ఫ్రాన్స్ ప్రెసిడెన్షియల్ ప్యాలెస్‌లో అఘాయిత్యంపై దర్యాప్తు

ABN , First Publish Date - 2021-11-13T20:30:10+05:30 IST

ఫ్రాన్స్ ప్రెసిడెన్షియల్ ఎలిసీ ప్యాలెస్‌లో కొద్ది నెలల

ఫ్రాన్స్ ప్రెసిడెన్షియల్ ప్యాలెస్‌లో అఘాయిత్యంపై దర్యాప్తు

పారిస్ : ఫ్రాన్స్ ప్రెసిడెన్షియల్ ఎలిసీ ప్యాలెస్‌లో కొద్ది నెలల క్రితం ఓ మహిళపై లైంగిక అఘాయిత్యం జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు జరుగుతోందని పారిస్ ప్రాసిక్యూటర్స్ ఆఫీస్ ఓ వార్తా సంస్థకు తెలిపింది. జూలై ఒకటిన ఓ సర్వీస్‌మ్యాన్ తనపై అత్యాచారం చేసినట్లు ఈ ప్యాలెస్‌ భద్రతా సిబ్బందిలో ఓ మహిళా గార్డు ఆరోపించినట్లు పేర్కొంటున్న ఫ్రెంచ్ మీడియా కథనాలను ధ్రువీకరించలేదు. అయితే జూలై 12న దర్యాప్తు ప్రారంభమైందని మాత్రమే తెలిపింది. 


మహిళా గార్డుపై దాడి సమయంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రన్ సంఘటనా స్థలానికి సమీపంలో లేనట్లు ఫ్రెంచ్ మీడియా తెలిపింది. కానీ ఆ రోజు సాయంత్రం ఆయన ఓ కార్యక్రమంలో పాల్గొన్నట్లు తెలిపింది. ఆయన ఈ ఎలిసీ ప్యాలెస్‌లోనే నివసిస్తున్నారు. 


బాధిత మహిళపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సర్వీస్‌మ్యాన్‌ను సహాయ సాక్షిగా ప్రశ్నించినట్లు పారిస్ ప్రాసిక్యూటర్స్ కార్యాలయం తెలిపింది. ఆయనను ఓ అనుమానితుడిగా ప్రశ్నించలేదని పేర్కొంది. ఈ కేసుకు సంబంధించిన ఇతర వివరాలను వెల్లడించలేదు. 


ఈ ఆరోపణలపై దర్యాప్తు జరుగుతున్నందువల్ల స్పందించబోమని ఎలిసీ వర్గాలు తెలిపాయి. ఈ సంఘటన గురించి సమాచారం తెలిసిన వెంటనే బాధితురాలికి అండగా నిలిచినట్లు తెలిపింది. నిందితుడు ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ ఉద్యోగం నుంచి వైదొలగినట్లు పేర్కొన్నాయి. జ్యుడిషియల్ దర్యాప్తులో మరిన్ని వివరాలు వెల్లడైతే, తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపాయి. 


Updated Date - 2021-11-13T20:30:10+05:30 IST