ఆన్‌లైన్‌ బుకింగ్‌ భక్తులకు సులభంగా గదుల కేటాయింపు

ABN , First Publish Date - 2021-04-20T06:09:34+05:30 IST

ఆన్‌లైన్‌ ద్వారా బుక్‌ చేసుకున్న భక్తులు.. తిరుమలకు చేరుకోగానే సులభంగా వసతి గదిని పొందేలా టీటీడీ ప్రత్యేక చర్యలకు శ్రీకారం చుట్టింది.

ఆన్‌లైన్‌ బుకింగ్‌ భక్తులకు సులభంగా గదుల కేటాయింపు

కాలినడక మార్గాలు, టోల్‌గేట్‌ వద్ద స్కానింగ్‌ కేంద్రాలు

తిరుమలకు చేరుకుని, నేరుగా వసతి గది పొందేలా చర్యలు


తిరుమల, ఏప్రిల్‌ 19 (ఆంధ్రజ్యోతి): ఆన్‌లైన్‌ ద్వారా బుక్‌ చేసుకున్న భక్తులు.. తిరుమలకు చేరుకోగానే సులభంగా వసతి గదిని పొందేలా టీటీడీ ప్రత్యేక చర్యలకు శ్రీకారం చుట్టింది. ఇందుకోసం అలిపిరి పాదాల మండపం, శ్రీవారిమెట్టు కాలినడక మార్గాలతోపాటు అలిపిరి టోల్‌గేట్‌లో రిసిప్టుల స్కానింగ్‌ కేంద్రాలను సోమవారం ప్రారంభించారు. వీటితోపాటు సీఆర్వో జనరల్‌ కార్యాలయంలో ఇప్పటికే ఉన్న కౌంటర్ల వద్ద కూడా గదుల రిసిప్టులను స్కాన్‌ చేసుకునేలా చర్యలు తీసుకున్నారు. పాత విధానంలో అయితే ఆన్‌లైన్‌లో గదులు బుక్‌ చేసుకున్న భక్తులు సీఆర్వో కార్యాలయానికి వెళ్లి రిసిప్టులు స్కాన్‌ చేసుకుని, అక్కడినుంచి ఆయా సబ్‌ ఎంక్వైరీ కార్యాలయానికి చేరుకుని గదులు పొందేవారు. దీనివల్ల సమయం వృఽథా అవుతోందని భక్తులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో టీటీడీ ఉన్నతాధికారులు నూతన విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. భక్తులు సీఆర్వో కార్యాలయానికి వెళ్లే అవసరం లేకుండా అలిపిరి కాలినడక మార్గాలతోపాటు టోల్‌గేట్‌ వద్దే స్కానింగ్‌ కౌంటర్లు ఏర్పాటు చేశారు. యాత్రికులు ఈ కౌంటర్లలో రిసిప్టును స్కాన్‌ చేయించుకున్నాక రిజిస్టర్డ్‌ మొబైల్‌ నెంబరుకు గది కేటాయించిన సబ్‌ ఎంక్వైరీ వివరాల సమాచారం అందుతుంది. దీనిద్వారా భక్తులు నేరుగా ఆ సబ్‌ ఎంక్వైరీకి చేరుకుని తమకు కేటాయించిన గది తాళాలను తీసుకునేలా టీటీడీ ప్రణాళికలు రూపొందించుకుంది. 


సామాన్య భక్తుల కోసం సబ్‌ ఎంక్వైరీల వద్దనే అలాట్‌మెంట్‌ కౌంటర్లు

శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకునే భక్తులు ఎలాంటి సిఫార్సు లేకుండా గదులు తీసుకోవాలంటే సీఆర్వో జనరల్‌ క్యారాలయానికి వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ ముందుగా మొబైల్‌ నెంబరును నమోదు చేసుకుని టోకెన్‌ పొందితే కొంత సమయం తర్వాత సెల్‌ఫోన్‌కి సందేశం వస్తుంది. దానిద్వారా తిరిగి సీఆర్వోకి వెళ్లి గదిని పొందాల్సి ఉంటుంది. అయితే సామాన్య భక్తులు కూడా సులభంగా గదులు పొందేందుకు టీటీడీకి ప్రత్యేక చర్యలకు పూనుకుంది. సీఆర్వో కార్యాలయాన్ని వికేంద్రీకరించి ఆరు ప్రాంతాల్లో 12 రిజిస్ర్టేషన్‌ కౌంటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ ప్రాంతాల్లో రిజిస్ర్టేషన్‌ చేసుకుంటే ప్రతి విశ్రాంతి భవానాలకు ఉండే సబ్‌ ఎంక్వైరీ కార్యాలయం వివరాలు తెలియజేస్తారు. భక్తులు నేరుగా ఆయా సబ్‌ఎంక్వైరీ కేంద్రాలకు వెళ్లి అలాట్‌మెంట్‌ కౌంటర్లలో గదులు పొందవచ్చు. త్వరలోనే ఈ విధానాన్ని అమలు చేసేలా టీటీడీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. 

Updated Date - 2021-04-20T06:09:34+05:30 IST