంటల భూసారం కోసం

ఆ మంటలతో ఆకాశంలో వ్యాపించే పొగలతో

ఢిల్లీ ఉక్కిరిబిక్కిరయి నిషేధ చట్టాలు తెచ్చింది

ఇళ్లు వదిలి, పిల్లల్ని వదిలి, చేలు వదిలి

స్త్రీలు పురుషులుగా వస్తున్నారు ప్రజలు

చట్టాలు వెనక్కి తీసుకో లేదా

గద్దె మీంచి దిగిపో అని గర్జిస్తూ

అన్ని వైపుల నుంచి మంటల హారాలుగా జ్వలిస్తూ

రాజ్యానికి పొగబెడుతున్నారు

చట్టాలనేమిటి, ప్రభుత్వాలనేమిటి

రాజ్యాలనేమిటి

నోటికంది కడుపులోకి పోని స్వప్నాన్నైనా

తమ చేతులారా ధ్వంసం చేసే

నూతన సృష్టికర్తలు వాళ్లు

మహదేవుడు

Updated Date - 2021-03-01T06:42:33+05:30 IST