పాపాల కూటములు!

ABN , First Publish Date - 2021-04-03T07:11:52+05:30 IST

కేరళలో సీపీఎం నేతృత్వంలోని పాలక ఎల్‌డీఎఫ్‌, కాంగ్రెస్‌ సారథ్యంలోని విపక్ష యూడీఎ్‌ఫలను పాపాల కూటములుగా ప్రధాని మోదీ అభివర్ణించారు.

పాపాల కూటములు!

  • ఎల్‌డీఎఫ్‌, యూడీఎ్‌ఫపై ప్రధాని ఆగ్రహం
  • కేరళ, తమిళనాడులో ప్రచారం


తిరువనంతపురం/చెన్నై, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): కేరళలో సీపీఎం నేతృత్వంలోని పాలక ఎల్‌డీఎఫ్‌, కాంగ్రెస్‌ సారథ్యంలోని విపక్ష యూడీఎ్‌ఫలను పాపాల కూటములుగా ప్రధాని మోదీ అభివర్ణించారు. వాటి నుంచి రాష్ట్రాన్ని విముక్తం చేయాలని ప్రజలకు పిలుపిచ్చారు. తమిళనాట డీఎంకే, కాంగ్రె్‌సలపైనా విరుచుకుపడ్డారు. ఆరో తేదీన పోలింగ్‌ జరగనున్న ఈ రెండు రాష్ట్రాల్లో ఆయన శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కేరళలో సభల్లో మాట్లాడుతూ.. ఎల్‌డీఎఫ్‌, యూడీఎఫ్‌ ఏడు పాపాలు చేశాయన్నారు.


‘మొదటిది.. తమనెవరూ ఓడించలేరన్న దురహంకారం.. గర్వం. రెండోది ధనాపేక్ష. అన్నీ కుంభకోణాలే. ప్రజలను ప్రతి రంగంలో దోచుకున్నాయి. మూడోది.. ప్రజలంటే కోపం. అయ్యప్ప భక్తులేమైనా నేరస్థులా? వారిపై లాఠీచార్జి చేశారు. పవిత్ర స్థలాలను అస్థిరపరచడమే సీపీఎం ధ్యేయం. నాలుగో పాపం.. అసూయ. ఈ రెండు కూటములూ పరస్పరం అసూయతో రగులుతుంటాయి. అవినీతిలో పోటీ పడుతుంటాయి. ఐదోది అధికార లాలస. గద్దెనెక్కడం కోసం మతతత్వ, నేరపూరిత, ప్రగతినిరోధక శక్తులతో జట్టు కడుతుంటాయి.


ఆరోది.. వంశ పాలన. రాష్ట్రంలో వంశ పాలన పెంచేందుకు ఆయా కూటముల నేతలు అత్యాసక్తితో ఉన్నారు. ఏడవది పనిలో సోమరితనం. అక్రమార్జన, వంశ పాలనే ప్రధానమైనప్పుడు పరిపాలన వెనక్కి పోతుంది. ఈ రెండు కూటములూ కేరళలో విధానపరమైన పక్షవాతాన్ని తెచ్చాయి’ అని మోదీ విరుచుకుపడ్డారు. కేరళ ప్రజలు బీజేపీ అభివృద్ధి అజెండా, విధానాలపై ఆసక్తి కనబరుస్తున్నారని చెప్పారు.


‘మెట్రోమ్యాన్‌’ ఈ.శ్రీధరన్‌ను చూపిస్తూ.. మెట్రో రైలు నిర్వహణలో కీలక పాత్ర పోషించారని.. ఇప్పుడు సమాజక సేవకు బీజేపీని సాధనంగా ఎంచుకున్నారని చెప్పారు. మహిళలను డీఎంకే, కాంగ్రెస్‌ నేతలు అవమానిస్తూనే ఉంటారని.. అదే వారి నైజమని ప్రధాని ధ్వజమెత్తారు. ‘డీఎంకే, కాంగ్రె్‌సకు ఎలాంటి అజెండా లేదు. వారొస్తే ప్రజల మాన ప్రాణాలకు గ్యారెంటీ ఉండదు. శాంతిభద్రతల పరిస్థితి దెబ్బతింటుంది’ అని స్పష్టం చేశారు. డీఎంకే నేతలు తమిళ సంస్కృతికి రక్షకులుగా చెప్పుకొంటారని.. కానీ దానికి పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తారని మోదీ దుమ్మెత్తిపోశారు.


Updated Date - 2021-04-03T07:11:52+05:30 IST